Paris 2024 Olympics: స్టార్ బాక్సర్‌, రెండుసార్లు ప్రపంచ ఛాంపియన్‌, తెలుగు అమ్మాయి నిఖత్‌ జరీన్‌ తొలి మ్యాచ్‌లో అదరగొట్టింది. ఉమెన్స్‌ 50 కిలోల విభాగంలో జర్మనీకి చెందిన మ్యాక్సీ కరీనా క్లోట్జర్‌ను చిత్తు చేసి ప్రీ క్వార్టర్‌ ఫైనల్‌కు చేరింది. జర్మనీ బాక్సర్‌ను 5-0తో చిత్తు చేసి నిఖత్‌ సత్తా చాటింది. నిఖత్‌ పంచ్‌ పవర్‌కు ప్రత్యర్థి వద్ద అసలు సమాధానమే లేకుండా పోయింది. మాక్సీ కరీనా క్లోట్జర్‌తో జరిగిన మ్యాచ్‌లో నిఖత్ తొలి బౌట్‌ నుంచే పూర్తి ఆధిపత్యం ప్రదర్శించింది.  రెండుసార్లు ప్రపంచ ఛాంపియన్ అయిన నిఖత్ జరీన్ మొదటి రౌండ్‌లో కాస్త వెనకపడిన వెంటనే తేరుకుని దూకుడు ప్రదర్శించింది. తొలి రౌండ్ బై అందుకున్న చైనాకు చెందిన ప్రస్తుత ఫ్లైవెయిట్ ప్రపంచ ఛాంపియన్ వు యుతో గురువారం నిఖత్‌ జరీన్‌ తలపడనుంది. ఈ మ్యాచ్‌లో నిఖత్‌ జరీన్‌ విజయం సాధిస్తే భారత్‌కు దాదాపుగా పతకం ఖాయమైనట్లే. ప్రస్తుతం అత్యుత్తమ బాక్సర్‌గా ఉన్న వు యుతో తలపడే మ్యాచ్‌లో చైనా గోడను బద్దలు కొడితే నిఖత్‌ క్వార్టర్స్‌కు చేరుతుంది. 




 

టేబుల్ టెన్నిస్‌లో మిశ్రమ ఫలితాలు 

టేబుల్‌ టెన్నిస్‌లో టీమిండియాకు మిశ్రమ ఫలితాలు వచ్చాయి. మహిళల సింగిల్స్‌లో  స్టార్‌ ప్లేయర్‌ మనిక బత్రా, తెలుగమ్మాయి ఆకుల శ్రీజ తదుపరి రౌండ్‌కు అర్హత సాధించారు. రౌండ్‌ ఆఫ్‌ 64లో మనిక 4-1 తేడాతో బ్రిటన్ క్రీడాకారిణి అన్నా హర్సీపై...ఆకుల శ్రీజ 4-0 తేడాతో స్వీడన్‌కు చెందిన క్రిస్టినాపై విజయం సాధించారు. పురుషుల సింగిల్స్‌లో మాత్రం భారత్‌కు షాక్‌ తగిలింది. అయిదో ఒలింపిక్స్‌ ఆడుతున్న 41 ఏళ్ల శరత్‌ కమల్‌ తొలి రౌండ్‌లోనే నిష్క్రమించాడు. స్లోవేకియాకు చెందిన డెని కొజుల్ చేతిలో శరత్‌ కమల్ ఓడిపోయాడు. అయినా శరత్‌ డబుల్స్, మిక్స్‌డ్‌ డబుల్స్‌లో ఒలింపిక్స్‌ బరిలో ఉన్నాడు.

 

స్విమ్మింగ్‌లో ముగిసిన పోరాటం

స్విమ్మింగ్‌లో భారత పోరాటం ముగిసింది. శ్రీహరి నటరాజన్‌, దినిధి దేశాంగు పోరాటం ముగిసింది. సెమీ ఫైనల్స్‌కు చేరుకోవడంలో వీరిద్దరూ విఫలం అయ్యారు. పురుషుల 100మీ బ్యాక్‌స్ట్రోక్‌ హీట్‌-2లో శ్రీహరి నటరాజన్‌ 33వ స్థానంలో నిలిచాడు. దినిధి 200మీ ఫ్రీస్టైల్‌ హీట్‌-1లో 23వ స్థానంలో నిలిచారు. టాప్‌-16లో నిలిచిన వారు మాత్రమే ఫైనల్స్‌కు అర్హత సాధిస్తారు. వీరిద్దరూ టాప్‌ 16లో నిలవకపోవడంతో సెమీస్‌కు చేరడంలో విఫలమయ్యారు. 

 

ఫైనల్‌కు అర్జున్

భారత షూటింగ్ జట్టు పారిస్ ఒలింపిక్స్‌2024లో అద్భుతమైన ప్రదర్శన కొనసాగిస్తోంది. పురుషుల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ ఈవెంట్‌లో సత్తా చాటిన షూటర్ అర్జున్ బాబౌటా ఫైనల్‌కు చేరుకున్నారు. క్వాలిఫయింగ్ రౌండ్‌లో అర్జున్ 7వ స్థానంలో నిలిచారు. మరోవైపు సందీప్ సింగ్ కూడా ఈ పోటీలో పాల్గొని చివరికి ర్యాంకింగ్‌(12వ స్థానం)లో నిలిచారు.