Manu Bhaker's First Reaction On Winning Bronze Medal: పారిస్ ఒలింపిక్స్‌లో 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ షూటింగ్ ఈవెంట్‌లో కాంస్య పతకం సాధించిన భారత ప్లేయర్ మను భాకర్( Manu Bhaker)కు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అభినందనలు తెలిపారు. 'భారతదేశానికి పతకాన్ని తీసుకొచ్చిన మను భాకర్‌కు హృదయపూర్వక అభినందనలు. మను భాకర్ పట్ల భారతదేశం గర్విస్తోంది. ఆమె విజయం చాలా మంది క్రీడాకారులకు, ముఖ్యంగా మహిళలకు స్ఫూర్తినిస్తుంది.' అని రాష్ట్రపతి ట్వీట్ చేశారు. మను భాకర్ కు ప్రధాని నరేంద్ర మోదీ అభినందనలు తెలిపారు. భారత్ తరపున షూటింగ్ లో పతకం సాధించిన మెుదటి మహిళ కావడం వల్ల ఈ విజయం ఎంతో ప్రత్యేకమైనదన్నారు.
ఈ సందర్భంగా కేంద్ర మంత్రులు, రాజకీయ నాయకులు, క్రీడా ప్రముఖలు ఆమెకు శుభాకాంక్షలు తెలుపుతూ సోషల్ మీడియాలో పోస్టులు చేస్తున్నారు.
నన్ను నడిపించింది భగవద్గీతే
ఒలింపిక్స్‌లో పతకం సాధించిన భారత మహిళా షూటర్‌గా మను బాకర్ చరిత్ర సృష్టించింది. అయితే తన గెలుపులో భగవద్గీత కీలక పాత్ర పోషించిందని విజయం అనంతరం బాకర్ వ్యాఖ్యానించింది. అర్జునుడికి కృష్ణుడు చేసిన హితోపదేశమే తనకు మార్గ నిర్దేశం చేసిందని తెలిపింది. మీరు కర్మపై దృష్టి పెట్టండని.. ఫలితంపై కాదన్న భగవద్గీత శ్లోకమే తనలో స్ఫూర్తి నింపిందని వెల్లడించింది. "నిజాయితీగా చెప్పాలంటే, నేను భగవద్గీత చదివాను. అది నాపై చెరగని ముద్ర వేసింది. నువ్వు ఏం చేయాలనుకుంటున్నావో అది చేయి. ఫలితం గురించి మాత్రం ఆలోచించకు. ఫలితం ఎలా ఉన్నా దాని గురించి పట్టించుకోవద్దు. అని గీతలో అర్జునుడికి కృష్ణుడు హితోపదేశం చేశాడు. మీరు కర్మపై దృష్టి పెట్టండి, ఫలితంపై కాదన్న ఆ మార్గ నిర్దేశ వ్యాఖ్యలే నన్ను ముందుకు నడిపిస్తున్నాయి “ అని మను బాకర్ అన్నారు. 2020 టోక్యో ఒలింపిక్స్‌లో తన ప్రదర్శనతో చాలా నిరుత్సాహానికి గురయ్యానని తెలిపింది. దాని నుంచి కోలుకోవడానికి చాలా సమయం పట్టిందని... అక్కడి నుంచి కోలుకుని ఇప్పుడు ఈ పతకం సాధించానని మను బాకర్ తెలిపింది. తాను గతంపై దృష్టి పెట్టనని.. వర్తమానంపై దృష్టి పెడతానని మనుబాకర్ తెలిపింది. ఈ విజయం సాధించినందుకు తాను చాలా గర్వపడుతున్నానని తెలిపింది.
మరీ ఇంత నాసికరం దుస్తులా: గుత్తా జ్వాల
పారిస్ ఒలింపిక్స్‌లో భారత్ అథ్లెట్లకు ఇచ్చిన వస్త్రాలపై విమర్శలు వస్తూనే ఉన్నాయి. దుస్తులను డిజైన్ చేసిన వారిపై భారత మాజీ బ్యాడ్మింటన్ స్టార్ గుత్తా జ్వాలా అసహనం వ్యక్తం చేశారు. ఒలింపిక్స్‌లో పాల్గొనే భారత బృందం కోసం తయారు చేసిన వస్త్రాలు చాలా నిరాశపరిచాయని ఆమె అన్నారు. భారత సంప్రదాయాలను ప్రతిబింబించే మన కళలను ప్రదర్శించే అవకాశం ఉన్నా డిజైనర్లు ఉపయోగించుకోలేదని ఆరోపించింది.