Paris Olympics 2024 india performance on first day : పారిస్ వేదికగా అంగరంగ వైభవంగా ప్రారంభమైన విశ్వక్రీడ(Paris Olympics 2024)ల్లో తొలిరోజు భారత్‌కు మిశ్రమ ఫలితాలు వచ్చాయి. షూటింగ్‌లో భారత షూటర్ల గురి తప్పింది. ఈసారి షూటింగ్‌లో భారత్‌కు పతకాలు తప్పక వస్తాయని అంచనాలు ఉన్నా.. తొలిరోజు దానికి తగ్గట్లు ఫలితాలు మాత్రం రాలేదు. మనుబాకర్ తప్ప మిగిలిన షూటర్లు విఫలమయ్యారు. ఫైనల్‌కు అర్హత సాధించలేక పోవడంతో తొలిరోజు భారత్‌కు నిరాశే మిగిలింది.
మొత్తంగా షూటింగ్‌లో నిరాశే
అధికారికంగా తొలి రోజే పతకాల వేట ప్రారంభించిన భారత షూటర్లు గురి చూసి లక్ష్యాన్ని ఛేదించడంలో కాస్త తడబడ్డారు. మిక్స్‌డ్ టీమ్ ఈవెంట్‌లో వలరివన్,-సందీప్ సింగ్, రమిత-అర్జున్ బబుతా గురి తప్పారు. 10 మీటర్లు ఎయిర్ రైఫిల్ మిక్స్‌డ్ విభాగంలో ఈ జోడీలు నిరాశపర్చాయి. మిక్స్‌డ్ టీం ఈవెంట్‌లో అర్హత పోటీల్లో రమిత-అర్జున్ బబుతా జోడీ 628.7 స్కోర్ చేసింది. ఈ స్కోర్‌తో ఈ జంట ఆరో ప్లేస్‌లో నిలిచి ఫైనల్‌కు అర్హత సాధించడంలో విఫలమైంది. ఇదే విభాగంలో తలపడిన వలరివన్- సందీప్ సింగ్ జోడి మరింత నిరాశపర్చింది. ఈ జోడి 626.3 పాయింట్లు సాధించి 12 స్థానంలో నిలిచింది. ఈ రెండు జోడీలకు టాప్ ఫోర్‌లో చోటు దక్కకపోవడంతో ఫైనల్‌కు అర్హత సాధించడంలో విఫలమయ్యారు.
సరబ్‌జోత్ జస్ట్ మిస్
షూటింగ్ 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ క్వాలిఫికేషన్ మెన్స్ ఈవెంట్‌లో సరబ్‌జోత్ సింగ్, అర్జున్ చీమాల గురి కూడా తప్పింది. ఫైనల్ చేరాలంటే టాప్ ఎయిట్‌లో చోటు దక్కించుకోవాల్సి ఉంటగా వీరిద్దరూ టాప్ 8 లో చోటు దక్కించుకోలేకపోయారు. 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ క్వాలిఫికేషన్‌లో సరబ్‌జోత్‌కు ఫైనల్ బెర్తు జస్ట్‌లో మిస్ అయింది. ఆరంభంలో టాప్ 3లోకి దూసుకెళ్లి ఫైనల్ ఆశలు రేపిన సరబ్‌జోత్ ఆ తర్వాత గురి తప్పాడు. చివరకు 9వ స్థానంలో నిలవడంలో ఫైనల్ ఆశలు ఆవిరయ్యాయి. అర్జున్ చీమా 18వ స్థానంలో పూర్తిగా నిరాశపర్చాడు.
ఫైనల్‌కు మనుబాకర్
ఉమెన్స్ 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ క్వాలిఫికేషన్‌లో మను బాకర్ ఫైనల్ చేరింది. మహిళల విభాగంలో టాప్ 3లో నిలిచి తుదిపోరుకు అర్హత సాధించింది. ఈ విభాగంలో టాప్ 8లో నిలిచిన వారు ఫైనల్‌కు అర్హత సాధిస్తారు. అయితే మనుబాకర్ మూడో స్థానంలో నిలిచి సగర్వంగా ఫైనల్‌కు చేరి పతకంపై ఆశలు రేపుతోంది. మరో భారత షూటర్ రిథమ్ సంగ్వాన్ 15వ స్థానంలో నిలిచి ఫైనల్‌కు చేరలేకపోయింది. 10 మీటర్లు ఎయిర్ పిస్టల్ ఫైనల్ రేపు మధ్యాహ్నం 3.30 గంటలకు జరుగుతాయి. ఈ ఈవెంట్‌లో భారత్‌కు పతకం ఖాయమైతే అది తొలి పతకమయ్యే అవకాశం ఉంది.