Manu Bhaker becomes 1st Indian to win 2 medals in Olympic Games:  124 ఏళ్ల రికార్డును కాలగర్భంలో కలిపేస్తూ కొత్త చరిత లిఖితమైంది. స్వాతంత్ర భారత చరిత్రలో ఇంతవరకూ ఎన్నడూ రాయని అద్భుతం ఆవిష్కృతమైంది. భారత క్రీడల్లో అద్భుతం ఎలా ఉంటుందని అడిగితే చూయించేలా... భారత క్రీడా చరిత్రలో ఈరోజును సువర్ణాక్షరాలతో లిఖించేలా... మనూ బాకర్‌(Manu Bhaker) అద్భుతం చేసింది. ఒక్క పతకం కోసం కళ్లు కాయలు కాసేలా  ఎదురుచూస్తున్న భారత క్రీడాభిమానులకు... రెండు పతకాలను అందించి భారత మహిళల సత్తాను అంతర్జాతీయ క్రీడా వేదికపై సగర్వంగా చాటింది స్టార్‌ షూటర్‌ మనూ బాకర్‌. ఇప్పటికే ఒక ఒలింపిక్స్‌ పతకంతో భారత పతకాల వేటను ఆరంభించిన మనూ బాకర్‌... ఇప్పుడు రెండో పతకాన్ని కూడా తన ఖాతాలో వేసుకుంది. 124 ఏళ్ల ఒలింపిక్స్‌ చరిత్రలో ఒకే ఒలింపిక్స్‌లో రెండు పతకాలు సాధించిన ఏకైక భారత అథ్లెట్‌గా చరిత్ర సృష్టించింది. 


మనూ  గురి తప్పలేదు
తాను గురి చూసి కొడితే ఒలింపిక్స్‌ పతకం తన మెడలో చేరాల్సిందే అంటూ మనూ బాకర్‌ మరోసారి నిరూపించింది. 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ మిక్స్‌డ్ టీమ్ ఈవెంట్‌లో సరబ్‌జోత్ సింగ్‌తో కలిసి మనూ బాకర్‌ కంచు మోత మోగించింది. ఈ కాంస్య పతక పోరులో మను బాకర్‌-సరబ్‌జోత్‌ సింగ్‌(Sarbajit singh) జోడి 16 పాయింట్లు సాధించగా.. దక్షిణ కొరియాకు చెందిన లీ-యెజిన్‌ జోడీ కేవలం 10 పాయింట్లు సాధించింది. దీంతో భారత్‌ జోడీ కాంస్య పతకాన్ని సాధించి సత్తా చాటింది. స్వాతంత్ర్యానికి ముందు జరిగిన 1900 ఒలింపిక్స్‌లో నార్మన్ ప్రిచర్డ్ అనే బ్రిటిష్-ఇండియన్ రెండు ఒలింపిక్‌ పతకాలు సాధించాడు. ప్రిచర్డ్ తర్వాత ఏ భారతీయ అథ్లెట్ కూడా ఒకే ఒలింపిక్స్‌లో రెండు పతకాలు సాధించలేకపోయాడు. ఈ రికార్డును సృష్టిస్తూ... తన పేరును చరిత్ర పుటల్లో నిక్షిప్తం చేస్తూ మనూ బాకర్‌ అద్భుతం చేసింది.


ఒకే ఒక్క అథ్లెట్‌
 ఈ విజయంతో, స్వాతంత్ర్యం తర్వాత ఒకే ఒలింపిక్ గేమ్స్‌లో రెండు పతకాలను గెలుచుకున్న మొదటి భారతీయ క్రీడాకారిణిగా మనూ బాకర్‌ నిలిచింది. 22 ఏళ్ల మను మహిళల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ ఈవెంట్‌లో మొదటి కాంస్యం గెలుచుకోగా... కాజాగా . 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ మిక్స్‌డ్ టీమ్ ఈవెంట్‌లోనూ కాంస్యం గెలుచుకుంది. ఒలింపిక్ క్రీడల్లో రెండు పతకాలు సాధించిన భారతీయ అథ్లెట్లు మాత్రం ఉన్నారు. సుశీల్ కుమార్ (రెజ్లింగ్), పీవీ సింధు (బ్యాడ్మింటన్) రెండు ఒలింపిక్స్‌ పతకాలు సాధించారు. అయితే వీరు వేర్వేరు ఒలింపిక్స్‌ ఎడిషన్‌లలో రెండు పతకాలు సాధించారు. 2008 బీజింగ్ గేమ్స్‌లో కాంస్య పతకాన్ని సాధించిన సుశీల్‌... 2012 లండన్  ఒలింపిక్స్‌ లో రజత పతకాన్ని సాధించాడు. రియో ఒలింపిక్స్‌లో రజతం సాధించిన సింధు... 2020టోక్యో  ఒలింపిక్స్‌లో కాంస్యం గెలుచుకుంది. కానీ మనూబాకర్‌ మాత్రం ఒకే ఒలింపిక్స్‌లో ఈ ఘనత సాధించి ఔరా అనిపించింది.