Paris Olympics India's full Day 2  Manu Bhaker archers in focus   : ఒలింపిక్స్‌(Olympics)లో తొలి రోజు భారత్‌(India)కు పతకం దక్కలేదు. నేడు భారత్‌ బోణీ కొట్టే అవకాశం ఉంది. పతక అంచనాలు భారీగా ఉన్న అథెట్లు నేడు బరిలోకి దిగుతున్నారు. విశ్వ క్రీడల్లో నేడు భారత్‌ బోణీ చేస్తారా లేదా అన్నది ఆసక్తికరంగా మారింది. విశ్వ క్రీడల తొలిరోజు భారత్‌కు భిన్న ఫలితాలే వచ్చాయి. షూటింగ్‌లో భారత షూటర్ల గురి తప్పడంతో పతక ఆశలు నెరవేరలేదు. ఇవాళ భారత్‌కు రెండు పతకాల ఈవెంట్లు ఉన్నాయి. ఇందులో ఒక్క పతకమైనా భారత్‌ ఖాతాలో పడుతుందని అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. విశ్వ క్రీడల్లో విలువిద్యలో భారత్‌కు ఇప్పటివరకూ ఒక్క పతకం కూడా దక్కలేదు. ఇవాళ జరిగే ఆర్చరీ పోటీల్లో పతక నిరీక్షణకు తెరదించేందుకు భారత మహిళా ఆర్చర్లు సిద్ధమవుతున్నారు. షూటింగ్‌లో స్టార్‌ షూటర్‌ మను బాకర్‌ నేడు ఫైనల్‌ బరిలో దిగనుంది.




 

ఆర్చరీలో బోణీ కొడతారా...

విశ్వ క్రీడల్లో ఆర్చరీని ప్రవేశపెట్టి 36 సంవత్సరాలు గడుస్తున్నా ఇంతవరకూ భారత్‌ ఒక్కటంటే ఒక్క మెడల్‌ను కూడా సాధించలేదు. కానీ పారిస్‌ ఒలింపిక్స్‌లో భారత ఆర్చరీ  జట్లు పతక ఆశలు రేపుతున్నాయి. క్వాలిఫికేషన్‌ రౌండ్లలో అదరగొట్టిన భారత పురుష, మహిళల ఆర్చర్లు క్వార్టర్‌ ఫైనల్‌కు చేరుకున్నారు. ఇంకో రెండుసార్లు ఈ ఆర్చర్ల గురి కుదిరి రెండు విజయాలు సాధిస్తే భారత్ ఖాతాలో తొలి పతకం వచ్చి చేరుతుంది. ఇవాళ భారత మహిళల జట్టు క్వార్టర్స్‌కు సిద్ధమైంది. ఫ్రాన్స్, నెదర్లాండ్స్‌ మధ్య జరిగే మ్యాచ్‌లో విజేతతో భారత మహిళ ఆర్చర్లు తలపడనున్నారు. అంకిత భాకత్, భజన్‌ కౌర్, దీపిక కుమారిలతో కూడిన భారత బృందం క్వార్టర్స్‌లో సత్తా చాటి సెమీస్‌ చేరాలని పట్టుదలగా ఉంది. వీళ్లు కనుక సెమీస్‌ చేరితే అక్కడ కొరియాతో పోరు జరికే ఆవకాశం ఉంది. కొరియా గండాన్నికూడా దాటితే భారత్‌కు తొలి పతకం వచ్చి చేరుతుంది. అయితే ఆర్చరీలో బలమైన జట్టుగా గుర్తింపు ఉన్న కొరియాను భారత ఆర్చర్లు మట్టికరిపించ గలరేమో చూడాలి. ఇవాళే క్వార్టర్స్, సెమీఫైనల్స్‌ కూడా చేరనుండడంతో ఆర్చరీలో భారత్‌కు తొలి పతకం దక్కాలని అభిమానులు కోరుకుంటున్నారు. పురుషుల ఆర్చరీ జట్టు బొమ్మదేవర ధీరజ్, తరుణ్‌దీప్, ప్రవీణ్‌ జాదవ్‌లతో కూడిన మెన్స్‌ టీం రేపు క్వార్టర్స్‌ ఫైనల్స్‌ ఆడనుంది.

 

 

మను బాకర్‌ గురి కుదిరితే..

ఈ ఒలింపిక్స్‌ 10 మీటర్ల ఎయిర్‌ పిస్టల్‌ ఈవెంట్‌లో ఫైనల్‌కు చేరిన స్టార్‌ షూటర్‌ మను బాకర్‌ నేడు ఫైనల్‌ ఆడనుంది. టాప్‌ త్రీలో నిలిచి ఫైనల్‌కు చేరిన మను పతకంపై కన్నేసింది. ఇవాళ జరిగే ఫైనల్లోనూ మనూ గురి కుదిరితే భారత్‌కు పతకం దక్కే అవకాశం ఉంది. అర్హత పోటీల్లో అద్భుతంగా రాణించిన మనూ... దానినే కొనసాగిస్తే ఇండియా ఖాతాలో మెడల్‌ చేరడం ఖాయమే.