Algerian boxer Imane Khelif clinches medal after gender outcry: ఒలింపిక్స్‌( Olympic Games )లో వివాదస్పద బాక్సర్‌గా ముద్రపడి... వివాదానికి కేంద్ర బిందువుగా మారిన అల్జీరియా బాక్సర్‌ ఇమాన్ ఖలీఫ్‌(Imane Khelif)..కనీసం కాంస్య పతకాన్ని ఖాయం చేసుకుంది. ఓ వైపు ఆమె జెండర్‌పై వివాదం చెలరేగుతున్న వేళ... క్వార్టర్‌ ఫైనల్లో ఘన విజయం సాధించి సెమీఫైనల్లో అడుగుపెట్టిన ఖలీఫ్‌.... కాంస్య పతకాన్ని పొందనుంది. చేసుకుంది. అసలు విశ్వ క్రీడల్లో ఇమాన్ ఖలీఫ్‌... ఎంపికపైనే ఇప్పుడు వివాదం చెలరేగుతోంది. దీనిపై ఒలింపిక్స్ నిర్వహక కమిటీ స్పష్టత ఇచ్చినా వివాదం మాత్రం ఆగడం లేదు. పురుష క్రోమోజోమ్‌లు ఉన్న అథ్లెట్‌ను అసలు ఒలింపిక్స్‌కు ఎలా అనుమతిస్తారంటూ చాలా మంది నెటిజన్లు సోషల్ మీడియా వేదికగా ప్రశ్నిస్తున్నారు. ఈ విమర్శలు చెలరేగుతుండగానే ఖలీఫ్‌ పతకాన్ని ఖాయం చేసుకుంది.

 

మరో ఘన విజయం

లింగ  అర్హత వివాదంలో చిక్కుకున్న అల్జీరియన్ బాక్సర్ ఇమాన్‌ ఖలీఫ్‌.. క్వార్టర్‌ ఫైనల్లోనూ పదునైన పంచులతో విరుచుకుపడింది. క్వార్టర్‌ ఫైనల్లో హంగేరీకి చెందిన అన్నా లుకా హమోరీని ఓడించి సెమీస్‌కు దూసుకెళ్లింది. ఈ బౌట్‌ ముగిసిన అనంతరం జడ్జీల తీర్పు వెలువడకముందే ఇద్దరు బాక్సర్లు హగ్‌ చేసుకోవడంతో విజయం ఎవరిదో తేలిపోయింది. ఈ విజయం అనంతరం ఖలీఫ్‌ భావోద్వేగానికి గురై కన్నీళ్లు పెట్టుకుంది. పెద్ద సంఖ్యలో అల్జీరియ అభిమానులు ఖలీఫ్‌కు మద్దతుగా నినాదాలు చేశారు. ఖలీఫ్‌ను ఎదుర్కోవడం అన్యాయమని బౌట్‌కు ముందే ఆరోపించిన హంగేరీకి చెందిన అన్నా లుకా హమోరీ... బౌట్‌లో మాత్రం పోరాడాలని నిర్ణయించుకుంది. ఫైనల్‌లో చోటు కోసం మంగళవారం థాయ్‌లాండ్‌కు చెందిన జంజెమ్ సువన్నాఫెంగ్‌తో.. ఖలీఫ్ తలపడుతుంది. 

ఆరంభ మ్యాచ్‌లో 46 సెకన్లలోనే గెలిచి ఖలీఫ్‌ ఒలింపిక్స్‌లో సంచలనం రేపింది. అప్పుడే ఆమెను అనేక వివాదాలు చుట్టుముట్టాయి.

 

స్త్రీకి దక్కిన విజయం

ఈ విజయం ప్రతి స్త్రీ గౌరవానికి సంబంధించిన విజయమని విజయం సాధించిన అనంతరం ఇమాన్ ఖలీఫ్‌ వ్యాఖ్యానించింది.  అరబ్ ప్రజలందరికీ  తన గురించి చాలా ఏళ్లుగా తెలుసని... కొన్నేళ్లుగా తాను అంతర్జాతీయ సమాఖ్య పోటీలలో బాక్సింగ్ పోటీల్లో పాల్గొంటూనే ఉన్నానని ఈ బాక్సర్‌ గుర్తు చేసింది. అంతర్జాతీయ బాక్సింగ్‌ ఫెడరేషన్‌ తనకు అన్యాయం చేసినా ఒలింపిక్‌ కమిటీ తనకు న్యాయం చేసిందని ఖలీప్‌ వెల్లడించింది. తన బిడ్డ అమ్మాయేనని... ఒక అమ్మాయిగా పెరిగిందని... ఆమెను ధైర్యంగా పెంచానని ఖలీఫ్ తండ్రి ఒమర్ తెలిపారు. 

 

ఇంతకీ ఏం జరిగిందంటే..?

అల్జీరియన్ బాక్సర్ ఇమాన్‌ ఖలీఫ్‌పై లింగ అర్హత వివాదం చెలరేగింది. ఖలీఫ్‌ మహిళ కాదంటూ చాలామంది కామెంట్లు చేశారు. మహిళల బాక్సింగ్‌  66 కేజీల విభాగంలో మహిళా బాక్సర్‌కు, మగ బాక్సర్‌కు మధ్య  పోటీ జరుగుతుందని చాలామంది ఆరోపణలు చేశారు. ఇటలీ బాక్సర్‌ ఏంజెలా కారినీ, అల్జీరియా బాక్సర్‌ ఇమాన్ ఖలీఫ్‌ తలపడగా ఏంజెలా కేవలం 46 సెకన్లలోనే మ్యాచ్‌ నుంచి పక్కకు తప్పుకుంది. దీంతో అల్జీరియా బాక్సర్ ఇమాన్ ఖలీఫ్ గెలిచింది. . ఇమాన్ ఖలీఫ్ శరీరంలో టెస్టోస్టెరాన్ హార్మోన్ అసాధారణంగా ఉందన్న కారణంతో  ఆమె ‘లింగ పరీక్ష’లో విఫలమవడంతో 2023 ప్రపంచ ఛాంపియన్‌షిప్‌ నుంచి నిషేధించారు. కానీ ఇప్పుడు ఖలీఫ్‌ను విశ్వ క్రీడలకు అనుమతించడంపై విమర్శలు వస్తున్నాయి.