PV Sindhu  eye on  hat-trick in Paris: పారిస్‌ ఒలింపిక్స్‌ 2024(Paris Olympics 2024)లో వరుసగా మూడో పతకంపై భారత స్టార్‌ షట్లర్‌ పీవీ సింధు(Pv Sindhu) కన్నేసింది. ఇప్పటికే ఒక రజత పతకం... మరో కాంస్య పతకంతో వరుసగా రెండు పతకాలు తన ఖాతాలో వేసుకున్న సింధు.. మూడో పతకం సాధించి చరిత్ర సృష్టించాలని పట్టుదలతో ఉంది. ఒలింపిక్స్‌లో పీవీ సింధు పతక వేట ఆదివారం ప్రారంభం కానుంది. తొలి మ్యాచ్‌లో మాల్దీవులకు చెందిన ఫాతిమత్ నబాహా అబ్దుల్ రజాక్‌తో సింధు తలపడనుంది. 2016లో రజత పతకం సాధించిన సింధు... 2021టోక్యో  ఒలిపింక్స్‌లో కాంస్యం  సాధించింది. ఇక పారిస్‌లోనూ పతకం సాధిస్తే వరుసగా మూడు పతకాలు సాధించిన తొలి అథ్లెట్‌గా సింధు రికార్డు సృష్టించనుంది.గత అక్టోబరులో మోకాలి గాయం తర్వాత కొంత కాలం పాటు సింధు ఆటకు దూరంగా ఉన్నారు. సింధు 2024 సీజన్‌లో మలేషియా మాస్టర్స్ ఫైనల్‌లో ఓడిపోయింది. 2024 సీజన్‌లో సింధు 15 విజయాలు, తొమ్మిది పరాజయాలు నమోదు చేసింది.  సింధుకు ఈ ఒలింపిక్స్‌లో పతకం అంత తేలిగ్గా కనిపించడం లేదు. మహిళల సింగిల్స్‌లో 10వ ర్యాంకింగ్‌లో ఉన్న సింధుకు ప్రధాన అవరోధాలను అధిగమిస్తే పతకం చేరినట్లే. మరి సింధుకు సవాల్‌ విసిరే ఆటగాళ్లు, ప్రధాన ప్రత్యర్థులు ఎవరో చూసేద్దామా..? 

 

హి బింగ్ జియావో 

గ్రూప్‌ Mలో ఉన్న సింధు తన తొలి మ్యాచ్‌లో 111వ ర్యాంక్‌లో ఉన్న మాల్దీవుల ఫాతిమత్ నబాహా అబ్దుల్ రజాక్‌తో తలపడుతుంది. ఈ మ్యాచ్‌లో సింధు విజయం లాంఛనమే. అయితే ఈ గ్రూప్‌లో చైనాకు చెందిన హి బింగ్‌ జియావో నుంచి సింధుకు సవాల్‌ ఎదురుకానుంది. టోక్యోలో ఒలింపిక్స్ కాంస్య పతక పోటీలో సింధు 21-13, 21-15 తేడాతో హి బింగ్ జియావోపై సునాయస విజయాన్ని సాధించింది. మరోసారి వీరిద్దరూ తలపడనున్నారు. అయితే గతంతో పోలిస్తే హీ బింగ్‌జియావో బలంగా ఉంది. 2022 అయితే బింగ్‌ జియావోపై సింధుకు మంచి రికార్డు ఉంది. వీరిద్దరి పోరులో సింధు 11-9 రికార్డుతో మెరుగ్గా ఉంది.

 

చెన్ యు ఫీ 

ఈ ఒలింపిక్స్‌ క్వార్టర్‌ ఫైనల్లో సింధు... చైనాకు చెందిన చెన్ యు ఫీతో తలపడే అవకాశం ఉంది. బింగ్జియావోతో జరిగే మ్యాచ్‌లో సింధు గెలిస్తే... క్వార్టర్‌ ఫైనల్లో చెన్‌ యు ఫీతో తలపడనుంది. చెన్ యు ఫీ ఇండోనేషియా ఓపెన్‌ను గెలుచుకుని మంచి ఫామ్‌లో ఉంది. ప్రపంచ ఛాంపియన్‌ యాన్‌ సె యంగ్‌ను కూడా ఓడించి చెన్ యు ఫీ మంచి ఫామ్‌లో ఉంది. ఫ్రెంచ్ ఓపెన్‌లో సింధుపై క్వార్టర్ ఫైనల్లో చెన్‌ యు ఫీ విజయం సాధించింది. 

 


 

కరోలినా మారిన్ 

సింధుకు చిరకాల ప్రత్యర్థి ఎవరైనా ఉన్నారంటే అది కరోలినా మారినే. ఒక వేళ చైనా అడ్డంకులను సింధు అధిగమిస్తే కరోలినా మారిన్‌ ఎదురు కానుంది. సెమీ ఫైనల్స్‌లో సింధు.. మారిన్‌తో తలపడే అవకాశం ఉంది. 2016 ఒలింపిక్స్ ఫైనల్‌లో పరాజయానికి సింధు బదులు తీర్చుకుంటే మరో పతకం ఖాయమైనట్లే.  స్పెయిన్ క్రీడాకారిణి 2018 ప్రపంచ ఛాంపియన్‌షిప్ ఫైనల్‌ సహా గత ఆరు మ్యాచుల్లోనూ సింధును ఓడించింది. మారిన్‌ను ఓడిస్తే సింధు ఖాతాలో పతకం చేరినట్లే.

అయితే ఇప్పటికే ఆసాధారణ ఆటతీరుతో ఎన్నో చిరస్మరణీయ విజయాలు సాధించిన సింధు మరోసారి అలాంటి ప్రదర్శనలు చేసి భారత్‌కు పతకం అందించడం గ్యారెంటీగా కనిపిస్తోంది.