Paris Paralympics 2024 Opening Ceremony:  క్రీడా ప్రపంచానికి స్ఫూర్తిని పంచేలా... మరోసారి అద్భుత ప్రదర్శనతో అందరి కళ్లు తమ వైపు తిప్పుకునేలా... అవయవ లోపం తమకే కాని తమ లక్ష్యానికి కాదన్న సంకల్పాన్ని ప్రపంచానికి చాటేలా... పారిస్‌ వేదికగా మరో విశ్వ క్రీడలు ప్రారంభం అయ్యాయి. పారిస్‌ వేదికగా పారా ఒలింపిక్స్‌(Paris 2024 Paralympics Games) అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. మిరుమిట్లుగొలిపే కాంతుల మధ్య... ఆటగాళ్ల పరేడ్‌ నిర్వహించగా... పారిస్‌ పారా ఒలింపిక్స్‌ ప్రారంభమైనట్లు అధికారిక ప్రకటన చేశారు. నాలుగు వేలమందికిపైగా అథ్లెట్లు, 22 క్రీడాంశాలలో తలపడే ఈ 11 రోజుల క్రీడా సంబురానికి తెరలేచింది. ఈసారి 25 పతకాలే లక్ష్యంగా బరిలోకి దిగిన భారత బృందానికి జావెలిన్‌ త్రోయర్‌ సుమిత్‌ అంటిల్‌( Sumit Antil), షాట్‌పుటర్‌ భాగ్యశ్రీ( Bhagyashri Jadhav) నేతృత్వం వహించారు. వీరిద్దరూ త్రివర్ణ పతాకాన్ని చేతబూని ముందు నడవగా... భారత బృందం అనుసరించింది.





ఒలింపిక్స్‌ను తలదన్నేలా...
పారిస్‌ ఒలింపిక్స్‌ ప్రారంభ వేడుకలను తలదన్నేలా పారా ఒలింపిక్స్‌ ఆరంభ వేడుకలు నిర్వహించారు. పారిస్‌ ఒలింపిక్స్ నిర్వహించినట్లుగానే పారా ఒలింపిక్స్‌ను కూడా స్టేడియం బయటే జరిపారు. ఈ ఆరంభ వేడుకల్లో దివ్యాంగ కళాకారులు చేసిన ప్రదర్శన అబ్బురపరిచింది. దివ్యాంగ కళాకారులూ తమ ప్రతిభను చాటి ప్రేక్షకులను ఉర్రూతలూగించారు. గ్యాలరీలన్నీ జనంతో కిక్కిరిసిపోయాయి.. గాల్లోనూ సాగిన అనేక విన్యాసాలు ప్రేక్షకులను మంత్రముగ్దులను చేశాయి. హాలీవుడ్‌ స్టార్‌ జాకీచాన్‌ క్రీడా జ్యోతిని చేబూని పారిస్‌ వీధుల్లో సందడి చేశాడు. జాకీచాన్‌ రాకతో పారా ఒలింపిక్స్‌కు కొత్త శోభ వచ్చింది. పారా ఒలింపిక్స్‌లో దివ్యాంగ అథ్లెట్ల పరేడ్‌ను ఛాంప్స్‌ ఎలీసీస్‌ నుంచి ప్లేస్‌ డి లా కాంకార్డ్‌ వరకూ వైభవంగా నిర్వహించారు. ఫ్రెంచ్‌ పారా స్విమ్మర్‌ థియో క్యూరిన్‌ కారులో ప్రారంభోత్సవ వేదిక డి లా కాంకార్ట్‌కు వస్తూ పారా అథ్లెట్లకు స్వాగతం పలికాడు. భారీగా హాజరైన ప్రేక్షకుల చప్పట్లుమధ్య ఫ్రాన్స్‌ అధ్యక్షుడు ఇమ్మాన్యుయెల్‌ మెక్రాన్‌(Emmanuel Macron ), ఇంటర్నేషనల్‌ పారాలింపిక్‌ కమిటీ చీఫ్‌ ఆండ్రూ పార్సన్స్‌తో కరచాలనం చేశారు. ఇప్పటికే ఈ పారాలింపిక్స్‌ కోసం 20 లక్షలకు పైగా టికెట్లు అమ్మడుపోయాయి.





కనువిందు చేసిన పరేడ్

కెనడాకు చెందిన ప్రఖ్యాత పియానిస్ట్‌ చిల్లీ గొంజాలెస్..పియానో వాయిస్తుండగా 140 మంది డ్యాన్సర్లతో సాంస్కృతిక కార్యక్రమాలు మొదలయ్యాయి. పారాలింపిక్స్‌ మస్కట్‌ ‘పిర్ఘే’ స్టేజ్‌పైకి వచ్చి అతిథులు, ప్రతినిధులు, అథ్లెట్లకు స్వాగతం పలికి, సందడి చేసింది. అథ్లెట్ల మార్చ్‌పాస్ట్‌ ప్రారంభమైంది. తొలుత అఫ్ఘానిస్థాన్‌ పారా అథ్లెట్లు మార్చ్‌ ఫాస్ట్‌ చేశారు. భారత దేశం తరపున జావెలిన్‌ త్రోయర్‌ సుమిత్‌ అంటిల్‌, షాట్‌పుటర్‌ భాగ్యశ్రీ జాదవ్‌ పతాక ధారులుగా ముందు నడవగా బృందం సభ్యులు వారిని అనుసరించారు. తెల్ల కుర్తా, పైజమాతోపాటు పైన ఓవర్‌ కోట్‌, మెడలో త్రివర్ణ పతాక రంగులతో కూడిన కండువాను ధరించి భారత అథ్లెట్లు పరేడ్‌లో మెరిసిపోయారు.