Paralympics 2024: మరో క్రీడా సంబురం, 25 పతకాలే భారత్ లక్ష్యం
Paralympics 2024: . ఫ్రాన్స్ రాజధాని పారిస్ వేదికగా పారా ఒలింపిక్స్ క్రీడలు ప్రారంభం కానున్నాయి. 12 రోజుల పాటు కొనసాగనున్న ఈ టోర్నీలో భారత్ తరపున 84 మంది అథ్లెట్లు రంగంలోకి దిగుతున్నారు.
Continues below advertisement

నేటి నుంచి పారాలింపిక్స్
Source : Twitter
The Paralympic Games Will Start From Today: మరో క్రీడా సంరంభం ఆరంభమైంది. పారిస్ మరో క్రీడా సంబరానికి వేదికైంది. దివ్యాంగుల కోసం జరిగే ఈ విశ్వ క్రీడల్లో మొత్తం 168 దేశాల నుంచి 4400 మంది అథ్లెట్లు తమ సత్తా చాటేందుకు పాల్గొంటున్నారు. పారిస్ ఒలింపిక్స్(Olympic Games Paris 2024)ను స్వర్ణ పతకం లేకుండా ముగించిన భారత బృందం.. పారాలింపిక్స్(Para Olympics 2024)లో మాత్రం పసిడి పతకాన్ని సాధించాలని పట్టుదలగా కసిగా ఉంది. నేటి నుంచి పారాలింపిక్స్ పారిస్ వేదికగా ప్రారంభం కాబోతున్నాయి. అభిమానుల్లో స్ఫూర్తిని నింపేందుకు.. క్రీడల్లో దివ్యాంగుల ప్రతిభను క్రీడా ప్రపంచానికి చాటేందుకు పారాలింపిక్స్ సిద్ధమైంది. 11 రోజుల పాటు పారిస్ పారాలింపిక్స్ మనల్ని అలరించి స్ఫూర్తి నింపబోతున్నాయి. ఇవాళ డిలా కాంకార్డ్ వేదికలో పారాలింపిక్స్ సందడిగా ఆరంభం కానున్నాయి. ఒలింపిక్స్ లాగానే పారాలింపిక్స్ కూడా చరిత్రలో తొలిసారి స్టేడియంలో కాకుండా బహిరంగ ప్రదేశంలో ఆరంభం కానున్నాయి. పారిస్ ఒలింపిక్స్ జరిగిన క్రీడా వేదికల్లోనే పారాలింపిక్స్ క్రీడలు కూడా జరగనున్నాయి. చైనా 282 మందిని అత్యధికంగా పారాలింపిక్స్‌కు పంపుతోంది.
భారత్ నుంచి బరిలో 84 మంది
పారాలింపిక్స్‌లో భారత్ 84 మందితో బరిలోకి దిగనుంది. ఈసారి భారత్‌పై భారీగా పతక ఆశలు ఉన్నాయి. అథ్లెటిక్స్ (38), బ్యాడ్మింటన్ (13), షూటింగ్ (10), ఆర్చరీ (6), పవర్‌లిఫ్టింగ్ (4), పారా కనోయింగ్ (3), సైక్లింగ్, జూడో, టేబుల్ టెన్నిస్, రోయింగ్ (2), తైక్వాండో, స్విమ్మింగ్ (1) మన అథ్లెట్లు పోటీపడుతున్నారు. తెలుగు రాష్ట్రాల నుంచి జీవాంజి దీప్తి, కొంగనపల్లి నారాయణ, షేక్ అర్షద్, రొంగలి రవి పారిస్‌కు వెళ్లారు. టోక్యో క్రీడల్లో స్వర్ణం నెగ్గిన కృష్ణ నగార్, సుమిత్ అంటిల్, మనీశ్ నర్వాల్ ఈసారి ఆ పతకాన్ని నిలబెట్టుకోవాలనే పట్టుదలతో ఉన్నారు. చేతులు లేకపోయినా విలువిద్యలో అద్భుతాలు చేసే శీతల్ దేవి తొలి పారాలింపిక్స్‌లో తన ముద్ర వేయాలనే సంకల్పంతో ఉంది. 2020 టోక్యో పారాలింపిక్స్‌లో భారత్ 5 బంగారు పాతకాలతో కలిపి 19 పతకాలు సాధించింది. ఈసారి 25 పతకాలు అయినా తేవాలని నిశ్చయించుకుంది. భాగ్యశ్రీ జాదవ్, సుమిత్ అంటిల్ ఇండియా ఫ్లాగ్ బేరర్‌లుగా ఉండనున్నారు.
సమయమిలా...
పారిస్‌లోని పారాలింపిక్స్‌లో ఈవెంట్‌లు ఉదయం 11 గంటలకు ఆరంభం అవుతాయి. అర్ధరాత్రి వరకు కొనసాగుతాయి. భారత్ ఈవెంట్‌లు అన్నీ దాదాపుగా సాయంత్రం, రాత్రి వేళల్లో జరుగుతాయి. పారిస్ పారాలింపిక్స్‌లో 22 క్రీడలలో 549 ఈవెంట్‌లలో పతక పోటీలు జరుగుతాయి. వీటిలో 12 క్రీడల్లో భారత్‌కు ప్రాతినిధ్యం ఉంటుంది. అథ్లెట్ల శారీరక బలహీనత, కార్యకలాపాల స్థాయిని బట్టి 'స్పోర్ట్ క్లాస్'లుగా విభజిస్తారు. దృష్టి లోపం, మేధోపరమైన బలహీనతతో పాటుగా ఎనిమిది రకాల శారీరక వైకల్యాలను పారాలింపిక్స్‌లో వర్గీకరించారు. పారాలింపిక్స్‌లో 167 దేశాలు ప్రాతినిధ్యం వహిస్తున్నాయి. రష్యా, బెలారస్ దివ్యాంగులు తటస్థ పారా అథ్లెట్లుగా బరిలో దిగుతున్నారు.
Continues below advertisement