Neeraj Chopra Manu Bhaker brand value jumps : క్రికెట్‌లో ఎవరైనా ఒక సెంచరీ లేదా.. ఓ కీలకమైన మ్యాచ్‌లో మ్యాన్ విన్నర్ పర్‌ఫార్మెన్స్ ప్రదర్శించారంటే.. ఆ క్రికెటర్‌కు వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం ఉండదు. ఆటలో కాదు.. బయట ప్రకటనల పరంగా వందల కోట్ల ఆదాయం వచ్చి పడుతుంది. ఆ క్రికెటర్లతో ప్రకటనలు రూపొందించుకుని వ్యాపారం పెంచుకునేందుకు కంపెనీలు పోటీ పడతాయి. అందుకే దేశంలో క్రికెట్ తప్ప ఇతర ఆటలు ఎదగడం లేదని.. డబ్బులు ఎక్కువగా వస్తాయి కాబట్టి.. కెరీర్ ను క్రికెట్ లోనే క్రీడాకారులు చూసుకుంటున్నారని విమర్శలు వస్తూ ఉంటాయి. కానీ ఇప్పుడు తకఏ క్రీడలో అయినా సరే మంచి ప్రతిభ చూపిస్తే అందరికీ బ్రాండ్ వాల్యూ ఏర్పడుతుందని తాజాగా తేలింది.
నీరజ్ చోప్రా బ్రాండ్ వాల్యూ రూ. 330 కోట్ల పైనే !
ఒలిపింక్స్ తర్వాత భారత అద్లెట్ల బ్రాండ్ వాల్యూ రాకెట్ స్పీడ్‌తో పెరిగిందని తాజా అధ్యయనంలో తేలింది. ఇటీవలి ఒలింపిక్స్‌లో రజతం.. అంతకు ముందు స్వర్ణం సాధించిన నీరజ్ చోప్రా.. క్రికెటేతర ఆటగాళ్లలో అత్యంత ఎక్కువ బ్రాండ్ వాల్యూ కలిగిన ప్లేయర్ గా నిలిచారు. నీరజ్ చోప్రా బ్రాండ్ వాల్యూ ప్రస్తుతం 40 మిలియన్ డాలర్లకు అంటే 330 కోట్ల రూపాయలకు చేరుకుందని తేలింది. ఒలిపింక్స్‌కు ముందు ఇది 29.6 మిలియన్ డాలర్లుగా ఉంది. గతంలో హార్దిక్ పాండ్యాతో పోటీగా బ్రాండ్ వాల్యూ ఉండేది. కానీ ఇప్పుడు ఆయనను కూడా దాటేసి ఖరీదైన ప్లేయర్ గా మారారు. ఒక్కో బ్రాండ్ ప్రమోషన్‌కు నాలుగు నుంచి నాలుగున్నర కోట్ల వరకూ నీరజ్ చోప్రా వసూలు చేస్తున్నారు.
ఒక్క యాడ్‌కూ రూ. కోటిన్నర చార్జ్ చేస్తున్న మను బాకర్
ఇక ఈ ఒలింపిక్స్ తర్వాత బ్రాండ్ వాల్యూ అమాంతం పెరిగిపోయిన ప్లేయర్ గాష షూటర్ మనుబాకర్ నిలిచారు. గతంలో స్సాన్సర్ల కోసం ఆమె వెదుక్కోవాల్సి వచ్చేది. ఒక్కో బ్రాండ్‌కు పాతిక లక్షలు వస్తే గొప్పగా ఉండేది. కానీ రెండు మెడల్స్ గెలిచిన తర్వాత ఒక్కో యాడ్‌కు రూ. కోటిన్నర వరకూ చార్జ్ చేస్తున్నారు. ఇప్పటికే ఆమెను తమ ఉత్పత్తులకు ప్రచారం చేయాలని నలభై కంపెనీలు సంప్రదించినట్లుగా తెలుస్తోంది.
మూడింతలు పెరిగిన వినేశ్ ఫోగట్ బ్రాండ్ వాల్యూ
ఇక పతకం గెలవకపోయినా మనసులు గెలిచిన వినేష్ ఫోగట్ బ్రాండ్ వాల్యూ కూడా అమాంతం పెరిగిందని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. ఆమె బ్రాండ్ వాల్యూ ఒక్క సారిగా మూడు వందల శాతం పెరిగినట్లుగా అంచనా వేస్తున్నారు. పారిస్ ఒలింపిక్స్‌కు ముందు ఒక్క ఉత్పత్తిని ప్రమోట్ చేయడానికి రూ. పాతిక లక్షలు చార్జ్ చేసేవారు. కానీ ఇప్పుడు అది రూ. కోటికి చేరినట్లుగా మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. క్రికెటేతర ఆటల్లోనూ పెద్ద ఎత్తున ఆటగాళ్లకు బ్రాండ్ వాల్యూ ఏర్పడితే ఇతర ఆటలకూ మన దేశంలో ఆదరణ పెరుగుతుందని అనుకోవచ్చు.