Paris 2024 Olympics Opening ceremony Schedule:
క్రీడల మహా కుంభమేళా నేడు ఆరంభం కానుంది. క్రీడాభిమానులు కళ్లు కాయలు కాసేలా ఎదురుచూస్తున్న విశ్వ క్రీడలు పారిస్(Paris) వేదికగా నేడు అంగరంగ వైభవం ఆరంభం కానున్నాయి. ఏళ్ల తరబడి కఠోర సాధన చేసిన అథ్లెట్లు.. తమ పతక కలను సాకారం చేసుకునేందుకు సిద్ధంగా ఉన్నారు. దిగ్గజాల మెరుపులు... కొత్త ఛాంపియన్‌ల రాక కోసం క్రీడా ప్రపంచం ఉద్విగ్నంగా ఎదురుచూస్తోంది. గత విశ్వ క్రీడలు కరోనా నిబంధనల కారణంగా కఠిన నిబంధనల మధ్య జరగగా ఈ ఒలింపిక్స్ స్వేచ్ఛాయుతంగా జరగనున్నాయి. చరిత్రలో తొలిసారి ఆరంభ వేడకులు స్టేడియంలో కాకుండా బయట నిర్వహిస్తున్నారు. పారిస్ నడిబొడ్డున జరిగే ఈ వేడుకలను చూసేందుకు అతిరథ మహారథులు అందరూ ఇప్పటికే ఫ్రాన్స్(France) రాజధానికి చేరుకున్నారు. పటిష్ట భద్రత మధ్య.. 10 వేల 500 మంది అథ్లెట్లు చేసే కవాతును చూసేందుకు క్రీడా ప్రపంచం ఎదురుచూస్తోంది.
అంతా సిద్ధం..
నాలుగేళ్లకు ఒకసారి నిర్వహించే ఒలింపిక్స్ ప్రారంభ వేడుకలు మన కాలమానం ప్రకారం రాత్రి 11 గంటలకు ఆరంభం కానున్నాయి. పారిస్‌లోని సెన్ నది వేదికగా ఈ వేడుకలను వైభవంగా నిర్వహించనున్నారు. సెన్ నదిపై ఆరు కిలోమీటర్ల దూరం... 205 దేశాలకు చెందిన 10 వేల 500 మంది అథ్లెట్లు పరేడ్ నిర్వహిస్తారు. ఈ పరేడ్ కోసం 94 పడవలను సిద్ధం చేశారు. ఈ 94 పడవల్లో అథ్లెట్లు ఆరు కిలోమీటర్లు దూరం అభిమానులకు అభివాదం చేస్తూ ముందుకు సాగనున్నారు. పరేడ్‌లో మొదటగా గ్రీస్ పరేడ్ నిర్వహించడనుండగా... 84వ దేశంగా భారత్ కవాతు నిర్వహించనుంది. 205వ దేశంగా చివరగా ఆతిథ్య దేశం ఫ్రాన్స్ పరేడ్‌లో పాల్గొననుంది.
పటిష్ట భద్రత
ఆరంభ వేడుకలకు దాదాపు నాలుగు లక్షల మంది ప్రజలు హాజరవుతారన్న అంచనాలతో భారీ భద్రత ఏర్పాటు చేశారు. సుమారు 50 వేల మంది భద్రతా సిబ్బందిని మోహరించారు. పారిస్ చుట్టూ 150 కిలోమీటర్ల మేర ఇప్పటికే నో ఫ్లై జోన్‌ను ప్రకటించారు. ఒలింపిక్స్ ఆరంభ వేడుకలకు ముందే విమానాలు వెళ్లకుండా పారిస్ గగనతలాన్ని మూసేస్తారు. డ్రోన్లు, జాగిలాలు, సీసీ కెమెరాలు, కృత్రిమ మేథ ఇలా భద్రతను కట్టుదిట్టం చేశారు. ఫైటర్ జెట్లు, యుద్ధ విమానాలు, హెలికాఫ్టర్లతో భద్రతను కల్పించారు. భారత్‌కు చెందిన కే9 జాగిలాలు కూడా భద్రతా విధుల్లో పాల్గొంటున్నాయి.
భారత్ ఇలా..
మొత్తం 117 మంది భారత అథ్లెట్లు ఈ ఒలింపిక్స్‌లో బరిలో దిగుతున్నారు. కనీసం 10 పతాకాలు సాధించాలనే లక్ష్యంతో ఉన్నారు. నీరజ్ చోప్రా, సింధు, షూటర్లు, ఆర్చరీ ఈవెంట్‌లపై భారత్‌కు భారీగా అంచనాలు ఉన్నాయి. ఆర్చర్లు ఇప్పటికే శుభారంభం చేశారు. దీంతో భారత్ గత రికార్డులను బద్దలుకొడుతూ ఈసారి అద్భుతాలు చేసే అవకాశం ఉందని అభిమానులు భావిస్తున్నారు.