Nikhat Zareen  out in pre-quarters :  పారిస్ ఒలింపిక్స్‌లో భారత ఆశల్ని మోసుకెళ్తున్న బాక్సర్ నిఖత్ జరీన్ పోరాటం ప్రి క్వార్టర్స్‌లో ముగిసింది.  50 కేజీల విభాగంలో పోటీప‌డ్డ నిఖ‌త్ జ‌రీన్‌ చైనాకు చెందిన వూ యూ చేతిలో ఓడిపోయారు.  ప్రీ క్వార్ట‌ర్స్‌లో నిఖత్ జరీన్ పెద్దాగ పోటీ ఇవ్వలేకపోయారు.  5-0 తేడాతో నిఖ‌త్ బాక్సింగ్ బౌట్‌ను కోల్పోయింది. పారిస్ ఒలింపిక్స్‌లో అన్‌సీడెడ్‌గా నిఖ‌త్ పోటీలో దిగారు. అయితే   52 కిలోల ఫ్ల‌య్‌వెయిట్‌లోనూ ప్ర‌పంచ చాంపియ‌న్ అయిన వూ యూ  ఆధిప‌త్యాన్ని ప్ర‌ద‌ర్శించింది. మెగా గేమ్స్‌లో మెడ‌ల్ సాధిస్తుంద‌ని అనుకున్నా.. నిఖ‌త్‌కు రెండో రౌండ్‌లోనే బ‌ల‌మైన ప్ర‌త్య‌ర్థిని ఎదుర్కోవాల్సి వ‌చ్చింది. దీంతో ఇంటి ముఖం పట్టాల్సి వచ్చింది.

  





 


మరో వైపు  హాకీలో  ఇండియా జట్టు  బెల్జియం చేతిలో ఓడిపోయింది. గత ఒలింపిక్స్‌లో బెల్జియం స్వర్ణం సాధించింది.  డిఫెండింగ్ ఛాంపియ‌న్ అయిన బెల్జియంపై భారత్ టీం మెరుగైన ఆటతీరు చూపించింది.  కానీ చివరిలో తడబడింది.  2-1 తేడాతో బెల్జియం గెలిచింది.   ఆరంభంలో ఇండియానే ఆధిక్యంలో ఉన్నా..  ట్ బెల్జియం అద్భుత‌మైన ఆట తీరును ప్ర‌ద‌ర్శించింది. భార‌త్ త‌ర‌పున అభిషేక్ ఒక్క‌డే గోల్ చేశాడు. ఓ ఆటగాడికి ఎల్లో కార్డు చూపించడంతో.. ఒక ఆట‌గాడు లేకుండానే చివరిలో ఇండియా ఆడాల్సి వ‌చ్చింది.


ఈ ఒలింపిక్స్‌లో భారత్‌ తరపున బాక్సింగ్‌లో లోవ్లీనా, నిశాంత్‌ పోరాటమే మిగిలి ఉంది. క్వార్టర్స్ ఫైనల్స్‌కు చేరిన వీరిద్దరి మ్యాచ్‌లు ఆగష్టు 4న ఉన్నాయి. మరో వైపు  టేబుల్ టెన్నిస్ వ్యక్తిగత విభాగంలో  రౌండ్-16కు అర్హత సాధించిన తొలి భారత ప్లేయర్లుగా మనికా, శ్రీజ కూడా పరాజయం పాలయ్యారు.  జపాన్ క్రీడాకారిణి, వరల్డ్ నంబర్ 8 మియు హిరానో చేతిలో మనికా బత్రా 6-11, 9-11, 14-12, 8-11, 6-11 తేడాతో ఓటమిపాలైంది.  మరో ప్రిక్వార్టర్స్‌లో ఆకుల శ్రీజ చైనా ప్లేయర్, వరల్డ్ నంబర్ వన్ షున్ ఇంగ్షా చేతిలో 4-0తో 12-10, 12-10, 11-8, 11-3 సెట్ల తేడాతో పరాజయాన్ని చవిచూసింది.             


భారత్ ఖాతాలో గురువారం మరో పతకం చేరింది. పురుషుల 50మీ రైఫిల్‌ 3 పొజిషన్స్‌ విభాగంలో స్వప్నిల్‌ కుశాలె కాంస్యం సాధించాడు. ఈ క్రమంలో స్వప్నల్ చరిత్ర సృష్టించాడు. ఈ విభాగంలో పతకం సాధించిన తొలి భారత క్రీడాకారుడిగా చరిత్రకెక్కాడు. ఇప్పటి వరకూ భారత్‌కు మూడు కాంస్య పతకాలు లభిస్తూ.. మూడూ షూటింగ్‌లోనే వచ్చాయి.