ఒలింపిక్స్‌లో క్రికెట్‌ను చూడాలన్న ప్రపంచ క్రికెట్‌ అభిమానుల శతాబ్దపు కల నెరవెరబోతోంది. విశ్వవ్యాప్తంగా ఉన్న క్రికెట్‌ అభిమానులకుఅంతర్జాతీయ ఒలింపిక్‌ కమిటీ అదిరిపోయే శుభవార్త చెప్పింది. లాస్‌ ఏంజెలెస్‌ వేదికగా జరగనున్న 2028 ఒలింపిక్స్‌లో క్రికెట్‌ను కూడా చేరుస్తూ అంతర్జాతీయ ఒలింపిక్స్‌ కమిటీ నిర్ణయం తీసుకుంది. క్రికెట్‌తో పాటు బేస్‌బాల్‌, సాఫ్ట్‌బాల్‌, ఫ్లాగ్ ఫుట్‌బాల్‌, స్క్వాష్‌, లాక్రోసీ క్రీడ‌ల‌ను కూడా 2028 ఒలింపిక్స్‌లో ఆడించాలని అంతర్జాతీయ ఒలింపిక్‌ కమిటీ ప్రతిపాదించింది.  ఒలింపిక్స్‌లో కొత్తగా అయిదు క్రీడ‌ల‌ను చేర్చాల‌నుకున్నార‌ని, దాంట్లో క్రికెట్ కూడా ఉంద‌ని, ఆ ప్రతిపాద‌న‌కు లాస్ఏంజిల్స్ నిర్వాహ‌కులు కూడా ఆమోదించిన‌ట్లు అంతర్జాతీయ ఒలింపిక్‌ కమిటీ అధ్యక్షుడు థామ‌స్ బాచ్ పేర్కొన్నారు.



  2028 లాస్ ఏంజెల్స్ ఒలింపిక్స్‌లో టీ20 క్రికెట్‌ను చేర్చాలన్న సిఫార్సును అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ  అంగీకరించిందని అంతర్జాతీయ  ఒలింపిక్‌ కమిటీ అధ్యక్షుడు థామ‌స్ బాచ్ తెలిపారు. IOC ఆమోదంతో అక్టోబర్ 14 నుంచి 16 వరకు ముంబైలో జరిగే సమావేశాల్లో ఓటింగ్‌ నిర్వహిస్తారు. ఈ ఓటింగ్‌ కేవలం లాంఛనమేనని.. కమిటీ సిఫారసుతో క్రికెట్‌కు ఒలింపిక్స్‌లో స్థానం దక్కడం ఖాయమైందని IOC అధికారి ఒకరు తెలిపారు. మొత్తానికి కమిటీ సిఫారసు చేయడంతో ఇక అంతర్జాతీయ ఒలింపిక్‌ కమిటీ ఆమోదమే మిగిలుంది. ఐఓసీ ఓకే అంటే అమెరికాలో క్రికెట్‌ ఆటకు రంగం సిద్ధమవుతుంది. ఈనెల 15 నుంచి 17 వరకు ముంబైలో జరిగే ఐఓసీ సమావేశంలో క్రికెట్‌ను ఒలింపిక్స్‌లో చేర్చాలా వద్దా అనే విషయంపై నిర్ణయం తీసుకుంటారు.



 ఇప్పటికే వరల్డ్ కప్‌, ఆసియా కప్, ఛాంపియన్స్‌ ట్రోఫీల్లో క్రికెట్‌ను ఆస్వాదిస్తున్న అభిమానులకు ఇప్పుటు విశ్వ వేదికపై క్రికెట్‌ను చూసే అవకాశం దక్కింది. ఒలింపిక్స్‌లో టీ20 ఫార్మాట్‌లో మ్యాచ్‌లు జరుగుతాయి. ఒలింపిక్స్‌లో క్రికెట్‌ను చేర్చడం ద్వారా భారత్‌లో ప్రసార హక్కుల నుంచి భారీగా సొమ్ము రాబట్టాలని కూడా అంతర్జాతీయ ఒలింపిక్స్‌ కమిటీ భావిస్తోంది. ప్రస్తుతం ఒలింపిక్స్‌ ప్రసార హక్కుల వేలం ద్వారా రూ.158 కోట్ల వరకు ఐవోసీ ఆర్జిస్తోంది. అయితే క్రికెట్‌ను ఒలింపిక్స్‌లో చేరిస్తే ప్రసార హక్కుల విలువ భారీగా పెరిగిపోనుంది. సుమారు రూ.15 వేల కోట్లు కేవలం ప్రసార హక్కుల ద్వారానే ఐవోసీకి లభిస్తాయని అంచనా వేస్తున్నారు. 



 1900లో జరిగిన తొలిసారి ఒలింపిక్స్ లో క్రికెట్‌ను ప్రవేశపెట్టారు. 128 సంవత్సరాల తర్వాత 2028 లాస్ ఏంజిల్స్ ఒలింపిక్స్ లోకి ఎంట్రీ ఇస్తోంది. 1900లో జరిగిన పారిస్‌ ఒలింపిక్ క్రీడ‌ల్లో క్రికెట్ ఆడించారు. ఆ ఏడాది ఫైన‌ల్లో ఫ్రాన్స్‌పై బ్రిట‌న్ గెలిచింది. ఆ రోజుల్లో ప్రతి జ‌ట్టులో 12 మంది ఆట‌గాళ్లు ఉండేవారు. రెండు రోజుల పాటు మ్యాచ్‌లు జ‌రిగేవి. 2028లో అమెరికాలో జరిగే ఈ విశ్వక్రీడల కోసం నిర్వాహకులు క్రికెట్‌ను చేర్చేందుకు సిఫారసు చేయడంపై అంతర్జాతీయ క్రికెట్‌ మండలి హర్షం వ్యక్తం చేసింది. లాస్‌ ఏంజెల్స్‌ 2028 ఒలింపిక్స్‌ కమిటీ ముందు ఇప్పటికే ఐసీసీ ప్రెజంటేషన్ కూడా ఇచ్చింది. ఇందులో మెన్స్, వుమెన్స్ కేటగిరీల్లో ఆరేసి జట్లతో టీ20 క్రికెట్ నిర్వహించాలని సిఫారసు చేసింది.