ఒలింపిక్స్ క్రీడలకు ఆతిథ్యం ఇచ్చేందుకు భారత్ చూపుతున్న అమితాసక్తిని తాము గుర్తించామని అంతర్జాతీయ ఒలింపిక్స్ కమిటీ అధ్యక్షుడు థామస్ బాచ్ వెల్లడించారు. 2028 ఒలింపిక్స్‌లో టీ ట్వంటీ క్రికెట్‌ను ప్రవేశపెట్టే అంశంలో చర్చలు జరుగుతున్నట్లు ఆయన తెలిపారు. క్రికెట్‌ను ఒలింపిక్స్‌లో ప్రవేశపెట్టడానికి 2028 సరైన సంవత్సరమని థామస్ బాచ్ అన్నారు. 2036లో ఒలింపిక్స్‌ను నిర్వహించేందుకు భారత్ తన బిడ్ దాఖలు చేయడంపైనా చర్చలు జరుగుతున్నాయని, 2036 ఒలింపిక్స్ నిర్వహణకు అధికారిక బిడ్డింగ్ ప్రక్రియ ఇంకా ప్రారంభం కానప్పటికీ, భారత్ బిడ్ దాఖలు చేసే అవకాశం గురించి తీవ్రమైన పరిశీలనలు జరుగుతున్నాయని బాచ్ తెలిపారు. భారత్ నిర్ణయం ఎలాంటి మార్పు తీసుకుంటుందో చూడాలని వెల్లడించారు.
ఇటీవల ఒలింపిక్స్ నిర్వహణకు భారత్ అమితాసక్తిని ప్రదర్శించడంపై అంతర్జాతీయ ఒలింపిక్స్ కమిటీ అధ్యక్షుడు థామస్ బాచ్ కృతజ్ఞతలు తెలిపారు. ఈ ఆసియా క్రీడల్లో భారత పతకాల జోరును పరిశీలిస్తే... రానున్న రోజుల్లో భారత్ క్రీడల్లో మరింత మెరుగ్గా రాణించగలదని అర్థమవుతోందని బాచ్ అన్నారు. ఆసియా క్రీడల్లో షూటింగ్‌లో మాత్రమే కాకుండా, వివిధ విభాగాల్లో భారత్‌కు ఎక్కువ పతకాలు వచ్చాయని ఆయన తెలిపారు.
40 ఏళ్ల తర్వాత అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ సెషన్ భారత్‌లో జరగబోతోంది. ముంబైలో అక్టోబరు 15 నుంచి 17 వరకు IOC 141వ సెషన్‌ను నిర్వహించనున్నారు. 76 లో 75 ఓట్లతో ఇండియా బిడ్‌ను దక్కించుకుంది. ఇప్పుడు IOC సెషన్ భారతదేశానికి రావడంతో.. ఒలిపింక్ క్రీడలు కూడా ఇండియాకు వస్తాయన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఒలిపింక్ క్రీడలకు సంబంధించిన అన్ని అత్యుతన్న నిర్ణయాలను IOCయే తీసుకుంటుంది. IOC సెషన్ ఒలింపిక్ ఛార్టర్‌ను స్వీకరించడం లేదా సవరించడం, IOC సభ్యులు, అధికారులను ఎన్నుకోవడం, ఒలింపిక్ హోస్ట్ నగరాలను ఎంచుకోవడం.. ఇవన్నీ ఐవోసీ సెషన్స్‌లోనే జరుగుతాయి. ముఖ్యంగా 2028 లాస్ ఏంజెల్స్ ఒలిపింక్స్‌లో క్రికెట్‌ను చేర్చడంపై ఈ సమావేశాల్లోనే నిర్ణయం తీసుకునే అవకాశముంది.
, 1983లో చివరిసారిగా భారతదేశం IOC సెషన్‌ను నిర్వహించింది. అప్పటి నుంచి IOC సెషన్‌నే కాకుండా ఒలింపిక్స్‌కు కూడా ఆతిథ్యం ఇవ్వాలనే ఇండియా కల నెరవేరలేదు. ఆరేళ్ల క్రితం నీతా అంబానీ ప్రైవేట్ రంగం నుంచి కమిటీలో చేరిన మొదటి భారతీయ మహిళగా అవతరించారు. అప్పటివరకూ IOCలో భారత ప్రాతినిధ్యం లేదు. ఆమె నిరంతర ప్రయత్నాలతో 141వ IOC సెషన్‌కు భారత్ ఆతిథ్యమిస్తోంది.
క్రీడలు ఎల్లప్పుడూ ప్రపంచవ్యాప్తంగా మిలియన్ల మందికి ఆశను, స్ఫూర్తిని సూచిస్తాయని IOC సభ్యురాలు నీతా అంబానీ అన్నారు. ప్రపంచంలో యువ జనాభా ఎక్కువగా ఉన్న భారత దేశానికి ఒలిపింక్స్ పరిచయం చేయాలని ఆసక్తిగా ఎదరుచూస్తున్నాని, IOC సెషన్‌ను నిర్వహించాలన్న కల నిజమైందని, ఇక ఇండియాలో ఒలింపిక్ క్రీడలను నిర్వహించాలనేది తన అకాంక్ష అని నీతా అంబానీ తెలిపారు. 2036లో అధికారిక బిడ్ దాఖలు చేయాలని ఇప్పటికే రాజ్యసభ సభ్యురాలు, మాజీ దిగ్గజ స్ప్రింటర్ పీటీ ఉష కూడా సూచించారు. ఒలింపిక్స్ నిర్వహణతో క్రీడల్లో భారత్ ఖ్యాతి విశ్వవ్యాప్తం అవుతుందని ఆమె అభిప్రాయపడ్డారు.