Olympics 2036 In India: ఒలింపిక్స్ నిర్వహణకు భారత్ ముమ్మర ప్రయత్నాలు.. ఖర్చు ఎంతో తెలిస్తే షాకే..!
2036 Summer Olympics: సమ్మర్ ఒలింపిక్స్ 2036 నిర్వహణపై కేంద్ర ప్రభుత్వం పట్టుదలగా ఉంది. గుజరాత్ తో పాటు గోవా, మహారాష్ట్ర, మధ్య ప్రదేశ్ లలో మెగాటోర్నీ నిర్వహణ కోసం వేదికలను చూస్తోంది.
2036 Summer Olympics In India Latest Updates: 2036 ఒలింపిక్స్ నిర్వహణకు భారత్ సిద్దమైన సంగతి తెలిసిందే. ఆ ఏడాది సమ్మర్, వింటర్ ఒలింపిక్స్ నిర్వహణ కోసం ఇప్పటికే ఆసక్తి వ్యక్తికరణ లేఖను అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ (ఐఓసీ)కి అందజేసింది. ప్రస్తుతం ఒలింపిక్ బిడ్ వేసేందుకు గాను కార్యాచరణ సాగుతోంది. అయితే తాజాగా జరిగిన సమావేశంలో ఒలింపిక్స్ నిర్వహణకు ఎంత ఖర్చువుతుందో అంచనా వేశారు. సుమారు రూ.34 వేల నుంచి రూ.72వేల కోట్ల వరకు ఖర్చవుతుందని అంచనా వేశారు. గత ఒలింపిక్స్ ను పారిస్ లో నిర్వహించారు. దీని కోసం రూ.32 వేల కోట్లకుపైగా ఖర్చయ్యింది. తాజాగా గుజరాత్ అహ్మదాబాద్ లో ఒలింపిక్ నిర్వహణ కమిటీ భేటీ వేసింది. ఇందుకు సంబంధించిన వివరాలు బహిర్గతమయ్యాయి. ఈ ఒలింపిక్స్ ను గుజరాత్ లోని జంట నగరాలైన గాంధీ నగర్, అహ్మదాబాద్ లతోపాటు ముంబై, పుణే, గోవా, భోపాల్ లో నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. తాజాగా ఐఓసీ నూతన సారథిగా ఎంపికైన కోవెంట్రీ క్రిస్టీ కూడా భారత బిడ్ పై సానుకూలంగా ఉన్నారు. తాను పగ్గాలు చేపట్టిన తర్వాత దీనిపై మరింత మేథోమథనం జరుగుతుందని పేర్కొన్నారు.
జూన్ లో పగ్గాలు చేపట్టనున్న క్రిస్టీ..
ఐఓసీ చీఫ్ గా చాలాకాలంగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న థామస్ బ్యాచ్ వచ్చే జూన్ లో పదవి నుంచి దిగిపోతున్నాడు. జూన్ 23 ఒలింపిక్ డే సందర్బంగా నూతన సారథిగా క్రిస్టీ బాధ్యతలు చేపడతారు. ఒలింపిక్ బిడ్ కోసం పాత పద్దతే పునరావృతం అవుతుందని, ఇందులో మార్పులేవీ ఉండబోవని, అయితే తాను కొన్ని కొత్త ఐడియాలను ప్రవేశ పెడతానని పేర్కొన్నారు. ఇక 2036 ఒలింపిక్స్ నిర్వహణ కోసం ఖతార్, సౌదీ అరేబియాలతోపాటు పది దేశాలు ఆసక్తిగా ఉన్నాయి. 2026 ముగిసేలోపు దీనిపై స్పష్టత వస్తుంది.
పావులు కదుపుతున్న భారత్..
క్రీడల్లో ఒలింపిక్స్ ఉన్న క్రేజ్ సంగతి తెలిసిందే. ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాలు ఈ టోర్నీని ఒక్కసారైనా నిర్వహించాలని కలలు కంటుంటాయి. ఇప్పటికే దాదాపు అగ్రదేశాలన్నీ ఈ టోర్నీని నిర్వహించి, సత్తా చాటాయి. చైనా, బ్రెజిల్ కూడా ఈ టోర్నీని నిర్వహించిన తమ శక్తియుక్తుల్ని ప్రపంచానికి చాటాయి. బిలియన్ డాలర్లలో అయ్యే ఈ నిర్వహణ ఖర్చును భరించడం చాలా కష్టమే. గ్రీస్ లాంటి దేశాలు దీన్ని నిర్వహించి దివాళా కూడా తీశాయి. అయినప్పటికీ ఒలింపిక్స్ ను నిర్వహించడంలో ఉన్న మజాను దక్కించుకునేందుకు వివిధ దేశాలు ఎప్పటికప్పుడు పోటీపడుతుంటాయి. భారత్ కూడా ఈ ఒలింపిక్స్ పోటీలను నిర్వహించాలని పావులు కదుపుతోంది. అన్నీ అనుకున్నట్లు జరిగితే 2036 ఒలింపిక్స్ కు భారత్ వేదికయ్యే అవకాశముంది. ఆటలకు కేంద్రమైన గుజరాత్ లో మధ్యపాన నిషేధం అమల్లో ఉన్నందున, కొన్ని సడలింపులు ఇవ్వాలని సూచించారు. అలాగే ప్రపంచంలోని పేరేన్నికలగల హోటళ్ల బ్రాంచిలు నగరంలో ఏర్పాటు చేస్తే వసతికి వచ్చిన ఇబ్బందేమీ ఉండదని తెలుస్తోంది. ఇక గుజరాత్ లోని కొన్ని వాతావరణ పరిస్థితులపైన కేంద్రం ఆలోచిస్తోంది. భారీ వర్షాలు, హ్యుమిడిటీ, కొన్ని సందర్బాల్లో 30 డిగ్రీలకు మించిన ఎండ అనేది ఒలింపిక్స్ నిర్వహించే జూలై-ఆగస్టు మాసాల్లో ఉంటుంది, కాబట్టి, తేదిలను అనుకూలంగా ఉండే అక్టోబర్ మాసానికి షిప్ట్ చేసే విధంగా ప్రణాలికలు రచించమని అధికారులకు కేంద్రం ఆదేశించింది.