IPL 2025 KKR Grand Victory: కాస్త చప్పగా సాగిన మ్యాచ్ లో ఊహించినట్లుగానే కోల్ కతా నైట్ రైడర్స్ ఘనవిజయం సాధించింది. బుధవారం గౌహతీలో ఆతిథ్య రాజస్థాన్ రాయల్స్ తో జరిగిన మ్యాచ్ లో 8 వికెట్లతో డిఫెండింగ్ చాంపియన్స్ కేకేఆర్ గెలుపొంది, ఈ సీజన్ లో బోణీ కొట్టింది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లకు 151 పరుగులు సాధించింది. వికెట్ కీపర్ బ్యాటర్ ధ్రువ్ జురెల్ (33) టాప్ స్కోరర్. బౌలర్లలో వరుణ్ చక్రవర్తి పొదుపుగా బౌలింగ్ చేసి కీలకమైన రెండు వికెట్లు తీశాడు. అనంతరం ఛేదనను 17.3 ఓవర్లలో 2 వికెట్లకు 153 పరుగులు చేసి, కంప్లీట్ చేసింది. వికెట్ కీపర్ కమ్ ఓపెనర్ క్వింటన్ డికాక్ (61 బంతుల్లో 97 నాటౌట్, 8 ఫోర్లు, 6 సిక్సర్లు) స్టన్నింగ్ ఫిఫ్టీతో జట్టుకు విజయాన్ని అందించాడు. ఆఖర్లో రాజస్థాన్ బౌలర్లు వైడ్లు వేయడంతో త్రుటిలో డికాక్ తన సెంచరీని కోల్పోయాడు. వనిందు హసరంగాకు ఏకైక వికెట్ దక్కింది.
బెడిసి కొట్టిన రాజస్థాన్ వ్యూహం.. రాజస్తాన్ కు కెప్టెన్ గా వ్యవహరించిన రియాన్ పరాగ్ అనుభవ రాహిత్యం స్పష్టంగా కనిపించింది. దీనికి తోడు బ్యాటర్ల వైఫల్యం కూడా రాయల్స్ కొంప ముంచింది. ముఖ్యంగా స్లో పిచ్ పై కాస్త వేగంగా ఆడాలని రాయల్స్ బ్యాటర్లు బొక్కా బోర్లా పడ్డారు. ఓపెనర్ యశస్వి జైస్వాల్ (29)కి శుభారంభం దక్కినా సద్వినియోగం చేసుకోలేదు. సంజూ శాంసన్ (13), నితీశ్ రాణా (8)తోపాటు కెప్టెన్ రియాన్ పరాగ్ (25) కూడా సత్తా చాటలేక పోయారు. పించ్ హిట్టర్ గా హసరంగా (4)ను పంపడం బెడిసి కొట్టింది. ఈ దశలో జురెల్.. చివరి వరుస బ్యాటర్లతో కలిసి జట్టుకు పోరాడగలిగే స్కోరును సాధించాడు. చివర్లో జోఫ్రా ఆర్చర్ (16) వేగంగా ఆడటంతో టీమ్ స్కోరు 150 పరుగుల మార్కును రాయల్స్ దాటింది. మిగతా బౌలర్లలో వైభవ్ అరోరా, హర్షిత్ రాణా, మొయిన్ అలీకి రెండు వికెట్లు దక్కాయి. గాయం కారణంగా సునీల్ నరైన్ స్థానంలో మొయిన్ జట్టులోకి వచ్చాడు.
డికాక్ హవా..ఇక ఛేజింగ్ లో క్వింటన్ డికాక్ వన్ మేన్ షో నడిపించాడు. ఓపెనర్ గా బరిలోకి దిగి చివరి కంటా నిలిచి, జట్టును విజయతీరాలకు చేర్చాడు. ఫస్ట్ పది ఓవర్లలో పిచ్ కు తగ్గట్లు ఆడిన డికాక్.. తర్వాత డ్యూ కారణంగా బ్యాటింగ్ కు అనుకూలించడంతో రెచ్చిపోయి, వేగంగా ఆడాడు. ఈ క్రమంలో 36 బంతుల్లో ఫిఫ్టీ పూర్తి చేసుకున్న డికాక్.. ఆ తర్వాత దూకుడుగా ఆడాడు. దీంతో మరో 15 బంతులు మిగిలి ఉండగానే కేకేఆర్ విజయం సాధించింది. ఇక ఓపెనర్ గా వచ్చిన మొయిన్ (5) బంతులు వేస్ట్ చేసి, పవర్ ప్లేను వృథా చేశాడు. ఆ తర్వాత కెప్టెన్ అజింక్య రహానే (18), అంగ్ క్రిష్ రఘువంశీ (22 నాటౌట్) తో కలిసి జట్టును విజయ తీరాలకు చేర్చాడు.