IPL 2025 PBKS VS GT Updates: ఐపీఎల్ 2025 ను గూగుల్ సీఈఓ సుంద‌ర్ పిచాయ కూడా క్లోజ్ గా ఫాల్ అవుతున్నారు. తాజాగా ఒక ఫ్యాన్ ఐపీఎల్ పై ప్ర‌శ్న‌ను సంధించ‌గా, తాను రంగంలోకి దిగి, ఔను క‌దా అన్న‌ట్లుగా స‌మ‌ధాన‌మిచ్చారు. నిజానికి క్రికెట్ ను పిచాయ్ ఫాలో అవుతార‌ని తెలుసు కానీ, ఈ రేంజిలో ఫాలో అవుతార‌ని క్రికెట్ అభిమానులు మురిపెంగా పేర్కొంటున్నారు. ఇంత‌కీ ఏం జ‌రిగిందంటే.. మాజీ చాంపియ‌న్స్ గుజ‌రాత్ టైటాన్స్.. అహ్మ‌దాబాద్ లోని న‌రేంద్ర మోడీ స్టేడియంలో పంజాబ్ కింగ్స్ తో త‌ల‌ప‌డింది. ఈ మ్యాచ్ లో కేవ‌లం 11 ప‌రుగుల‌తో గుజ‌రాత్ ప‌రాజ‌యం పాలైంది. అయితే ఈ మ్యాచ్ లో భార‌త ఆల్ రౌండ‌ర్ వాషింగ్ట‌న్ సుంద‌ర్ ను ఎందుకు ఆడించ‌లేద‌ని కొంత‌మంది ఫ్యాన్స్ సోషల్ మీడియా వేదిక‌గా గుజరాత్ ను  ప్రశ్నించారు. అదే ట్వీట్ కి స‌మాధానమిచ్చిన సుంద‌ర్ పిచాయ్.. త‌న మ‌న‌సులోనూ అదే డౌట్ ఉంద‌ని పేర్కొన్నారు. ఇటీవ‌ల భార‌త్ గెలిచిన ఐసీసీ చాంపియ‌న్స్ ట్రోఫీలో పాల్గొన్న 15 మంది స‌భ్యుల బృందంలో వాషింగ్ట‌న్ ఒక‌డు. అయితే అత‌డిని ఎందుకు ప్లేయింగ్ లెవ‌న్ లో ఆడించ‌డం లేద‌ని పేర్కొన్నాడు. 

అక్క‌డే దెబ్బ‌తిన్నాం.. ఇక ఈ మ్యాచ్ లో 244 ప‌రుగుల ఛేద‌న‌తో బ‌రిలోకి దిగిన జీటీ.. ఒక ద‌శ‌లో 145-1తో ప‌టిష్టంగా నిలిచింది. అయితే మ‌ధ్య‌లో కొన్ని పొర‌పాట్లు చేయ‌డంతోనే ఓడిపోయామ‌ని జీటీ కెప్టెన్ శుభ‌మాన్ గిల్ పేర్కొన్నాడు. ముఖ్యంగా మ‌ధ్య ఓవ‌ర్ల‌లో మూడు ఓవ‌ర్ల‌లో కేవ‌లం 18 ప‌రుగులు సాధించ‌డంతోపాటు ప‌వ‌ర్ ప్లే ఆరంభంలో అధికంగా ప‌రుగులు సాధించ‌క పోవ‌డం త‌మ కొంప ముంచింద‌ని గిల్ పేర్కొన్నాడు. అయినా కూడా  ఈ మ్యాచ్ ద్వారా కొన్ని సానుకూల అంశాలు పొందామ‌ని, రాబోయే మ్యాచ్ ల్లో మెరుగైన ప్ర‌ద‌ర్శ‌న చేసేందుకు ప్ర‌య‌త్నిస్తామ‌ని పేర్కొన్నాడు. 

ఆ వ్యూహంతో దెబ్బ కొట్టిన పంజాబ్..టార్గెట్ ఛేజింగ్ మ‌ధ్య‌లోకి వ‌చ్చిన త‌ర్వాత బంతి రివ‌ర్స్ స్వింగ్ అవుతుంద‌ని గ‌మ‌నించిన పంజాబ్ పేస‌ర్ అర్ష‌దీప్ సింగ్.. కెప్టెన్ శ్రేయ‌స్ అయ్య‌ర్ కు చెప్పాడు. దీంతో ఇంపాక్ట్ ప్లేయ‌ర్ గా విజ‌య్ కుమార్ వైశాఖ్ ను తీసుకుని, అత‌నికి ఒక టార్గెట్ ను నిర్దేశించారు. దాని ప్ర‌కారం ఔట్ సైడ్ ఆఫ్ లో యార్కర్లు విస‌రాల‌ని తెలిపారు. అందుకు త‌గిన‌ట్లుగా ఆ సైడ్ లో ఆరుగురు ఫీల్డ‌ర్ల‌ను పెట్టి, శ్రేయ‌స్ అద్భుత‌మైన వ్యూహాన్ని ర‌చించాడు. ఈ వ్యూహానికి చిక్కిన గుజ‌రాత్ ప‌రుగులు సాధించ‌లేక చ‌తికిల ప‌డింది. మొత్తం మీద సీజ‌న్ లో తొలి విజ‌యం సాధించి బోణీ కొట్టిన పంజాబ్.. రాబోయే మ్యాచ్ ల్లో మ‌రింత ఆత్మ‌విశ్వాసంతో బ‌రిలోకి దిగ‌నుంది.  ఇక తొలి మ్యాచ్ లో నే సెల్ఫ్ లెస్ కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడిన శ్రేయస్ పై ప్రశంసల జల్లు కురుస్తోంది.