Neeraj Chopra Bids To Enter Javelin Final: కోట్లాది మంది అభిమానుల  ఆశల మధ్య... క్రీడా ప్రేమికుల అంచనాల మధ్య.. కోట్ల కళ్లు ఉత్కంఠగా ఎదురుచూస్తుండగా..ఇండియన్‌ గోల్డెన్‌ బాయ్‌ నేడు బరిలోకి దిగుతున్నాడు. అథ్లెటిక్స్‌లో భారత్‌కు తొలి స్వర్ణ పతకాన్ని అందించి చరిత్ర సృష్టించిన నీరజ్‌ చోప్రా నేడు జావెలిన్‌ త్రోలో బరిలోకి దిగుతున్నాడు. నీరజ్‌ చోప్రా( Neeraj Chopra)పై ఇప్పుడు భారీ అంచనాలు ఉన్నాయి. నీరజ్‌ మరోసారి కచ్చితంగా స్వర్ణ పతకం గెలుస్తాడని అభిమానులు భారీగా ఆశలు పెట్టుకున్నారు. డిఫెండింగ్‌ ఛాంపియన్‌గా బరిలోకి దిగుతున్న నీరజ్‌ చోప్రా.. గత మూడేళ్లలో అనేక టైటిళ్లను తన ఖాతాలో వేసుకుని సత్తా చాటాడు. ఇవాళా జావెలిన్‌ త్రో అర్హత పోటీలు జరగనుండగా ఫైనల్‌ గురువారం జరగనుంది. ఈ పతకం కూడా సాధిస్తే నీరజ్‌ చోప్రా భారత క్రీడా చరిత్రలో ఓ సరికొత్త అధ్యయనం లిఖించినట్లే. 

 

గ్రూప్‌ బీలో నీరజ్‌

డిఫెండింగ్ ఛాంపియన్  నీరజ్‌ చోప్రా గ్రూప్ బీలో ఉన్నాడు. మధ్యాహ్నం 3:20కు నీరజ్‌ ఈవెంట్‌ ఆరంభం కానుంది. భారత్‌కే చెందిన మరో జావెలిన్‌ త్రోయర్‌ కిషోర్ కుమార్ జెనా కూడా గ్రూప్‌ ఏలో ఉన్నాడు. ఈ ఏడాది ఏప్రిల్‌లో జరిగిన దోహా డైమండ్ లీగ్‌లో 88.36 మీటర్ల దూరం జావెలిన్‌ను విసిరిన నీరజ్‌... స్వర్ణ పతకాన్ని సాధించాడు. ఈ ఏడాది నీరజ్‌ చేసిన అత్యుత్తమ ప్రదర్శన ఇదే. ఫెడరేషన్ కప్‌, పావో నుర్మీ గేమ్స్‌లోనూ స్వర్ణాలు గెలిచాడు. 

 

నీరజ్‌కు గాయమైందా..?

నీరజ్‌ చోప్రా ఇటీవల గాయపడ్డాడని వార్తలు వచ్చాయి. అయితే తనకు ఎలాంటి గాయం కాలేదని నీరజ్ చోప్రా స్పష్టం చేశాడు. తాను కొన్ని టోర్నమెంట్‌లకు దూరం కావడంపై నీరజ్‌ స్పందించాడు. తాను అన్ని ఈవెంట్‌లలో పాల్గొనవచ్చని... కానీ తన ఆరోగ్యంలో చిన్న అసౌకర్యం అనిపించినా  అది భవిష్యత్తులో ఇబ్బందవుతుందని గ్రహించి దూరంగా ఉంటున్నానని  నీరజ్‌ తెలిపాడు. 

 

ఫైనల్‌కు అర్హత సాధించాలంటే...?

పారిస్‌ ఒలింపిక్స్‌ క్వాలిఫైయింగ్ రౌండ్‌లో అర్హత సాధించి ఫైనల్‌ చేరాలని నీరజ్‌ లక్ష్యంగా పెట్టుకున్నాడు. ఆగస్టు 8న జరిగే ఫైనల్‌కు అర్హత సాధించాలంటే నీరజ్ క్వాలిఫికేషన్ రౌండ్‌లో టాప్ 12 త్రోయర్‌లలో ఒకడిగా నిలవాలి. నీరజ్ మూడు ప్రయత్నాల్లో 84 మీటర్ల త్రో చేయాల్సి ఉంటుంది. మొత్తం 32 మంది పోటీదారులను రెండు గ్రూపులుగా చేశారు. ప్రతీ గ్రూపులో 16 మంది ఉంటారు. వీరిలో 11 మంది ఇప్పటికే ఈ సీజన్‌లో 85 మీటర్లకు పైగా విసిరారు. నీరజ్ తన మొదటి త్రోలోనే ఫైనల్‌కు అర్హత సాధించడానికి ప్రయత్నిస్తాడు. 2017లో లండన్‌లో జరిగిన ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో తాను ఎంతో నేర్చుకున్నానని... అందుకే ఫైనల్‌ కోసం శక్తిని ఆదా చేసుకునేందుకు తొలి త్రోలోనే ఫైనల్‌కు అర్హత సాధించడం నేర్చుకున్నానని నీరజ్‌ తెలిపాడు. టోక్యో ఒలింపిక్స్‌ గేమ్స్‌లోనూ నీరజ్‌ తొలి త్రోలోనే ఫైనల్‌కు అర్హత సాధించాడు.