PR Sreejesh: Nicknamed 'Great Wall Of Indian Hockey':  శ్రీజేష్‌(Sreejesh) నువ్వు మనిషివా.. గోడవా..  శ్రీజేష్‌ ఉంటే చాలు భారత్‌ ఈ ఒలింపిక్స్‌లో స్వర్ణ పతకం కూడా గెలుస్తుంది... శ్రీజేష్‌ ఉంటే ఒక ప్లేయర్‌ తక్కువైనా భారత్‌ మాత్రం విజయం సాధిస్తుంది... శ్రీజేష్‌... శ్రీజేష్‌... శ్రీజేష్‌.. ఇప్పుడు సోషల్‌ మీడియాలో ఈ పేరు హోరెత్తిపోతోంది. క్వార్టర్‌ ఫైనల్లో బ్రిటన్‌తో జరిగిన మ్యాచ్‌లో శ్రీజేష్‌ గోల్‌ పోస్ట్‌కు అడ్డంగా గోడ కట్టాడు. బ్రిటన్‌ పదే పదే గోల్‌పోస్ట్‌ పై దాడులు చేసినా సమర్థంగా అడ్డుకున్నాడు. తన కెరీర్‌లోనే చివరి టోర్నమెంట్‌ ఆడుతున్న శ్రీజేష్‌ భారత్‌ను గెలిపించడంలో కీలకపాత్ర పోషిస్తున్నాడు. ఇక పతకం సాధించేందుకు కేవలం ఒకే అడుగు దూరంలో నిలిచిన భారత్‌... మరో పతకం గెలవాలని గట్టి పట్టుదలతో ఉంది. గోల్‌ పోస్ట్‌ దగ్గర కంచు కోటను నిర్మిస్తున్న శ్రీజేష్‌... మరోసారి సత్తా చాటి భారత్‌కు పతకాన్ని అందించి వీడ్కోలు పలికితే అతని కెరీర్‌కు అంతకన్నా ఘనమైన వీడ్కోలు ఉండదు.








 

ధనరాజ్‌ పిళ్లే భావోద్వేగం

 క్వార్టర్‌ ఫైనల్లో గ్రేట్ బ్రిటన్‌పై 4-2 షూటౌట్‌తో గెలిచి ఒలింపిక్స్‌  సెమీ-ఫైనల్‌లో బెర్తు ఖాయం చేసుకుంది. ఈ విజయంతో భారత హాకీ లెజెండ్ ధనరాజ్ పిళ్లే తన కన్నీళ్లను ఆపుకోలేకపోయాడు. ఈ విజయం అపురూపమంటూ ధనరాజ్‌ పిళ్లే భావోద్వేగానికి గురయ్యాడు. భారత విజయంతో తాను కన్నీళ్లను ఆపుకోలేకపోయానని.. భారత్‌ ఇలా ఆడడం చాలా ఏళ్లుగా చూడాలేదని... 44 ఏళ్ల తర్వాత ఈ జట్టు మనకు ఒలింపిక్ స్వర్ణం తీసుకురాగలదని తాను నమ్ముతున్నట్లు ధనరాజ్‌ పిళ్లే తెలిపాడు. విన్నింగ్ గోల్ కొట్టిన వెంటనే తాను ఆనందంతో గెంతులు వేశానని కూడా చెప్పాడు. నాకు తెలీకుండానే కళ్ల నుంచి కన్నీళ్లు వచ్చేశాయని... సిడ్నీ ఒలింపిక్స్ 2000 తర్వాత తొలిసారి ఇలాంటి మ్యాచ్‌ని చూశానని ధనరాజ్‌ పిళ్లే భావోద్వేగానికి గురయ్యాడు. గోల్‌ పోస్ట్‌ ముందు గోడలా నిలబడిన శ్రీజేష్‌ చేసిన సేవ్‌ల సంఖ్య తక్కువేమీ కాదని అన్నాడు. మ్యాచ్ చూస్తున్నప్పుడు తనకు గూస్‌బంప్స్‌ వచ్చాయని.... పెనాల్టీ షూటౌట్‌లో భారత్ నాలుగో గోల్ తర్వాత తాను బిగ్గరగా అరవడం ప్రారంభించానని..తన అపార్ట్‌మెంట్‌లోని వ్యక్తులు బయటకు వస్తారని తను తెలుసని అన్నాడు. 





 

శ్రీజేష్‌ ఒక లెజెండ్‌

భారత హాకీ ఎందరో గొప్ప ఆటగాళ్లను తయారు చేసింది అందులో శ్రీజేష్‌ మాత్రం ఓ దిగ్గజమని ధనరాజ్‌ పిళ్లే అన్నాడు. శ్రీజేష్‌ లాంటి ఆటగాడు తరానికి ఒక్కరే వస్తారని ధనరాజ్‌ పిళ్లే అన్నాడు. గత మ్యాచ్‌లో 52 ఏళ్ల తర్వాత ఒలింపిక్స్‌లో ఆస్ట్రేలియాను ఓడించడం కూడా అద్భుత విజయాల్లో ఒకటని ధనరాజ్‌ పిళ్లే అన్నాడు. శ్రీజేష్ వంటి ఆటగాడు ఇలా సహకారాన్ని అందిస్తే భారత్‌కు స్వర్ణం ఖాయమని ధీమా వ్యక్తం చేశాడు. క్వార్టర్‌ ఫైనల్లో శ్రీజేష్, డిఫెండర్లు ఆడిన తీరు తనను అబ్బురపరిచిందని ధనరాజ్‌ పిళ్లే అన్నాడు. ఒత్తిడి లేకుండా ఆడితే సెమీస్‌లోనూ విజయం మనదేనని అన్నాడు. 
 



ఒలింపిక్స్‌లో ఎనిమిది సార్లు ఛాంపియన్‌గా నిలిచిన భారత్... చివరిసారిగా 1980లో మాస్కోలో జరిగిన ఒలింపిక్స్‌లో స్వర్ణం సాధించింది. 41 ఏళ్ల తర్వాత భారత జట్టు 2020లో టోక్యో గేమ్స్‌లో కాంస్య పతకాన్ని సొంతం చేసుకుంది. అయితే ఇప్పుడు ఈ విజయంతో సోషల్ మీడియా శ్రీజేష్ శ్రీజేష్ అంటూ హొటెత్తిపోతోంది.