Chinese-Chilean Table Tennis Player Makes Olympics Debut At Age 58: పారిస్ వేదికగా జరుగుతున్న విశ్వక్రీడలుల్లో జరుగుతున్న వింతలు అంతా ఇంతా కాదు. కొంతమంది అతి చిన్న వయసులో పారిస్ ఒలింపిక్స్ 2024లో అడుగు పెట్టగా, చిలీ టేబుల్ టెన్నిస్ క్రీడాకారిణి జియింగ్ జెంగ్ అతి పెద్ద వయస్సులో అరంగేట్రం చేసి చరిత్ర సృష్టించింది. రిటైర్మెంట్ వయస్సులో ఇతర ఆటగాళ్ళతో పతక పోరులో నిలిచింది. ఒలింపిక్స్‌లో పాల్గొన్న అతిపెద్ద వయస్సు ఉన్న మహిళగా రికార్డు నెలకొల్పింది.
ఒలింపిక్స్‌లో పాల్గొనాలన్న తన చిరకాల కోరికను జెంగ్ 58 ఏళ్ళ లేటు వయసులో సాకారం చేసుకుంది. సాధించాలనే కోరిక, పట్టుదల ఉంటే వయసు అసలు అడ్డు కాదని నిరూపించింది. చైనాలో జన్మించిన జియింగ్ జెంగ్ ప్రస్తుతం చిలీకి ప్రాతినిధ్యం వహిస్తోంది. అలా అని జియింగ్ జెంగ్ ఒలింపిక్స్ ప్రస్తానం అంత సులువుగా కూడా ఏం సాగలేదు. దక్షిణ చైనాలోని ఫోషన్‌లో జన్మించిన జెంగ్ స్థానిక టేబుల్ టెన్నిస్ కోచ్ కుమార్తె. చిన్నతనంలో, ప్రొఫెషనల్ టేబుల్ టెన్నిస్ శిక్షణా సమావేశాలకు ఆమె తల్లితో పాటే వెళుతూ ఆట మీద మక్కువ పెంచుకుంది. 18 సంవత్సరాల వయస్సులో జెంగ్ తన స్వంత దేశమైన చైనా తరఫున ఒలింపిక్స్‌లో పాల్గొనాలని తీవ్రంగా ప్రయత్నించింది. కానీ ఒలింపిక్స్ అరంగేట్రానికి ముందే ఆమె తనకెంతో ఇష్టమైన ఆటకు దూరమైంది. సరిగ్గా రెండేళ్ళ తరువాత 20 ఏళ్ల వయసులోనే రిటైర్మెంట్ ప్రకటించింది. తరువాత ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 20 సంవత్సరాల పాటూ ఒక ఫర్నిచర్ షాప్ నడిపింది. ఆ తరువాత ఆమె చిలీలో వివిధ టేబుల్ టెన్నిస్ జట్లకు శిక్షణ ఇవ్వటం ప్రారంభించింది. ఇక కోవిడ్ సమయంలో జెంగ్ తిరిగి టేబుల్ టెన్నిస్ ఆడటం కూడా మొదలు పెట్టింది. ప్రస్తుతం 2024 ఒలింపిక్స్‌లో చిలీకి ప్రాతినిధ్యం వహింస్తోంది. మొత్తానికి 58 సంవత్సరాల వయస్సులో ఒలింపిక్స్ లో ఆడాలన్న తన లక్ష్యాన్ని నెరవేర్చుకుంది.
Also Read: ఒకే ఒలింపిక్స్‌లో రెండు పతకాలు - మను భాకర్ నయా హిస్టరీ- భారత్‌కు మరో మెడల్
అయితే తాను ఎప్పుడూ ఒలింపిక్స్ అనే తన కల నిజం అవుతుంది అనుకోలేదని, తన సంతృప్తి కోసం ఆడానని, అయితే ఆడిన ప్రతిసారీ వచ్చిన గెలుపు తనకి మాత్రం చాలా ఆనందాన్ని ఇచ్చిందని చెప్పింది. ఇప్పుడు ఒలింపిక్స్ లో ఆడటం తనకు మరెంతో ఆనందాన్ని ఇచ్చిందన్నారు. జెంగ్ ప్రస్తుతం టేబుల్ టెన్నిస్ ప్లేయర్‌గా 151వ ర్యాంక్‌లో ఉన్నారు. అయితే ఆమె తన గేమ్ లో ఓడిపోయినప్పటికీ జీవిత కాలపు కలను నెరవేర్చుకోవటం చాలా తృప్తిగా ఉందన్నారు.