టోక్యో ఒలింపిక్స్‌లో బంగారు పతకం సాధించిన నీరజ్ చోప్రా ( Neeraj Chopra)పై దేశవ్యాప్తంగా ప్రశంసల వర్షం కురుస్తోంది. ఒలింపిక్స్‌లో అద్భుత ప్రతిభ కనబర్చిన నీరజ్‌కు హర్యానా ప్రభుత్వం రూ.6 కోట్ల భారీ నగదు ప్రోత్సాహం ప్రకటించింది. 23 ఏళ్ల నీరజ్ చోప్రా అథ్లెటిక్స్‌లో జావెలిన్ త్రో విభాగంలో శనివారం స్వర్ణ పతకం సాధించాడు. దీంతో అథ్లెటిక్స్‌లో 100ఏళ్ల భారతావని నిరీక్షణకు తెరపడినట్లైంది.
నీరజ్ పతకం గెలవడంతో పానీపట్‌లో సంబరాలు అంబరాన్నంటాయి. నీరజ్ పోటీలు ఉన్నందున ప్రత్యేకంగా తెర ఏర్పాటు చేసి వీక్షించారు అభిమానులు. నీరజ్ స్వర్ణం గెలవగానే అతడి తల్లిదండ్రులను పూలమాలలు వేసి సత్కరించారు. స్వీట్లు పంచుకుంటూ, టపాసులు పేల్చుకుంటూ సందడి చేశారు. వ్యక్తిగత విభాగంలో భారత్‌కు స్వర్ణ పతకం సాధించిన రెండో క్రీడాకారుడిగా నీరజ్ చోప్రా నిలిచాడు.
దీంతో యావత్తు భారతావని నీరజ్ చోప్రాకు బ్రహ్మరథం పడుతోంది. జావెలిన్ త్రో ఫైనల్ పోటీలో ఈటెను 87.58మీటర్లు విసిరి స్వర్ణ పతకాన్ని తన ఖాతాలో వేసుకున్నాడు. ఈ సందర్భంగా హర్యానా ముఖ్యమంత్రి మనోహర్‌లాల్ ఖట్టర్ ట్విటర్ ద్వారా శుభాకాంక్షలు తెలిపారు. తాను నీరజ్ పోటీలను తిలకిస్తున్న ఫొటోను ట్విట్టర్ ద్వారా పంచుకున్నారు.
ఒలింపిక్స్‌లో బంగారు పతకం నెగ్గిన నీరజ్ చోప్రాకు అభినందనలని ఆ ట్వీట్‌లో పేర్కొన్నారు. ఇలాంటి సందర్భం కోసం దేశం ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్నదని, ఇప్పుడు నీరజ్ చోప్రా దేశ ప్రజల కల నెరవేర్చాడని ఖట్టర్ ట్వీట్ చేశారు. రూ.6కోట్ల నగదుతో పాటు క్లాస్-1 ఉద్యోగం ఇస్తున్నట్లు ఖట్టర్ ప్రకటించారు. అంతకుముందు హర్యానా నుంచి టోక్యో ఒలింపిక్స్‌లో పోటీపడిన క్రీడాకారులందరికీ రూ.10 లక్షల చొప్పున నగదు ఇవ్వనున్నట్టు ఖట్టర్ ప్రకటించిన సంగతి తెలిసిందే.