ఎప్పుడూ తనదైన శైలిలో ట్వీట్లు, వ్యాఖ్యలు చేసి తరచూ వార్తల్లో నిలిచే సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ మళ్లీ ఒకరిపై ట్వీట్ చేశారు. ఈసారి ఆయన కన్ను నల్గొండ రాజకీయాలపై పడింది. గతంలో నాగార్జున సాగర్ ఎన్నికలకు ముందు కూడా రామ్ గోపాల్ వర్మ అప్పటి టీఆర్ఎస్ అభ్యర్థి నోముల భగత్‌పై ట్వీట్లు చేశారు. ఆయన పులితో కలిసి దాని తాడును పట్టుకొని నడుస్తూ వాకింగ్‌కి వెళ్తున్న వీడియోలను ఆర్జీవీ ట్వీట్ చేశారు. ఇప్పుడు ఎమ్మెల్యే నోముల భగత్‌పై రామ్ గోపాల్ వర్మ మళ్లీ సెటైరికల్ ట్వీట్ చేశారు. అయితే, అది ఎమ్మెల్యే స్థాయిని పెంచేదిలాగే ఉంది. ఈ ట్వీట్ సోషల్ మీడియాలో తెగ వైరల్‌గా మారింది.
నాగార్జున సాగర్ ఎమ్మెల్యే భగత్ నోముల సింహమా? లేక సింహానికే సింహమా? అనేది నల్గొండ ప్రజలే సమాధానం చెప్పాలంటూ ఆర్జీవీ ట్వీట్ చేశారు. ఈ ప్రశ్న నల్గొండ ప్రజలందరికీ అని, దయచేసి సమాధానం చెప్పాలని వర్మ ట్వీట్ చేశారు. దానికి ఓ వీడియోను కూడా జత చేశారు. ఆ వీడియోలో ఎమ్మె్ల్యే నోముల భగత్ సింహాలతో కలిసి నడుస్తున్నారు. కర్ర చేతబట్టుకొని వాటి తోకలు పట్టుకుంటూ, వీపుపై నిమురుతూ నడుస్తున్నారు. ఈ వీడియో కాస్త ఆశ్చర్యకరంగానూ ఉంది. ఎమ్మెల్యే సింహాలతో నడుస్తుండడం చూసి నెటిజన్లు విస్తుపోతున్నారు. క్రూరమైన సింహాలతో నడవడం ఎలా సాధ్యం అని ప్రశ్నిస్తున్నారు.
Also Read: Hyderabad Murder: రియల్టర్ హత్య కేసులో విస్తుపోయే నిజాలు.. కుట్ర వెనుక ఆ గురూజీ..?
విక్టోరియా వాటర్ ఫాల్స్ సమీపంలో..
సాధారణంగా జూ పార్కుల్లో పులులు, సింహాల దగ్గరికి ఎవర్నీ రానివ్వరు. కానీ, నోముల భగత్ ఏకంగా సింహాలను ముట్టుకుంటూ కర్ర పట్టుకొని వాటి వెంటే నడుస్తున్నారు. ఇలా చేయడం ప్రపంచంలో ఒకే చోట వీలవుతుంది. అది ఆఫ్రికాలోని జాంబియా దేశంలో విక్టోరియా వాటర్ ఫాల్స్ సమీపంలోని ‘‘విక్టోరియా వాటర్ ఫాల్స్ ప్రైవేట్ గేమ్ రిజర్వ్’’. ఇక్కడ సింహాలు, పులులను వాటి చిన్నతనం నుంచే నిపుణులైన జంతు సంరక్షకులు సరైన రీతిలో పెంచుతారు. తద్వారా ఈ రిజర్వ్‌లో ఉండే పులులు, సింహాలు మనుషుల పట్ల క్రూరంగా ప్రవర్తించవు. కాబట్టి, అడ్వంచర్ అంటే అమితమైన ఆసక్తి ఉన్న అంతర్జాతీయ పర్యటకులు విక్టోరియా వాటర్ ఫాల్స్ వద్దకు వచ్చిన సందర్భంలో దీన్ని తప్పకుండా ట్రై చేస్తుంటారు. ఈ తరహాలోనే, గతంలో ఎమ్మెల్యే నోముల భగత్ కూడా విక్టోరియా వాటర్ ఫాల్స్ ప్రైవేట్ గేమ్ రిజర్వ్ దగ్గరికి వెళ్లి అక్కడ పులులు సింహాలతో నడిచినట్లుగా నెటిజన్లు చర్చించుకుంటున్నారు.