హైదరాబాద్‌లో స్థిరాస్తి వ్యాపారి హత్య కేసును పోలీసులు ఛేదించారు. ఆంధ్రప్రదేశ్‌లో నెల్లూరు జిల్లాకు చెందిన రియల్టర్ విజయభాస్కర్ రెడ్డి కొన్ని రోజుల క్రితం హైదరాబాద్‌లో కనిపించకుండా పోయారు. ఆ తర్వాత ఆయన హత్యకు గురైనట్లుగా పోలీసులు గుర్తించారు. తాజాగా ఈ కేసులో పోలీసులు నలుగురిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. సీసీటీవీ కెమెరాల ఆధారంగా పోలీసులు ఈ కేసును ఛేదించారు. ఆర్థిక లావాదేవీలే ఈ హత్యకు కారణమని పోలీసులు తేల్చారు.
నెల్లూరు జిల్లాకు చెందిన జి.విజయ భాస్కర్ రెడ్డి అనే 63 ఏళ్ల వ్యక్తి హైదరాబాద్‌లో ఉంటూ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారు. నాలుగు నెలల నుంచి కేపీహెచ్‌బీలో నివాసం ఉంటున్నారు. పోలీస్ స్టేషన్ వెనక ఉన్న ఓ వసతి గృహంలో ఉంటున్నారు. జులై 20 నుంచి ఆయన ఫోన్ స్విచ్చాఫ్ రావడంతో.. అల్లుడు జయసృజన్ రెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు హాస్టల్ సమీపంలోని సీసీటీవీ కెమెరాలను పరిశీలించారు. ఫోన్ స్విచ్చాఫ్ వచ్చిన రోజు రాత్రే విజయ్ భాస్కర్ రెడ్డిని కారులో ఎవరో ఎక్కించుకొని తీసుకెళ్తున్న దృశ్యం కనిపించింది. కారు నంబరు ఆధారంగా విచారణ చేసిన పోలీసులు అతను మాజీ సైనిక ఉద్యోగి మల్లేశ్, స్థిరాస్తి వ్యాపారి సుధాకర్, కృష్ణంరాజుతోపాటు ఓ డాక్టర్‌ను అదుపులోకి తీసుకొని విచారణ జరిపారు. దీంతో హత్య విషయం బయటికి వచ్చింది.
హాస్టల్‌లోనే మత్తు మందు..
హాస్టల్‌లోనే చేరిన నిందితుడు మల్లేశ్ కుమారుడు నమ్మకంగా మెలుగుతూ మంచూరియాలో మత్తు మందు కలిపి ఆయనతో తినేలా చేయించినట్లు తెలుస్తోంది. స్పృహ తప్పి పడిపోయిన విజయభాస్కర్ రెడ్డిని సులభంగా వారు కారులో తీసుకెళ్లి అందులోనే హత్యకు పాల్పడ్డారు. ఆ తర్వాత శ్రీశైలం సమీపంలో ఉన్న సున్నిపెంటకు తీసుకెళ్లి అక్కడి కాటికాపరితో అంత్యక్రియలు చేయించారు. అతనికి రూ.15 వేలు చెల్లించారు. అనుమానం వచ్చిన కాటికాపరి ఆ మృతదేహాన్ని చితిపై ఉంచిన సమయంలో సెల్ ఫోన్‌తో ఫొటో తీసుకున్నాడు.
వెలుగులోకి అసలు నిజాలు
విజయ భాస్కర్ హత్యకు నెల్లూరు జిల్లా కావలికి చెందిన ఓ గురూజీ ప్రధాన సూత్రధారిగా తేలింది. ప్రకృతి వైద్యంతో దీర్ఘకాలిక వ్యాధులు నయం చేస్తానంటూ బెంగళూరులో ఆశ్రమం తెరిచిన అతడికి కర్ణాటక, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో కూడా భక్తులు ఉన్నారు. వారిలో విజయ భాస్కర్ రెడ్డి కూడా ఉన్నారు. ఆయన అధిక మొత్తం డబ్బులు గురూజీ అవసరార్థం ఆయనకి ఇచ్చారు. విదేశాల నుంచి నిధులొచ్చాక ఆ డబ్బు తిరిగి ఇచ్చేస్తానంటూ కాలాయాపన చేయడం మొదలుపెట్టాడు. ఎంతకీ డబ్బు ఇవ్వకపోవడంతో విజయ భాస్కర్ గురూజీపై ఒత్తిడి పెంచినట్లు తెలిసింది.
తన కార్యకాలాపాలపై దర్యాప్తు సంస్థలకు ఫిర్యాదు చేసినందుకు విజయ్ భాస్కర్‌పై గురూజీ కోపం పెంచుకుని హత్యకు కుట్ర పన్నినట్లు పోలీసులు ప్రాథమికంగా భావిస్తున్నారు. ప్రస్తుతం అతని కోసం పోలీసులు అన్వేషిస్తున్నారు.