Neeraj Chopra Qualifies For Javelin Throw Final: భారత బల్లెం వీరుడు నీరజ్‌ చోప్రా మరో రికార్డుకు చేరువలో ఉన్నాడు! జావెలిన్‌ త్రోలో ప్రపంచ అథ్లెటిక్స్‌ ఛాంపియన్‌షిప్‌ ఫైనల్‌కు చేరుకున్నాడు. అర్హత పోటీల్లో అతడు జావెలిన్‌ను 88.39 మీటర్లు విసిరాడు. తొలి అవకాశంలోనే ఎక్కువ దూరం విసరడం గమనార్హం. ఆదివారం స్వర్ణం కోసం అతడు పోటీపడతాడు.


ఓరెగాన్‌లోని యూజినీలో ప్రపంచ అథ్లెటిక్స్‌ ఛాంపియన్‌షిప్స్‌ జరుగుతున్న సంగతి తెలిసిందే. అర్హత పోటీల్లో నీరజ్‌ చోప్రా (Neeraj Chopra) గ్రూప్‌-ఏలో ఉన్నాడు. అందరికన్నా ముందుగానే అతడు జావెలిన్‌ను విసిరాడు. 83.50 మీటర్లు విసిరితే ఆటోమేటిక్‌గా ఫైనల్‌ చేరుకుంటారు. గ్రూప్‌లో అత్యంత దూరం విసిరిన రెండో ఆటగాడు నీరజే. 89.91 మీటర్లతో గ్రెనాడాకు చెందిన అండర్సన్‌ పీటర్స్‌ అతడి కన్నా ముందున్నాడు. జావెలిన్‌ను 80.42 మీటర్లు విసిరి పదో స్థానంలో నిలిచిన మరో భారతీయుడు రోహిత్‌ యాదవ్‌ సైతం ఫైనల్‌కు చేరుకున్నాడు.




ఒలింపిక్‌ స్వర్ణ పతక విజేత నీరజ్‌ చోప్రా తన రికార్డులను తానే తిరగ రాసుకుంటున్నాడు. ఈ మధ్యే జావెలిన్‌ను 89.94 సెంటీమీటర్లు విసిరి సరికొత్త జాతీయ రికార్డు నెలకొల్పాడు. ప్రపంచ జావెలిన్‌లో పసిడి ప్రమాణంగా భావించే 90 మీటర్లకు కేవలం 6 సెంటీమీటర్ల దూరంలో ఆగిపోయాడు. గత నెల్లో స్టాక్‌హోమ్‌లో జరిగిన డైమండ్‌ లీగులో ఇంతే దూరం విసిరుంటే అతడికి రజతం వచ్చేది. కాగా అండర్సన్‌ పీటర్స్‌ ఇదే టోర్నీలో జావెలిన్‌ను 90.13 మీటర్లు విసరడం గమనార్హం.


'90 మీటర్ల మైలురాయికి నేను 6 సెంటీమీటర్ల దూరమే తక్కుగా విసిరాను. దాదాపుగా సమీపించాను. ఈ ఏడాది 90 మీటర్లను దాటేస్తానన్న నమ్మకం ఉంది. పోటీలో నేనెప్పుడూ దూరంపై దృష్టి సారించను. వంద శాతం ఆడేందుకు ప్రయత్నిస్తాను. ఈ ఏడాది ప్రపంచ అథ్లెటిక్స్‌ ఛాంపియన్‌షిప్‌లో పతకం గెలవడమే నా లక్ష్యం. ఎలాంటి ఒత్తిడి లేకుండా ఆడుతున్నాను. ఈ టోర్నీలో పోటీ ఎక్కువగా ఉంటుంది. ఐదారుగురు ఆటగాళ్లు నిలకడగా ఒకే స్థాయిలో జావెలిన్‌ విసురుతున్నారు. అయితే ప్రతి టోర్నీ భిన్నంగానే ఉంటుంది. అత్యంత దూరం విసరడం పైనే నేను దృష్టి సారిస్తాను' అని నీరజ్‌ చోప్రా పేర్కొన్నాడు.