వన్డే వరల్డ్‌ కప్‌ తొలి మ్యాచ్‌లోనే డిఫెండింగ్ ఛాంపియన్‌ ఇంగ్లాండ్‌పై అద్భుత సెంచరీతో ప్రపంచ క్రికెట్‌ అభిమానుల చూపును తన వైపునకు తిప్పుకున్నాడు న్యూజిలాండ్‌ బ్యాటర్‌ రచిన్‌ రవీంద్ర. 23 ఏళ్ల వయసులో ఎంతో అనుభవమున్న ఇంగ్లాండ్ బౌలర్లను ఉతికారేస్తూ... 93 బంతుల్లోనే అజేయంగా 123 పరుగులు చేసి సంచలన సృష్టించాడు.  కేన్ విలియమ్సన్ గైర్హాజరీతో దక్కిన అవకాశాన్ని రచిన్‌ రెండు చేతులా అందిపుచ్చుకున్నాడు. 


మార్మోగుతున్న పేరు
 ఈ ఒక్క ఇన్నింగ్స్‌తో రచిన్ రవీంద్ర పేరు ప్రపంచ క్రికెట్‌లో మార్మోగిపోయింది. రచిన్‌ రవీంద్ర అద్భుత సెంచరీతో మెరవగానే క్రికెట్‌ ప్రేమికులు అతడి మూలాలను శోధించడం ప్రారంభించారు. భారత సంతతి ఆటగాడైన రచిన్‌.. స్పిన్‌ ఆల్‌రౌండర్‌గా జట్టులోకి వచ్చాడు. అతనిలో ఇంత బ్యాటర్‌ ఉన్నాడని క్రికెట్‌ ప్రేమికులు ఊహించలేకపోయారు. అద్భుతమైన డిఫెన్స్‌.. కళాత్మక డ్రైవ్‌లు... భారీ షాట్లతో రచిన్‌.. మొదటి మ్యాచ్‌లోనే తన ముద్ర వేశాడు. 2019 ప్రపంచకప్‌ను ఓ అభిమానిగా వీక్షించిన ఈ కివీ ఆటగాడు.. ఇప్పుడు ఈ మెగా టోర్నీలో భాగమై న్యూజిలాండ్‌కు ఘనమైన ఆరంభాన్ని ఇచ్చాడు. అభిమాని నుంచి ఆటగాడిగా ఇంతదూరం ప్రయాణించేందుకు రచిన్‌ చాలా శ్రమించాడు. 


పేరు వెనక ఆసక్తికర విషయం


రచిన్ రవీంద్ర తల్లిదండ్రులు బెంగళూరుకు చెందిన వారు. రచిన్ తండ్రి రవి కృష్ణమూర్తి. ఈయన 1990ల్లోనే న్యూజిలాండ్‌కి వెళ్లి వెల్లింగ్టన్‌లో స్థిరపడ్డారు. రచిన్‌ రవీంద్ర న్యూజిలాండ్‌లోనే పుట్టిపెరిగారు. రచిన్‌ రవీంద్ర పేరు వెనక ఒక ఆసక్తికర విషయం దాగుంది. రచిన్‌ తండ్రికి క్రికెట్‌ అన్నా... సచిన్‌, రాహుల్‌ ద్రావిడ్‌ అన్న విపరీతమైన అభిమానం. వారిద్దరి పేర్లు కలిసి వచ్చేలా తన కొడుక్కి పేరు పెట్టుకున్నారు రవి కృష్ణమూర్తి. రాహుల్‌ పేరు నుంచి "రా" అనే అక్షరాన్ని.. సచిన్‌ పేరు నుంచి "చిన్‌" అనే అక్షరాలను తీసుకుని తన కుమారుడికి రచిన్‌ అని పేరు పెట్టారు.  తన కొడుకుని ఈ దిగ్గజాల అంతటి క్రికెటర్ ను చేయాలని చిన్నప్పటి నుంచే రచిన్‌కు క్రికెట్‌లో శిక్షణ ఇప్పించాడు.
 


దేశవాళీల్లో సత్తా చాటిన రచిన్‌


న్యూజిలాండ్ అండర్-19 జట్టులో రచిన్‌ రవీంద్ర తన అద్భుత ఆటతీరుతో వెలుగులోకి వచ్చాడు. 2016, 2018లో న్యూజిలాండ్‌ తరపున అండర్‌ 19 ప్రపంచకప్‌లో ఆడాడు. దేశవాళీ పోటీల్లో ఆల్‌రౌండర్‌గా పరుగుల వరద పారించి...వికెట్లను తన ఖాతాలో వేసుకున్నాడు.  2021లో బంగ్లాదేశ్‌పై తొలి టీ20 ఆడాడు. ఆరు టీ ట్వంటీలు ఆడిన తర్వాత 2021లోనే టీమిండియాతో జరిగిన మ్యాచులో టెస్ట్ అరంగేట్రం చేశాడు. కానీ న్యూజిలాండ్‌ వన్డే జట్టులో రచిన్‌కు అంత తేలిగ్గా స్థానం దక్కలేదు. దేశవాళీ, టెస్టుల్లో నిలకడగా రాణిస్తుండడంతో రెండేళ్ల తర్వాత 2023 లో వన్డేల్లోకి ఎంట్రీ ఇచ్చాడు.  



2023లో పాకిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో97 పరుగుల అద్భుతమైన నాక్‌తో అందరినీ ఆకట్టుకున్నాడు. వన్డేల్లో ఎక్కువగా రాణించలకేపోయిన రచిన్‌ రవీంద్ర... జట్టులో స్థానం కోల్పోయాడు. కానీ టెస్టుల్లో కొన్ని అద్భుతమైన ఇన్నింగ్స్‌లు ఆడి మళ్లీ వన్డే జట్టులోకి వచ్చాడు. ఇప్పటివరకు రచిన్ రవీంద్ర 3 టెస్ట్‌లు, 12 వన్డేలు, 18 టీ20లు ఆడాడు.