Telangana BJP : బీజేపీ , బీఆర్ఎస్ మధ్య ఏదో ఉంటే ఈ కార్యక్రమాలన్నీ ఎందుకని  బీజేపీ ముఖ్య నేత బీఎల్ సంతోష్ పదాధికారుల సమావేశంలో ఆవేదన వ్యక్తం చేశారు. దీనికి కారణం తెలంగాణలో బీజేపీ,  బీఆర్ఎస్ ఒక్కటేనన్న ప్రచారం విస్తృతంగా జరుగుతూండటం.. ప్రజల్లోనూ అదే అభిప్రాయం ఉండటమే. అయితే ఇటీవల ఆ అభిప్రాయాన్ని మార్చడానికి ప్రధాని మోదీ తీవ్రమైన  ప్రయత్నాలు చేశారు. కేసీఆర్ పై విమర్శలు చేశారు. తెలంగాణకు వరాలు ప్రకటించారు మరి ఇప్పుడైనా తెలంగాణలో బీఆర్ఎస్‌కు బీజేపీ ప్రత్యర్థి అని ప్రజలు నమ్ముతారా?


బీజేపీ, బీఆర్ఎస్ ఒక్కటేనని ప్రజల్లో గట్టి నమ్మకం


బండి సంజయ్ తెలంగాణ బీజేపీ చీఫ్ గా ఉన్నప్పుడు బీజేపీ దూకుడుగా ఉంది. కాంగ్రెస్ పూర్తిగా వెనుకబడిపోయింది. బండి సంజయ్ దూకుడుపై విమర్శలు వస్తే వచ్చి ఉండవచ్చు కానీ బీఆర్ఎస్ ను ఎదుర్కోవాలంటే ఆయనే కరెక్ట్ అన్న అభిప్రాయానికి వచ్చారు. అదే సమయంలో ఢిల్లీ లిక్కర్ స్కామ్ తెరపైకి వచ్చింది. కవిత అరెస్టు ఖాయమనుకున్నారు. బండి సంజయ్ అంతకు ముందు నుంచీ అరెస్టుల గురించి చెబుతున్నారు. అరెస్టు జరిగి ఉంటే.. బీజేపీ వర్సెస్ బీఆర్ఎస్ అన్నది పూర్తి స్థాయిలో సాక్షాత్కరించేది. కానీ ఒక్క సారిగా బీజేపీ హైకమాండ్ బ్యాక్ ఫుట్ తీసుకుంది. బండి సంజయ్ ను పదవి నుంచి తప్పించింది. కవిత కూడా అరె్స్టు కాలేదు. అదే సమయంలో కేసీఆర్ బీజేపీని విమర్శించడం మానుకున్నారు. ఈ పరిణామం వల్ల బీజేపీ తీవ్రంగా నష్టపోయింది. రెండు పార్టీలు ఒక్కటేనని ప్రజలు గట్టిగా నమ్మడం ప్రారంభించారు. 


కేసీఆర్‌పై విమర్శలతో దిద్దుబాటు చర్యలు ప్రారంభించిన మోదీ


ప్రధానమంత్రి నరేంద్రమోదీ నిజామాబాద్ సభలో ఒక్క సారిగా గేరు మార్చారు. కేసీఆర్ పై విమర్శలతో విరుచుకుపడ్డారు. అయితే ఆయన పూర్తిగా రాజకీయ విమర్శలు చేశారు.  సీక్రెట్ భేటీల్లో ఏం జరిగిందో చెప్పారు. ఈ మాటలు సహజంగానే కలకలం రేపాయి. ఆ తర్వాత తెలంగాణకు  పసుపుబోర్డు ప్రకటించారు. గిరిజన యూనివర్శిటీని మంజూరు చేశారు. కేసీఆర్ చాలా కాలంగా బీజేపీని ఇరుకున పెడుతున్న కృష్ణా ట్రైబ్యూనల్ అంశాన్నీ పరిష్కరించారు. కేబినెట్ లో నిర్ణయాలు తీసుకున్నారు. ఎన్నికలకు వెళ్లే ముందు తీసుకున్న ఈ నిర్ణయాలు తెలంగాణ ప్రజలకు ఎంతమేర నమ్మకం కలిగిస్తాయో.. కేసీఆర్ పై చేసిన విమర్శలు కూడా అంత మేరే ప్లస్ అవుతాయి. రెండు పార్టీల మధ్య ఏమీ లేదని  నమ్మడనికి ఈ రెండు పరిణామాలు సరిపోతాయా అంటే.. రాజకీయవర్గాలు మాత్రం చాలా కష్టం అన్న వాదన వినిపిస్తున్నాయి. 


బీఆర్ఎస్, కాంగ్రెస్‌లతో పోటీగా మూడో శక్తిగా ఉన్నామని బీజేపీ భావిస్తోందా ?


ప్రస్తుత రాజకీయ పరిస్థితులను అంచనా వేస్తే తెలంగాణలో ముఖాముఖిపోరు ఉందని అర్థమైపోతుంది. కానీ బీజేపీ మాత్రం ఆశలు వదులుకోలేదు. తాము కూడా రేసులో ఉన్నామని చెబుతోంది. కానీ  ఆ పార్టీలో టిక్కెట్ల కోసం అడిగేవారు లేరు. ఉన్నవారు కూడా జంప్ అవుతారన్న  ప్రచారం ఉద్ధృతంగా సాగుతోంది. ఎందుకంటే ప్రజల్లో.. నరేంద్రమోదీ మాటలు, ప్రకటనలు.. వరాలు కూడా అంత  బాగా  నమ్మకం కలిగించలేకపోతున్నాయి. ఇంకా రేసులోకి రావాలంటే.. ఈ మాత్రం సరిపోదని.. ఇంకా ఇంకా చాలా చేయాల్సి ఉందన్న  వాదన మాత్రం గట్టిగానే వినిపిస్తోంది.