ENG Vs NZ Match Highlights:  ఐసీసీ వన్డే వరల్డ్‌కప్‌ తొలి మ్యాచ్‌లో న్యూజిలాండ్‌ శుభారంభం చేసింది. గత ప్రపంచకప్‌ ఫైనల్లో ఎదురైన పరాజయానికి ప్రతీకారం తీర్చుకుంది. అదీ అలా ఇలా కాదు. సాధికార గెలుపుతో ప్రత్యర్థి జట్లకు హెచ్చరికలు చేస్తూ కివీస్‌ బ్యాటర్లు చెలరేగిపోయారు. డేవాన్‌ కాన్వే, రచిన్‌ రవీంద్ర శతకాలతో చెలరేగడంతో ఏకపక్షంగా జరిగిన మ్యాచ్‌లో డిఫెండింగ్‌ ఛాంపియన్‌ ఇంగ్లాండ్‌ను న్యూజిలాండ్‌ చిత్తు చేసింది. బ్రిటీష్‌ బౌలర్లను ఊచకోత కోసిన కివీస్‌ బ్యాటర్లు కేవలం ఒక్క వికెట్‌ మాత్రమే కోల్పోయి.. ఇంగ్లాండ్‌ నిర్దేశించిన 282 పరుగుల లక్ష్యాన్ని మరో 82 బంతులు మిగిలి ఉండగానే సునాయసంగా ఛేదించారు. 273 పరుగుల రికార్డు భాగస్వామ్యంతో కాన్వే, రచిన్‌ రవీంద్ర... కివీస్‌కు ఘన విజయం అందించారు.


ఇంగ్లాండ్‌ గౌరవప్రదమైన స్కోరు


వన్డే ప్రపంచకప్‌లో తొలి అడుగును న్యూజిలాండ్‌ బలంగా వేసింది. గత ప్రపంచ కప్‌లో త్రుటిల్లో చేజారిన కప్‌ను ఈసారి దక్కించుకోవాలని పట్టుదలతో ఉన్న కివీస్‌.. తొలి మ్యాచ్‌లో ఇంగ్లాండ్‌ను చిత్తుచేసింది. టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లాండ్‌ 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 282 పరుగులు చేసింది. ఇన్నింగ్స్‌ తొలి బంతికే సిక్స్‌ కొట్టిన బెయిర్‌ స్టో ఈ ప్రపంచకప్‌నకు, ఇంగ్లాండ్‌ టీమ్‌కు మంచి ఆరంభాన్ని ఇచ్చాడు. ఐదో బంతికి కూడా బెయిర్‌ స్టో ఫోర్‌ కొట్టడంతో తొలి ఓవర్‌లోనే బ్రిటీష్‌ జట్టు 12 పరుగులు చేసింది. అనంతరం కూడా సమయోచితంగా బ్యాటింగ్‌ చేసిన ఇంగ్లాండ్‌ ఓపెనర్లు ఆరు ఓవర్లలో 35 పరుగులు చేశారు. కానీ జట్టు స్కోరు 40 పరుగుల వద్ద డేవిడ్‌ మలాన్‌ను మ్యాట్‌ హెన్రీ ఔట్‌ చేసి ఇంగ్లాండ్‌ పతనాన్ని ఆరంభించాడు. ఆ తర్వాత వరుస విరామాల్లో బ్రిటీష్‌ జట్టు వికెట్లు కోల్పోయింది. ఓ వైపు వికెట్లు పడుతున్నా జో రూట్‌ మాత్రం పోరాడాడు. ఆరు వికెట్లు పడేంత వరకూ క్రీజులో ఉన్న రూట్‌... పోరాటం కొనసాగించాడు. కానీ 86 బంతుల్లో 77 పరుగులు చేసిన రూట్‌ను ఫిలిప్స్‌ బౌలింగ్‌లో రివర్స్‌ స్వీప్‌ ఆడి మూల్యం చెల్లించుకున్నాడు. దీంతో 229 పరుగుల వద్ద బ్రిటీష్‌ జట్టు ఏడో వికెట్‌ కోల్పోయింది. అనంతరం టెయిలెండర్లు రాణించడంతో ఇంగ్లాండ్ నిర్ణీత ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 282 పరుగులు చేసింది. కివీస్‌ బౌలర్లలో మ్యాట్ హెన్రీ 3, గ్లెన్ ఫిలిప్స్ 2, మిచెల్ సాంట్నర్ 2, ట్రెంట్ బౌల్ట్, రచిన్ రవీంద్ర ఒక్కో వికెట్ తీశారు. తుంటి గాయంతో బాధపడుతున్న ఇంగ్లాండ్ స్టార్‌ ఆల్‌రౌండర్ బెన్‌ స్టోక్స్‌ ఈ మ్యాచ్‌కు దూరంగా ఉన్నాడు.


కివీస్‌ ధనాధన్‌


కష్టసాధ్యంకాని లక్ష్యంతో బరిలోకి దిగిన కివీస్‌కు ఆరంభంలోనే షాక్‌ తగిలింది. రెండో ఓవర్‌లోనే సామ్‌కరణ్‌ బౌలింగ్‌లో ఓపెనర్‌ విల్‌ యంగ్‌ డకౌట్ అయ్యాడు. ఇన్నింగ్స్‌ ఏడో బంతికే వికెట్‌ కోల్పోవడంతో బ్రిటీష్‌ జట్టు బౌలింగ్‌ను ఘనంగా ప్రారంభించినట్లు అయింది. కానీ ఈ ఆనందం ఇంగ్లాండ్‌కు ఎక్కువసేపు నిలువలేదు. డేవాన్ కాన్వే, వన్‌ డౌన్‌ బ్యాటర్ రచిన్‌ రవీంద్ర.. ఇంగ్లాండ్‌ బౌలర్లను ఓ ఆట ఆడుకున్నారు. ఈ ఇద్దరు బ్యాటర్లు సెంచరీలతో కదం తొక్కడంతో కివీస్‌కు విజయం నల్లేరుపై నడకగా మారింది. కాన్వే ఊచకోతకు ఇంగ్లాండ్‌ బౌలర్లకు దిక్కుతోచలేదు. ఎన్నిసార్లు బౌలింగ్‌ మార్చినా ఈ భాగస్వామ్యాన్ని విడదీయడం బ్రిటీష్‌ బౌలర్ల తరం కాలేదు. కాన్వే 152, రచిన్‌ రవీంద్ర 123 పరుగులతో చెలరేగడంతో ఇంగ్లాండ్‌ విధించిన 282 పరుగుల లక్ష్యాన్ని కివీస్‌ కేవలం ఒక వికెట్‌ మాత్రమే కోల్పోయి 36.2 ఓవర్లలోనే ఛేదించింది. ఇంగ్లాండ్ బౌలర్లలో సామ్ కరణ్‌ మాత్రమే ఒక్క వికెట్‌ తీసుకున్నాడు.


ఇంగ్లాండ్‌ రికార్డు


 తొలి మ్యాచ్‌లో ఓడినా ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్‌ ఓ అరుదైన రికార్డు నెలకొల్పింది. జట్టులోని సభ్యులందరూ రెండంకెల స్కోర్లు చేసి చరిత్ర సృష్టించారు. 4658 వన్డేల చరిత్రలో ఇలా జరగడం ఇదే తొలిసారి.