టీడీపీ-జనసేన కలయిక వ్యాక్సిన్ కాదు, వైరస్ అని మంత్రి జోగి రమేష్ ఎద్దేవా చేశారు. నువ్వు ఒక పావలా.. నీ చుట్టూ 4 పావలాలు.. కలిపితే రూపాయి పావలా అని పవన్ కల్యాణ్ ను ఉద్దేశించి మాట్లాడారు. పవన్‌ కళ్యాణ్‌ పెడన సభా అట్టర్‌ఫ్లాప్‌, పవన్ కు వరుసగా భంగపాటు అని అన్నారు. వైఎస్సార్‌ సీపీ కేంద్ర కార్యాలయంలో రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి జోగి రమేశ్‌ ప్రెస్‌మీట్‌ నిర్వహించారు.


పవన్‌ వి గాలి మాటలని తేలింది
‘‘నిన్న (బుధవారం) పెడనలో జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌ సభలో.. ఏదో చేసేయాలని చాలా తాపత్రయపడ్డాడు. 2 వేల మంది గుండాలను పోగు చేస్తున్నామని, తనపై రాళ్ల దాడి జరుగుతుందని, తనపై కత్తులు, కటార్లతో దాడికి ప్లాన్‌ చేస్తున్నారని ఆవేశంగా ఆరోపించాడు. కానీ పెడనలో పవన్‌ బహిరంగ సభకు కనీసం 2 వేల మంది కూడా రాలేదు. అతనివి గాలి మాటలని తేలిపోయింది. గాలి పోగేసి ఆరోపణలు చేస్తాడని పెడన సభ చూస్తే ప్రజలకు అర్థమైంది. ఇంత నీచానికి పవన్ దిగజారిపోయాడు.


పొత్తులు పెట్టుకున్న తర్వాత, జరుగుతున్న వారాహి యాత్రకు ప్రజలు బ్రహ్మరథం పడతారని పవన్‌ భావించాడు. కానీ అవనిగడ్డలో పొత్తు ప్రకటన తర్వాత జరిగిన తొలి సభలో జనం ఆయన్ను ఆదరించలేదు. దీంతో అందరి అటెన్షన్‌ క్రియేట్‌ చేయడం కోసం, పెడనలో తనపై దాడికి ప్లాన్‌ చేస్తున్నారని ఆరోపించాడు. కానీ అక్కడ కూడా ఆయన సభ అట్టర్‌ఫ్లాప్‌ అయింది. 


వాక్సిన్‌ కాదు. వైరస్‌. విషబీజం:
జనసేన, తెలుగుదేశం కలయిక వాక్సిన్‌ అని పవన్ అంటున్నాడు. కానీ ప్రజలు అది ఒక వైరస్‌ అన్నారు. అంతే కాకుండా ఆ కలయిక పాయిజన్‌తో సమానం అని తేల్చి చెప్పారు. ఎందుకంటే.. 2014లో మీ ఇద్దరి కలయిక, మీ ఇద్దరి బంధం, మీ ఇద్దరు ఏ విధంగా అందరినీ మోసం చేసింది, దగా చేసింది అన్నది అందరూ చూశారు. నీ దత్తతండ్రి చంద్రబాబు ఏ విధంగా స్కీమ్‌ల పేరుతో స్కామ్‌లు చేశాడనేది అందరూ గుర్తించారు. సూట్‌కేస్‌ కంపెనీలు, హవాలా వ్యవహారాలు అన్నీ ఆధారాలతో సహా పట్టుబడి, ఈరోజు రాజమండ్రి సెంట్రల్‌ జైలులో ఉన్నాడు నీ దత్తతండ్రి.


ఆయనకు మద్దతుగా నీవు జైలుకు వెళ్లి, ములాఖత్‌ అయి, ఆ తర్వాత మిలాఖత్‌ అయ్యావు. బయటకు వచ్చి, వచ్చే ఎన్నికల్లో ఇద్దరూ కలిసి పోటీ చేస్తామని ప్రకటించావు. ఆ తర్వాత నీవు చేపట్టిన వారాహి మరో విడత యాత్రలో ప్రజలు అపూర్వంగా ఆదరిస్తారని ఆశించావు. కానీ నీకు ఎక్కడా ఆ ఆదరణ లభించడం లేదు.


క్షమాపణలు చెప్పాలి కదా..?
పెడన వచ్చిన నీవు మొదట, అక్కడి ప్రజలకు క్షమాపణలు చెబుతావని అందరూ అనుకున్నారు. నీ సినిమా.. అత్తారింటికి దారేది? అన్న సినిమా పైరసీ జరిగిందని, ఇక్కడి చేనేత కార్మికులు 30 మందిపై కేసు పెట్టించావు. వారిని పోలీస్‌ స్టేషన్‌లో పెట్టి కొట్టించావు. అంత పని చేసిన నీవు, ఏ ముఖం పెట్టుకుని పెడన వచ్చావు?


ఎల్లో బ్లడ్‌ ఎక్కించుకున్నావా?:
మరోవైపు వారు (టీడీపీ) కూడా నీపై విరుచుకుపడ్డారు. లీడర్‌షిఫ్‌ అంటే మాది. ఎవరైనా సీఎం కావాలంటే.. మా సామాజికవర్గం బ్లడ్‌ ఎక్కించుకోవాలని టీడీపీ వారన్నారు. ఆ మాటలు నీకు గుర్తు లేవా? అసలు నీకు ఏమైనా సిగ్గుందా? వారి బ్లడ్‌ ఏమైనా ఎక్కించుకున్నావా? అందుకే ఇప్పుడు ఇలా మాట్లాడుతున్నావా? రాజమండ్రి సెంట్రల్‌ జైలులో వారి బ్లడ్‌ ఎక్కించుకున్నావా? వారికి అమ్ముడుపోయావా? అందుకే మళ్లీ కలిసి పోటీ చేస్తామంటున్నావా?


పవన్‌ రెడీగా ఉండు.. నీతో సినిమాలు తీస్తా:
నన్ను అండమాన్‌ జైలుకు పంపిస్తాను అని పవన్‌ అన్నాడు. పవన్, నీకో విషయం చెబుతున్నా. 2024 తర్వాత నీవు రెడీగా ఉండు. నీతో నేను రెండు సినిమాలు తీస్తాను. జానీ–ఖూనీ. గబ్బర్‌సింగ్‌–రబ్బర్‌సింగ్‌. ఈ రెండు సినిమాలు తీస్తాను. ఎందుకంటే, ఆయన అప్పుడు సినిమాలు మాత్రమే చేసుకోవాలి  కాబట్టి..’’ అని మంత్రి జోగి రమేశ్‌ అన్నారు.