Neeraj Chopra Wins Gold: భారత జావెలిన్ త్రో స్టార్ నీరజ్ చోప్రా మళ్లీ మెరిసాడు. లుసాన్ డైమండ్ లీగ్ అంచెలో అగ్రస్థానంతో స్వర్ణ పతకం నెగ్గాడు. ఈ ప్రదర్శనతో జ్యూరిచ్ డైమండ్ లీగ్ ఫైనల్స్ కు అర్హత కూడా సాధించాడు. అంతేకాకుండా 2023 ప్రపంచ ఛాంపియన్ షిప్ బెర్తు దక్కించుకున్నాడు. 


ఈ పోటీ తొలి ప్రయత్నంలోనే జావెలిన్ ను 89.08 మీటర్లు విసిరి అగ్రస్థానంలో నిలిచాడు నీరజ్. ఆ తర్వాత రెండో ప్రయత్నంలో 85.18 మీటర్లు ఈటెను విసిరాడు. డైమండ్ లీగ్ లో విజయం సాధించిన తొలి భారత అథ్లెట్ గా నీరజ్ చరిత్ర సృష్టించాడు. 


నెల రోజుల క్రితమే ప్రపంచ అథ్లెటిక్స్​ ఛాంపియన్​షిప్స్​లో భారత స్టార్​ అథ్లెట్​ నీరజ్​ చోప్రా సత్తా చాటాడు. అమెరికాలోని యూజీన్‌లో జరిగిన జావెలిన్​ త్రో ఫైనల్లో రెండో స్థానంలో నిలిచి, రజత పతకాన్ని సొంతం చేసుకున్నాడు. దేశం తనపై పెట్టుకున్న ఆశల్ని సజీవంగా నిలుపుతూ సిల్వర్ మెడల్‌ను అందించాడు. 46 ఏళ్ల ప్రపంచ అథ్లెటిక్స్‌ చాంపియన్‌షిప్‌ చరిత్రలో భారత్‌కు ఇది కేవలం రెండో పతకం మాత్రమే.


కామన్వెల్త్ క్రీడల్లో నీరజ్‌ చోప్రా అందరికీ షాకిచ్చిన సంగతి తెలిసిందే. బర్మింగ్‌హామ్‌లో జరిగే ప్రతిష్ఠాత్మక క్రీడలకు అతడు వెళ్లలేదు. ప్రపంచ అథ్లెటిక్స్‌ ఛాంపియన్‌షిప్‌లో గాయపడటమే ఇందుకు కారణం. ఫైనల్లో కఠిన పరిస్థితులు ఎదుర్కొన్నానని అతడు పేర్కొన్నాడు.  పరుగెత్తుతున్నప్పుడు కాళ్లలో ఇబ్బందిగా అనిపించిందని చెప్పాడు.  తొడ కండరాలు పట్టేశాయని పేర్కొన్నాడు. అయితే కోలుకొని అతడు కచ్చితంగా కామన్వెల్త్‌ ఆడతాడని అంతా భావించారు. కానీ గాయం తీవ్రత అలాగే  టోర్నీ నుంచి తప్పుకొన్నాడు.