Neeraj Chopra Injury: క్రీడాభిమానులకు షాక్‌! కామన్వెల్త్ క్రీడల్లో ఓ పతకం తగ్గినట్టే! భారత బల్లెం వీరుడు, పతకాల ధీరుడు నీరజ్‌ చోప్రా కామన్వెల్త్‌ క్రీడలకు దూరమవుతున్నాడని తెలిసింది. బర్మింగ్‌హామ్‌లో జరిగే ప్రతిష్ఠాత్మక క్రీడలకు వెళ్లకపోవచ్చని సమాచారం. ప్రపంచ అథ్లెటిక్స్‌ ఛాంపియన్‌షిప్‌లో గాయపడటమే ఇందుకు కారణమని అంటున్నారు.


దేశంలో అథ్లెటిక్స్‌కు ఊపుతెచ్చిన ఆటగాడు నీరజ్‌ చోప్రా! అతడు ఈటెను విసిరితే చాలు కచ్చితంగా పతకం వస్తుందన్న ధీమా! అలాంటిది అతడు కామన్వెల్త్‌కు దూరమవ్వడం బాధాకరం.  ఆదివారం జరిగిన ప్రపంచ అథ్లెటిక్స్‌ ఛాంపియన్‌షిప్‌లో అతడు అద్భుతం చేశాడు. జావెలిన్‌ను 88.13 మీటర్లు విసిరి రజతం ఒడిసిపట్టాడు. అంజుబాబి తర్వాత ఈ క్రీడల్లో పతకం తెచ్చిన ఆటగాడి రికార్డు సృష్టించాడు.




జావెలిన్‌ త్రో ఫైనల్లో నాలుగో ప్రయత్నంలో నీరజ్‌ చోప్రా విజయవంతం అయ్యాడు. జావెలిన్‌ను 88.13 మీటర్ల దూరం విసిరాడు. వాస్తవంగా అతడు తొలి ప్రయత్నంలో ఫౌల్ అయ్యాడు. రెండు, మూడు ప్రయత్నాల్లో 82.39, 86.37 మీటర్లు విసిరాడు. అయితే ఇవేవీ పతకాన్ని తెచ్చేవి కాదని భావించిన అతడు నాలుగో ప్రయత్నంలో 88.13 మీటర్లు జావెలిన్ విసిరి పతకాన్ని ఖాయం చేశాడు. చివరి రెండు ప్రయత్నాలలో అత్యధిక దూరం విసరాలని ప్రయత్నించిన నీరజ్ చోప్రా ఫౌల్ అయ్యాడు. రన్నప్‌ బాగా లేకపోవడం, తొడ కండరాలు పట్టేయడంతో ఇలా జరిగింది.


ఫైనల్లో కఠిన పరిస్థితులు ఎదుర్కొన్నానని నీరజ్‌ చోప్రా సైతం చెప్పాడు. పరుగెత్తుతున్నప్పుడు కాళ్లలో ఇబ్బందిగా అనిపించిందని పేర్కొన్నాడు. తొడ కండరాలు పట్టేశాయని పేర్కొన్నాడు. అయితే కోలుకొని అతడు కచ్చితంగా కామన్వెల్త్‌ ఆడతాడని అంతా భావించారు. కానీ గాయం తీవ్రత అలాగే ఉన్నట్టు తెలిసింది. దాంతో ముందు జాగ్రత్తగా అతడు టోర్నీ నుంచి తప్పుకోబోతున్నాడని వార్తలు వస్తున్నాయి.