Neeraj Chopra Lausanne Diamond League 2024: పారిస్‌ ఒలింపిక్స్‌(Paris olympics)లో వరుసగా రెండోసారి భారత్‌(Bharat)కు పతకం అందించి మంచి ఫామ్‌లో ఉన్న స్టార్‌ జావెలిన్‌ త్రోయర్‌.. నీరజ్‌ చోప్రా(Neeraj Chopra) మరోసారి మెరిశాడు. ప్రతిష్టాత్మకమైన డైమండ్‌ లీగ్‌లో రెండో స్థానంలో నిలిచి సత్తా చాటాడు. 2022లో జరిగిన డైమండ్‌ లీగ్‌లో అగ్రస్థానంలో నిలిచిన నీరజ్‌..ఈసారి రెండో స్థానంతో లుసానె డైమండ్‌ లీగ్‌ను రెండో స్థానంతో ముగించాడు. చివరి ప్రయత్నంలో ఈటెను 89.49 మీటర్ల దూరం విసిరి నీరజ్‌ రెండో స్థానంలో నిలిచాడు. అప్పటివరకూ టాప్‌ త్రీలో కూడా లేని  చివరి త్రోలో మాత్రం అద్భుతం చేశాడు. పారిస్ ఒలింపిక్స్‌లో నీరజ్‌ చేసిన ప్రదర్శన కంటే ఇదే అత్యుత్తమం కావడం గమనార్హం. తొలి ప్రయత్నంలో జావెలిన్‌ను 82.10 మీటర్ల దూరం విసిరిన నీరజ్‌ చోప్రా... ఆ తర్వాత నాలుగు ప్రయత్నాల్లోనూ కనీసం 86 మీటర్ల దూరం దాటలేకపోయారు. దీంతో డైమండ్‌ లీగ్‌లో భారత్‌కు నిరాశ తప్పదని అంతా భావించారు. కానీ చివరి ప్రయత్నంలో నీరజ్‌ ఈటెను 89.49 మీటర్ల దూరం విసిరి రెండో స్థానంలో నిలిచాడు. నీరజ్‌ కెరీర్‌లోనే ఈ ప్రదర్శన ఇది రెండో అత్యుత్తమ ప్రదర్శనగా నిలిచింది. డైమండ్‌ లీగ్‌ 2022లో నీరజ్‌ జావెలిన్‌ను 89.94 మీటర్లు విసిరాడు. నీరజ్‌కు ఇదే అత్యుత్తమ ప్రదర్శన కావడం విశేషం.


నీరజ్‌ వదల్లేదు..

రెండుసార్లు ప్రపంచ ఛాంపియన్, పారిస్ ఒలింపిక్స్ కాంస్య పతక విజేత గ్రెనడాకు చెందిన అండర్సన్ పీటర్స్ 90.61 మీటర్లతో ప్రతిష్టాత్మకమైన డైమండ్‌ లీగ్‌లో అగ్రస్థానంలో నిలిచాడు. జర్మనీకి చెందిన జూలియన్ వెబర్ 87.08 మీటర్లతో మూడో స్థానంలో నిలిచాడు.  మొదట్లో తాను అంతగా రాణించలేదని.. రెండో స్థానమే వచ్చినా ఆ 89.94 మీటర్ల త్రోతో సంతోషంగా ఉన్నానని నీరజ్‌ తెలిపాడు. తనకు చాలా క్లిష్టమైన ఆరంభం దక్కిందని.... కానీ పునరాగమనం చాలా బాగుందని.. తాను ఇలాంటి పోరాటాలను ఆస్వాదిస్తానని పోటీ ముగిసిన అనంతరం నీరజ్‌ చోప్రా అన్నాడు. ప్రారంభంలో తన త్రోలు కనీసం 83 మీటర్లు దాటలేదని... చివరి రెండు ప్రయత్నాలలో బలంగా ముందుకు సాగానని ఈ స్టార్‌ త్రోయర్‌ తెలిపాడు. 

 

గాయంతోనే బరిలోకి...

డైమండ్‌ లీగ్‌లో నీరజ్‌ చోప్రా గాయంతోనే బరిలోకి దిగాడు. గాయంతో బాధపడుతున్న చోప్రా ఆగస్టు 8న పారిస్ ఒలింపిక్స్‌లో 89.45 మీటర్ల త్రోతో రజతం సాధించాడు. పారిస్‌ ఒలింపిక్స్‌లో పాకిస్థాన్‌కు చెందిన అర్షద్ నదీమ్ 92.97 మీటర్ల త్రో ఒలింపిక్ రికార్డుతో స్వర్ణం సాధించాడు. టోక్యో  ఒలింపిక్స్‌లో చారిత్రాత్మక స్వర్ణం గెలుచుకున్నాడు. ఈ సీజన్‌ ముగిసిన తర్వాత నీరజ్‌ చోప్రా తన గాయానికి ఆపరేషన్‌ చేయించుకోవడంపై ఓ నిర్ణయం తీసుకున్నారు. గత ఏడాది బుడాపెస్ట్ ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో స్వర్ణం గెలిచినప్పటి నుంచి చోప్రాను ఈ గాయం వేధిస్తోంది.