Astrologically Says: భారతీయ సనాతన శాస్త్ర పరిజ్ఞానం జ్యోతిషంలో స్త్రీలకు, పరుషులకు ప్రత్యేకంగా సూచనలు, నియమాలు ఉంటాయి. స్త్రీలకు ఎడమ పక్క, పురుషులకు కుడి పక్కను ప్రామాణికంగా తీసుకుంటారు.


భారత దేశ సనాతన శాస్త్ర పరిజ్ఞానంలో స్త్రీ పురుషులకు ప్రత్యేక స్థానం ఉంటుంది. అన్ని నియమాలు ఇద్దరికీ సమానంగా ఉండవు. అందుకు శాస్త్ర బద్ధమైన కారణాలున్నాయి. ఈడ, పింగళ నాడులు స్త్రీ పురుషుల జీవితాల మీద ప్రత్యేక ప్రభావాలను కలిగిస్తాయి. స్త్రీలలో ఈడ నాడి చురుకుగా ఉంటే పురుషుల్లో పింగళ నాడి చురుకుగా ఉంటుంది. ఈ దృక్విషయం మీద ఆధారపడి వారి జీవితాలు నడుస్తాయని యోగ శాస్త్రం కూడా చెబుతోంది. కనుక జ్యోతిష పండితులు సైతం పురుషులకు, స్త్రీలకు వేర్వేరుగా విశ్లేషణలు చేస్తుంటారు. జ్యోతిషంలో శకున శాస్త్రం ప్రత్యేక విభాగం. ఇందులో జీవితంలో ఎదురయ్యే రకరకాల సందర్భాలను శకునాలుగా భావించి వాటి వెనుకున్న మంచి చెడులను వివరిస్తుంటారు. అలాంటి వాటిలో శరీర భాగాలు అదరడం వెనుక కూడా శకునం ఉంటుందని శాస్త్రం చెబుతోంది.


కన్ను అదరడాన్ని ప్రతీ ఒక్కరికి జీవితంలో ఏదో ఒక సందర్భంలో అనుభవం ఉండే ఉంటుంది. ఏకన్ను అదురుతోందనే దాన్ని బట్టి అది మంచికా, చెడుకా అనేది అంచనాలు వేస్తూ ఉంటారు. జ్యోతిషంలో లింగాన్ని బట్టి కచ్చితమైన అంచనాలు వేసే వీలు ఉంటుంది. ఎడమ కన్ను అదిరింది పురుషులకా? స్త్రీలకా? అన్నదాని మీద ఆధారపడి ఫలితాలు ఉంటాయని శాస్త్రం చెబుతోంది. స్త్రీలకు ఎడమ కన్ను అదిరితే ఎలాంటి ఫలితాలుంటాయని జ్యోతిషం విశ్లేషిస్తోందో మనం తెలుసుకుందాం.


స్త్రీలకు ఎడమ కన్ను అదిరితే శుభప్రదమా?


భారతీయ జ్యోతిష పండితులు చెప్పిన దాని ప్రకారం స్త్రీలకు ఎడమ కన్ను అదిరితే అది మంచి సంకేతమేనట. ఇలా ఎడమ కన్ను అదిరితే ఆ మహిళకు జీవితంలో ఏదో మంచి జరగబోతోందనేందుకు సూచనగా బావించాలట. దీర్ఘకాలంగా ఆశిస్తున్నదేదో ఫలించబోతోందని అర్థం అని శాస్త్రం చెబుతోంది. అది ప్రేమ ఫలించడం, వృత్తి ఉద్యోగాల్లో రాణించడం, ఆర్థిక సమస్యలు తీరిపోవడం, న్యాయపరమైన చిక్కులు పరిష్కారం కావడం ఇలా ఏదైనా కావచ్చు.


స్త్రీలకు ఎడమ కన్ను అదిరితే కుటుంబంలోకి సుఖసంతోషాలు రానున్నాయని అర్థం కూడా ఉందట. కుటుంబ సభ్యుల మధ్య సామరస్యం నెలకొని ఇంట్లో సుఖశాంతులు కలుగుతాయనేందుకు సంకేతం కావచ్చు. దంపతులు ఒకరితో ఒకరు ఎక్కువ సమయం గడిపే అవకాశాలు ఏర్పడుతాయి. అన్యోన్యత పెరుగుతుంది.


కన్నులో ఏభాగం అదిరింది?


కన్నులో ఏ భాగం అదురుతోందనే దాన్ని బట్టి కూడా ఫలితాలుంటాయని శాస్త్రం చెబుతోంది. కన్ను ఎప్పుడైనా మొత్తంగా అదరడం జరగదు. కంటిలో ఏదో ఒక భాగం మాత్రమే అదురుతుంది. పైరెప్ప, స్త్రీ ఎడమ కంటి కింది రెప్ప లేదా రెండు రెప్పలు అదిరితే ఆమెకు త్వరలోనే వివాహం నిశ్చయం అవుతుందనేందుకు సంకేతమట. కంటిలో ముక్కుకు దగ్గరగా ఉండే భాగంలో మాత్రమే అదిరితే త్వరలో ఆమె తల్లి అయ్యే అవకాశం ఉంటుంది. తప్పకుండా జీవితంలోకి అదృష్టం రానుందనే సంకేతం.