Neeraj Chopra: బరిసె చేతబట్టి బరిలోకి దిగితే రికార్డులు బద్దలవ్వాల్సిందే.. అప్పటిదాకా ఉన్న రికార్డులను చెరిపేస్తూ కొత్త చరిత్రను లిఖించాల్సిందే. ఆ కుర్రాడి ఈట విసిరే వేగానికి, విసిరిన తర్వాత అతడి ఆత్మవిశ్వాసానికి ప్రత్యర్థులు సైతం ఫిదా అవ్వాల్సిందే. జూనియర్ లెవల్‌లోనే అందరి ప్రశంసలు పొందిన గోల్డెన్ బాయ్ నీరజ్ చోప్రా.. అంతర్జాతీయ స్థాయిలో కూడా తనకు తిరుగులేదని మరోసారి నిరూపించాడు. హంగేరి రాజధాని బుడాపెస్ట్ వేదికగా జరుగుతున్న ప్రపంచ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్స్ - 2023లో భాగంగా ఆదివారం రాత్రి ముగిసిన జావెలిన్ త్రో ఫైనల్‌లో ఈటను 88.17 మీటర్ల దూరం విసిరి వరల్డ్ ఛాంపియన్‌గా అవతరించాడు. ఈ పోటీలలో ఇంతవరకూ స్వర్ణం నెగ్గని భారత్‌కు పసిడిని అందించాడు.
1983 నుంచి జరుగుతున్న వరల్డ్ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్స్‌లో భారత్ ఇంతవరకూ ఒక్క స్వర్ణం కూడా గెలవలేదు. 18 సార్లు జరిగిన ఈ పోటీలలో భారత్ ఇంతవరకూ గెలిచిన పతకాలు కూడా రెండంటే రెండే (నీరజ్ చోప్రా స్వర్ణం గెలవడానికంటే ముందు).. 2003లో పారిస్‌లో జరిగిన పోటీలలో కేరళకు చెందిన అథ్లెట్ అంజూ బాబి జార్జ్.. కాంస్యం గెలిచింది. గతేడాది నీరజ్ చోప్రా యూఎస్ వేదికగా ముగిసిన వరల్డ్ ఛాంపియన్‌షిప్స్‌లో రజతం నెగ్గాడు. కానీ ఇప్పుడు టోక్యో ఒలింపిక్స్‌లో త్రివర్ణ పతాక కీర్తిని రెపరెపలాడించిన ఆ గోల్డెన్ బాయే వరల్డ్ ఛాంపియన్‌గా అవతరించి ఈ పోటీలలో భారత్‌కు పసిడి బెంగను తీర్చాడు.
అన్నీ రికార్డు త్రో లే..
చిన్న వయసు నుంచే అథ్లెట్‌గా ఎదగాలని కలలు కన్న నీరజ్.. 2015లో వెలుగులోకి వచ్చాడు. జూనియర్ స్థాయిలో బరిలోకి దిగిన అతడు.. సౌత్ ఆసియన్ గేమ్స్ (గువహతిలో జరిగాయి) మొదటిస్థానం సాధించాడు. 15 ఏండ్ల వయసులోనే బరిసెను ఏకంగా 82.23 మీటర్లు విసిరి స్వర్ణం గెలుచుకున్నాడు. ఆ తర్వాత 2020లో వియాత్నాంలో జరిగిన ఆసియన్ అండర్ -20 ఛాంపియన్‌షిప్స్‌లో రెండో స్థానంలో నిలిచాడు. అదే ఏడాది వరల్డ్ అండర్ - 20 ఛాంపియన్‌షిప్స్‌లో ఏకంగా 86.48 మీటర్లు విసిరి మొదటి స్థానం దక్కించుకున్నాడు. 2017 ఆసియన్ ఛాంపియన్‌షిప్స్, 2018లో కామన్వెల్త్స్ గేమ్స్, ఆసియన్ గేమ్స్ (జకర్తా) లలో స్వర్ణాలు నెగ్గాడు.
2021లో అయితే నీరజ్ చోప్రా ప్రపంచం దృష్టిని ఆకర్షించి భారత్‌కు ట్రాక్ అండ్ ఫీల్డ్‌లో తొలి స్వర్ణం అందించాడు. ఆ ఏడాది టోక్యో వేదికగా ముగిసిన ఒలింపిక్స్‌లో జావెలిన్‌ను తొలి ప్రయత్నంలతోనే 87.58 మీటర్ల దూరం విసిరి స్వర్ణం గెలుచుకున్నాడు. టోక్యో ఒలింపిక్స్‌కు ముందు దేశంలో క్రీడల గురించి అవగాహన ఉన్నవారికి మాత్రమే తెలిసిన చోప్రా పేరు.. ఆ విజయం తర్వాత గ్రామగ్రామాన మార్మోగిపోయింది. గతేడాది డైమండ్ లీగ్‌లో పసిడి నెగ్గిన నీరజ్ చోప్రా.. యూనైటైడ్ స్టేట్స్ (యూగెన్)లో జరిగిన వరల్డ్ ఛాంపియన్‌షిప్స్‌లో 88.13 మీటర్ల దూరం విసిరి రెండో స్థానంతో సరిపెట్టుకున్నాడు. ఆ తర్వాత తొడ కండరాలు పట్టేయడంతో కామన్వెల్త్ గేమ్స్ (బర్మింగ్‌హామ్) నుంచి తప్పుకున్నాడు. గాయం తర్వాత కొన్నాళ్లు విరామం తీసుకుని ఈ ఏడాది మేలో దోహాలో ముగిసిన డైమండ్ లీగ్‌లో 88.67 మీటర్లు విసిరి గ్రాండ్ రీఎంట్రీ ఇచ్చాడు. ఇక తాజాగా వరల్డ్ ఛాంపియన్‌షిప్స్‌లో స్వర్ణం సాధించి త్వరలో జరుగబోయే ఆసియా క్రీడలతో పాటు వచ్చే ఏడాది పారిస్ వేదికగా జరగాల్సి ఉన్న ఒలింపిక్స్‌లో మువ్వన్నెల పతాకాన్ని మరోసారి రెపరెపలాడించడానికి సిద్ధమవుతున్నాడు.
ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి
Join Us on Telegram: https://t.me/abpdesamofficial