నీరజ్ చోప్రా మరోసారి చరిత్ర సృష్టించాడు. ఈ ఒలింపిక్ ఛాంపియన్ ను ఇక ముందు ప్రపంచ ఛాంపియన్ అని కూడా పిలవాలి. ప్రపంచ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్స్ లో స్వర్ణం సాధించిన తొలి భారతీయుడిగా నీరజ్ చోప్రా చరిత్ర సృష్టించాడు. 


ఆదివారం జరిగిన ప్రపంచ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్స్ లోని జావెలిన్ త్రో ఫైనల్ లో నీరజ్ 88.17 మీటర్ల త్రోతో విజేతగా నిలిచాడు. నీరజ్ గెలిచిన ఈ స్వర్ణం మొత్తం మీద ప్రపంచ అథ్లెటిక్స్ లో భారత్ కు లభించిన మూడో పతకం మాత్రమే. అంతకముందు 18 సార్లు వచ్చిన పతకాలు కేవలం రెండే. అలాంటిది ఈసారి ఏకంగా స్వర్ణం సాధిస్తూ నీరజ్ తన పేరును సువర్ణాక్షరాలతో లిఖించుకున్నాడు. 


ఫైనల్ లో తొలి త్రోలో నీరజ్ ఫౌల్ చేశాడు. రెండో ప్రయత్నంలో 88.17 మీటర్లు విసిరి అగ్రస్థానానికి దూసుకెళ్లాడు. మూడోసారి 86.32 మీటర్లు విసిరాడు. ఆ తర్వాతి మూడు ప్రయత్నాల్లోనూ 88 మీటర్ల మార్క్ దాటలేకపోయాడు. సో రెండో ప్రదర్శనే అత్యుత్తమం. దాంతోనే స్వర్ణం సాధించాడు. 


క్రితంసారి ఛాంపియన్షిప్స్ లో రజతం సాధించిన నీరజ్ ఈసారి మరో అడుగు ఘనంగా ముందుకేసి పసిడి పట్టేశాడు. నీరజ్ తన గేమ్‌ను ఫౌల్‌తో ప్రారంభించాడు. కానీ వెంటనే తేరుకొని రెండో ప్రయత్నంలో అద్భుతం సాధించాడు. రెండోసారి జావెలిన్‌ను 88.17 మీటర్లు విసిరాడు. అప్పటి వరకు టాప్‌లో ఉన్న ఒలివర్ హెలాండర్ విరిసిన 83.38 మీటర్లు కంటే దాదాపు నాలుగు మీటర్లు ఎక్కువ అన్నమాట. నీరజ్‌ చోప్రాకు పాకిస్థాన్‌కు చెందిన అర్షద్ నదీమ్, జర్మనీకి చెందిన జూలియన్ వెబర్, చెక్ రిపబ్లిక్‌కు చెందిన జాకుబ్ వడ్లెజ్‌ నుంచి గట్టి పోటీ ఎదురైంది. అయినా చోప్రాను అధిగమించలేకపోయారు. 






టోక్యో ఒలింపిక్స్ 2020లో పురుషుల జావెలిన్ త్రోలో స్వర్ణ పతకం సాధించిన తర్వాత నీరజ్‌కు ఇది రెండో మెగా అచీవ్‌మెంట్. ఆగస్టు 7, 2021న భారత్‌కు తొలిసారి ఒలింపిక్ పతకాన్ని అందించాడు. ఈ విజయాల సాధనలో నీరజ్‌ ఎన్నో ఆటంకాలను అధిగమించాడు. 2019లో శస్త్రచికిత్స కారణంగా దోహా ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లను వదులుకోవాల్సి వచ్చింది. జనవరి 2020లో టోక్యో ఒలింపిక్స్‌కు అర్హత సాధించి కఠోర శ్రమతో పోటీలో నిలబడ్డాడు. 


టోక్యో ఒలింపిక్స్‌లో జర్మనీ సూపర్‌స్టార్ జోహన్నెస్ వెటర్ నుంచి గట్టి పోటీని ఎదుర్కొన్నాడు నీరజ్‌. ఫైనల్‌ రౌండ్‌లో చోప్రా తన మొదటి ప్రయత్నంలో 87.03 మీటర్ల త్రోతో ఆకట్టుకున్నడాు. రెండో ప్రయత్నంలో అంతకు ముంచి అన్నట్టు 87.58 మీటర్లకు జావెలిన్‌ విసిరాడు. మూడో త్రోలో మాత్రం అతని వేగం తగ్గిపోయింది. 87.58 మీటర్లతో టాప్‌లో నిలిచి బంగారు పతకాన్ని సాధించాడు. నిజానికి 87.03 మీటర్లు గోల్డ్‌ సాధించడానికి సరిపోయేదే.


చోప్రా విజయం కేవలం వ్యక్తిగత విజయమే కాదు, భారత అథ్లెటిక్స్‌కు మైలురాయిగా నిలిచింది. భారతీయులు ఒలింపిక్ పోడియంలో నిలబడగలరనే నమ్మకాన్ని భవిష్యత్ తరాలకు కలిగించింది.