Neeraj Chopra: వరల్డ్ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్స్‌లో భారత జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రాతో పాటు  పతకం గెలిచిన  పాకిస్తాన్ అథ్లెట్ అర్షద్ నదీమ్  తన ప్రదర్శన పట్ల సంతోషాన్ని వ్యక్తం చేస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. యూరోపియన్లు ఆధిపత్యం చెలాయించే జావెలిన్ త్రో  విభాగంలో  నీరజ్ చోప్రాతో కలిసి తాను వారి కోటను బద్దలుకొడుతున్నామని అర్షద్ తెలిపాడు. 


బుడాపెస్ట్ (హంగేరి) వేదికగా ఆదివారం జరిగిన జావెలిన్ త్రో ఫైనల్‌లో 88.17 మీటర్లు విసిరి  చోప్రా స్వర్ణం సాధించగా 87.82 మీటర్ల దూరం విసిరి రజత పతకం గెలుచుకున్నాడు. పతకాల పంపిణీ కార్యక్రమం  ముగిసిన తర్వాత నదీమ్ మాట్లాడుతూ.. ‘నీరజ్‌తో నాకు ఆరోగ్యకరమైన పోటీ ఉంది. మేమిద్దరం పరస్పరం గౌరవించుకుంటాం.   మా ఇద్దరి మధ్య చిరకాలంగా ఉన్న ఇండియా - పాకిస్తాన్ వైరం ఉండదు. మేమిద్దరం చాలా ఆప్యాయంగా మాట్లాడుకుంటాం.  నీరజ్, నేను కలిసి  చాలాకాలంగా జావెలిన్ త్రో లో యూరోపియన్ల ఆధిపత్యాన్ని బద్దలుకొడుతున్నాం..’ అని చెప్పుకొచ్చాడు. 


అర్షద్ చెప్పినట్టు... 2020 టోక్యో ఒలింపిక్స్‌కు ముందు వరకూ  జావెలిన్ త్రోలో  యూరప్ ఆధిక్యం స్పష్టంగా ఉండేది.  ఒలింపిక్స్ లోనే గాక వరల్డ్ ఛాంపియన్‌షిప్స్‌లోనూ వాళ్లదే హవా.  జర్మనీ, ఫిన్లాండ్, నార్వే, హంగేరి, చెక్ రిపబ్లిక్ దేశాల ఆటగాళ్లు పతకాలు కొల్లగొట్టేవారు. కానీ 2021లో నీరజ్ చోప్రా వచ్చాక వాళ్ల ఆధిపత్యం క్రమంగా తగ్గుతోంది.  నీరజ్‌కు తోడుగా  అర్షద్ కూడా సత్తా చాటుతున్నాడు. ఐరోపా ప్లేయర్లకు ఈ ఇద్దరూ గట్టిపోటీనిస్తున్నారు.  గత వరల్డ్ ఛాంపియన్‌షిప్స్‌లో నీరజ్ రజతం గెలవగా ఇప్పుడు దాని రంగు మార్చాడు.  అర్షద్ కూడా ఒలింపిక్స్‌లో తృటిలో పతకం కోల్పోయినా కామన్వెల్త్ గేమ్స్, వరల్డ్ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్స్‌లో సత్తా చాటాడు. 


 






యూరోపియన్లతోనే గాక నీరజ్ - అర్షద్ మధ్య కూడా టగ్ ఆఫ్ వార్ నడుస్తోంది. 2016 నుంచి ఈ ఇద్దరి మధ్య పోటీ ఢీ అంటే ఢీ అన్నరేంజ్ లోనే సాగుతోంది.  సౌత్ ఏషియన్ గేమ్స్‌ (2016)లో నీరజ్ థర్డ్ ప్లేస్ దక్కించుకోగా అర్షద్ 3వ స్థానానికి పరిమితయ్యాడు.  అదే ఏడాది  వరల్డ్ అండర్ - 20 అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్స్ లో నీరజ్ తొలి స్థానం దక్కించుకోగా అర్షద్ 30వ స్థానంలో నిలిచాడు. టోక్యో ఒలింపిక్స్‌లో నీరజ్ ఫస్ట్ ప్లేస్‌లో ఉండగా  అర్షద్ ఐదో స్థానం దక్కించుకున్నాడు.  గతేడాది నీరజ్‌కు రజతం, అర్షద్‌ ఐదో ప్లేస్‌లో నిలిచాడు. 


జావెలిన్ త్రో ఫైనల్ ముగిసిన  తర్వాత  నీరజ్.. కాంస్యం నెగ్గిన వాద్లెచ్‌ (చెక్ రిపబ్లిక్)తో కలిసి ఫోటోలకు ఫోజులిచ్చాడు.  ఈ సందర్భంగా అతడు చేసిన పని నెటిజన్లను ఆకట్టుకుంటున్నది.  రజతం నెగ్గిన అర్షద్  నదీమ్‌ను కూడా  ఫోటో దిగేందుకు పిలిచాడు. అక్కడే ఉన్న నదీమ్.. తన దేశ జెండా కూడా పట్టుకోకుండానే నీరజ్ పక్కన నిలబడ్డాడు.  వెనుకాల  మువ్వన్నెల జెండాను పట్టుకుని నదీమ్‌ను ఆప్యాయంగా పిలిచినందుకు గాను నెటిజన్లు  నీరజ్‌పై ప్రశంసలు కురిపిస్తున్నారు. 










ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి   
Join Us on Telegram: https://t.me/abpdesamofficial