MS Dhoni: ప్రపంచ క్రికెట్ చరిత్రలో అత్యంత విజయవంతమైన కెప్టెన్లలో మహేంద్ర సింగ్ ధోనీ ఒకడు. మహేంద్ర సింగ్ ధోనీ సారథ్యంలో భారత జట్టు టీ20 ప్రపంచకప్‌ను కైవసం చేసుకుంది. దీని తర్వాత అతను వన్డే ప్రపంచ కప్ 2011ను కూడా గెలుచుకున్నాడు. అదే సమయంలో టీమిండియా ఐసీసీ టెస్ట్ ర్యాంకింగ్స్‌లో నంబర్ వన్ జట్టుగా నిలిచింది. అలాగే ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీని కూడా గెలుచుకుంది.


ఐసీసీ ట్రోఫీలు మాత్రమే కాకుండా ఐపీఎల్‌లో కూడా మహి అద్భుత ప్రతిభ కనబరిచాడు. మహేంద్ర సింగ్ ధోని కెప్టెన్సీలో చెన్నై సూపర్ కింగ్స్ ఐదు సార్లు ఐపీఎల్ ట్రోఫీని గెలుచుకుని రికార్డు సృష్టించింది. మహేంద్ర సింగ్ ధోనీ మినహా రోహిత్ శర్మ మాత్రమే కెప్టెన్‌గా ఐదు ఐపీఎల్ టైటిల్స్ గెలుచుకున్నాడు.


మహేంద్రుడి జెర్సీ నంబర్ 7 రహస్యం ఏమిటి?
అంతర్జాతీయ క్రికెట్‌తో పాటు,మహేంద్ర సింగ్ ధోనీ ఐపీఎల్ మ్యాచ్‌లలో జెర్సీ నంబర్ 7 ధరించి ఆడుతున్నాడు. అయితే మహి జెర్సీ నంబర్-7 రహస్యం ఏంటో తెలుసా? నిజానికి మహేంద్ర సింగ్ ధోనీ స్వయంగా తన జెర్సీ నంబర్-7ను వెల్లడించాడు. 7వ నంబర్‌తో తనకు ప్రత్యేక అనుబంధం ఎలా ఉందో చెప్పాడు. మహి తాను జూలై 7వ తేదీన పుట్టానని చెప్పాడు. సంవత్సరంలో జూలై 7వ నెల. తాను పుట్టిన సంవత్సరం 81... 8లో నుంచి 1 తీసివేస్తే 7. కాబట్టి ఈ కారణాలన్నింటి వల్ల తాను తన జెర్సీ నంబర్‌గా 7ని ఎంచుకున్నట్లు తెలిపాడు.


మహేంద్ర సింగ్ ధోనీ సుమారు 4 సంవత్సరాల క్రితం అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. అయితే మహేంద్ర సింగ్ ధోని ఇప్పటికీ ఐపీఎల్‌లో చెన్నై సూపర్ కింగ్స్ తరఫున ఆడుతున్నాడు. గతేడాది మహేంద్ర సింగ్ ధోనీ సారథ్యంలో చెన్నై సూపర్ కింగ్స్ రికార్డు స్థాయిలో ఐదోసారి ఐపీఎల్ టైటిల్‌ను గెలుచుకుంది.


ఈసారి మహేంద్ర సింగ్ ధోని నేతృత్వంలోని చెన్నై సూపర్ కింగ్స్ డిఫెండింగ్ ఛాంపియన్‌గా అవతరించాలని ఫ్యాన్స్ అంచనా  వేస్తున్నారు. ఐపీఎల్ 2024 సీజన్ మహేంద్ర సింగ్ ధోనీకి చివరి సీజన్ కావచ్చని భావిస్తున్నారు. అందుకే తమ అభిమాన క్రికెటర్‌ను చివరిసారిగా మైదానంలో చూడాలని క్రికెట్ అభిమానులు తహతహలాడుతున్నారు. 


అంతే కాకుండా‌ మహేంద్ర సింగ్‌ ధోనీ యువకులకు హితోపదేశం కూడా చేశాడు. కేవలం ఒక ఉన్నత పదవిలో ఉన్నంత మాత్రాన గౌరవం రాదని, దాన్ని మన ప్రవర్తనతో సంపాదించుకోవాలని సూచించాడు. మాటలు చెప్పడం కంటే చేతల్లో చూపిస్తేనే సహచరుల నమ్మకం పొందగలమని తెలిపాడు. డ్రెస్సింగ్‌ రూంలో సహచరులు, సహాయ సిబ్బందికి మన పట్ల గౌరవం లేకపోతే విధేయతతో ఉండరని ధోనీ కుండబద్దలు కొట్టినట్లు చెప్పాడు. కేవలం మాటలు మాత్రం చెబితే సరిపోదని, ఏదైనా చేతల్లోనే చూపించాలని స్పష్టం చేశాడు. మన కుర్చీ లేదా ర్యాంకు వల్ల గౌరవం వస్తుందని తాను భావించట్లేదని మహేంద్ర సింగ్ ధోని తెలిపాడు.