తనను సంప్రదించకుండా టీ20 ప్రపంచకప్‌లో ఆడే అఫ్గానిస్థాన్ జట్టును ప్రకటించడంపై రషీద్ ఖాన్ అలిగి కెప్టెన్సీ నుంచి వైదొలిగిన సంగతి తెలిసిందే. దీంతో అఫ్గానిస్థాన్ క్రికెట్ బోర్డు మహ్మద్ నబీని కెప్టెన్‌గా ఎంపిక చేసింది. మరి కొన్ని రోజుల్లో ప్రారంభంకానున్న ఐసీసీ టీ20 ప్రపంచకప్‌నకు నబీ అఫ్గాన్ కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. ఈ విషయాన్ని అతడు ట్విటర్ ద్వారా వెల్లడించాడు. ‘ఈ క్లిష్టమైన దశలో టీ20 ఫార్మాట్‌లో జాతీయ క్రికెట్ జట్టుకు నాయకత్వం వహించాలని అఫ్గాన్‌స్థాన్ క్రికెట్ బోర్డు తీసుకున్న నిర్ణయాన్ని గౌరవిస్తున్నా. భగవంతుని దయతో టీ20 ప్రపంచకప్‌లో దేశం గర్వపడే విధంగా రాణిస్తాం’ అని నబీ ట్వీట్ చేశాడు.
కెప్టెన్‌గా ఉన్న తనని సంప్రదించకుండానే టీ20 ప్రపంచకప్‌నకు జట్టును ప్రకటించడంపై అసహనం వ్యక్తం చేస్తూ రషీద్‌ఖాన్.. ఆ బాధ్యతల నుంచి తప్పుకొన్నాడు. ఈ విషయాన్ని రషీద్ ట్విటర్ ద్వారా వెల్లడించాడు. ‘అఫ్గాన్ క్రికెట్ జట్టుకు కెప్టెన్‌గా, బాధ్యతాయుతమైన సభ్యుడిగా ఉన్న నాకు.. ప్రపంచకప్ జట్టు ఎంపికచేసే ప్రక్రియలో పాలుపంచుకోవాల్సిన కనీస బాధ్యత ఉంటుంది. అలాంటిది అఫ్గాన్ క్రికెట్ బోర్డు కానీ, సెలక్షన్ కమిటి నన్ను సంప్రదించకుండానే జట్టును ప్రకటించింది. ఈ నేపథ్యంలో టీ20 కెప్టెన్సీ నుంచి తప్పుకొంటున్నా. అయితే, అఫ్గాన్ క్రికెట్ జట్టుకు ఆడటం ఎప్పటికీ నాకు గర్వకారణమే’ అని రషీద్ ఖాన్ ట్వీట్ చేశాడు.