మహిళల క్రికెట్లో ఎవరెస్టు శిఖరం మిథాలీ రాజ్ (Mithali Raj). కెరీర్లో ఆమె సాధించని రికార్డుల్లేవ్. అందుకోని ఘనతల్లేవ్! 23 ఏళ్లుగా అమ్మాయిల క్రికెట్‌కు సేవలందిస్తున్న ఈ టీమ్‌ఇండియా దిగ్గజం నేటితో విరామం ప్రకటించింది. అన్ని ఫార్మాట్ల క్రికెట్‌కు గుడ్‌బై చెప్పేసింది. ప్రస్తుతం భారత మహిళల క్రికెట్ పగ్గాలు ప్రతిభావంతుల చేతుల్లోనే ఉన్నాయని వెల్లడించింది. తనకు అండదండలు అందించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలియజేసింది.
'అత్యంత చిన్న వయసులోనే దేశానికి ప్రాతినిధ్యం వహించినందుకు గర్వంగా ఉంది. ఈ ప్రయాణంలో ఎన్నో ఎత్తుపల్లాలు చవిచూశాను. ప్రతి సంఘటన నాకో కొత్త పాఠం నేర్పించింది. నా జీవితంలోని చివరి 23 ఏళ్లు సవాళ్లు, సంతృప్తితో సాగాయి. వాటన్నిటినీ నేను ఆస్వాదించాను. అన్ని ప్రయాణాల్లాగే నాదీ ముగించాల్సిందే. ఈ రోజు నేను అంతర్జాతీయ క్రికెట్లో అన్ని ఫార్మాట్లకు వీడ్కోలు పలుకుతున్నా' అని మిథాలీ (Mithali Raj Retirement) ట్వీట్ చేసింది.
'మైదానంలోని అడుగు పెట్టిన ప్రతిసారీ నేను అత్యుత్తమంగా ఆడేందుకే ప్రయత్నించాను. భారత్‌ను గెలిపించేందుకే కష్టపడ్డాను. మువ్వన్నెల జెండాను రెపరెపలాడించేందుకు ప్రయత్నించాను. ప్రస్తుతం జట్టు ప్రతిభావంతులైన యువ క్రికెటర్ల చేతుల్లో ఉంది. భారత మహిళల క్రికెట్ జట్టు భవిష్యత్తు బాగుంటుందని తెలుసు. అందుకే నా ప్రయాణం ముగించేందుకు ఇదే సరైన సమయంగా భావిస్తున్నాను' అని మిథాలీ పేర్కొంది.
'నాకెంతో అండగా నిలిచిన బీసీసీఐ, జే షా (కార్యదర్శి)కి ధన్యవాదాలు. ఇన్నేళ్లు జట్టును నడిపించడం నాకెంతో గర్వకారణం. ఈ నాయకత్వం నా వ్యక్తిత్వాన్ని రూపొందించింది. ఇండియన్ క్రికెట్‌కు ఓ దశ తీసుకొచ్చిందని ఆశిస్తున్నా. ఈ ప్రయాణం ఇప్పుడు ముగిసినా ఆటకు సంబంధించి, మహిళల క్రికెట్‌కు అభ్యున్నతికి తోడ్పడే అవకాశాలు కచ్చితంగా దొరుకుతాయి. నా అభిమానులకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు' అని మిథాలీ వెల్లడించింది.