Mithali Raj Records: టీమ్‌ఇండియా క్రికెటర్ మిథాలీరాజ్ (Mithali Raj) ఇప్పటికే ఎన్నో రికార్డులు సృష్టించింది. తన సుదీర్ఘ కెరీర్లో పరుగులు, అర్ధశతకాల నుంచి విజయాల వరకు సరికొత్త గణాంకాలు నమోదు చేసింది. తాజాగా ఆమె మరో రికార్డు బద్దలు కొట్టింది. అత్యధిక వన్డే ప్రపంచకప్ మ్యాచులు ఆడిన కెప్టెన్‌గా చరిత్ర సృష్టించింది.
ప్రస్తుతం భారత మహిళల క్రికెట్ జట్టు న్యూజిలాండ్‌లో ఉంది. అక్కడ జరిగే ఐసీసీ మహిళల వన్డే ప్రపంచకప్ ఆడుతోంది. మిథాలీరాజ్‌కు ఇది ఆరో ప్రపంచకప్. ప్రపంచ క్రికెట్లో ఇప్పటి వరకు ఇద్దరు మాత్రమే ఈ ఘనత అందుకున్నారు. ఒకరు సచిన్ తెందూల్కర్, మరొకరు జావెద్ మియాందాద్. ఇప్పుడు ఆమె వారి సరసన చేరింది. ఇక వెస్టిండీస్‌తో పోరు ఆమె కెరీర్లో కెప్టెన్‌గా 24వ ప్రపంచకప్ పోరు.
ఇప్పటి వరకు కెప్టెన్‌గా అత్యధిక ప్రపంచకప్ మ్యాచులు ఆడిన రికార్డు ఆసీస్ మాజీ కెప్టెన్ బెలిండా క్లార్క్ పేరుతో ఉంది. ఆమె మొత్తంగా 23 మ్యాచులకు సారథ్యం వహించింది. మిథాలీ రాజ్ 24తో ఆ రికార్డును అధిగమించింది. ప్రపంచకప్‌లో టీమ్‌ఇండియా ఇంకా మ్యాచులు ఆడాల్సి ఉంది. ఆ లెక్కన ఈ సంఖ్య 30కి చేరినా ఆశ్చర్యం లేదు. వన్డే ప్రపంచకప్‌ల్లో మిథాలీ ఇప్పటి వరకు 785 పరుగులు చేసింది. మెగా టోర్నీలో అత్యధిక పరుగులు చేసిన రెండో అమ్మాయిగా నిలిచింది. బెలిండా క్లార్క్ 952తో అగ్రస్థానంలో ఉంది.
Ind vs WI ODI Smriti Mandhana Century: మహిళల వన్డే వరల్డ్ కప్‌లో భాగంగా శనివారం వెస్టిండీస్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో భారత మహిళలు దుమ్మురేపారు. ఫస్ట్ బ్యాటింగ్ చేసిన మిథాలీ రాజ్ సేన ప్రత్యర్థి విండీస్ మహిళల ఎదుట భారీ లక్ష్యాన్ని ఉంచారు. ఫస్ట్ బ్యాటింగ్ చేసిన భారత మహిళల జట్లు ఓపెనర్ స్మృతి మందాన (123), వైస్ కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ (109) శతకాలతో చెలరేగడంతో నిర్ణీత ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 317 పరుగులు చేసింది.