Malaysia Masters Badminton Tournament:  హైదరాబాద్ స్టార్ ష‌ట్ల‌ర్ పీవీ సింధు తన అద్భుతమైన ఆటతో (PV Sindhu) మ‌లేషియా మాస్ట‌ర్స్ ఫైన‌ల్లోకి ప్ర‌వేశించింది. సెమీఫైన‌ల్లో థాయ్‌లాండ్ ప్లేయ‌ర్ బుసాన‌న్ ఆంగ్‌బామ్‌రుంగ‌పాన్‌పై 13-21, 21-16, 21-12 స్కోరుతో విజ‌యం సాధించింది. ఈ ఏడాదిలో బ్యాడ్మింట‌న్ టోర్నీలో ఫైన‌ల్లోకి సింధు ప్ర‌వేశించ‌డం ఇదే తొలిసారి. గతసారి  2023 స్పెయిన్ మాస్ట‌ర్స్ టోర్నీలో ఆమె ఫైన‌ల్ వ‌ర‌కు వెళ్లింది.


శనివారం మ్యాచ్లో తొలి రౌండ్ నుంచే బుసాన‌న్‌పై సింధు ఆధిపత్యం చెలాయించింది.  మొదట్లో పీవీ సింధు త‌డ‌బాటుకు లోనవడంతో తొలి గేమ్‌లో బుసాన‌న్ పూర్తి ఆధిప‌త్యం ప్ర‌ద‌ర్శించింది. మొదటి గేమ్‌ను బుసాన‌న్ ఈజీగా కొట్టేసింది. అయితే రెండో గేమ్‌లో సింధు అనూహ్యంగా పుంజుకుంది. రానురాను త‌న ఆట‌తీరుతో పాయింట్లు సాధించింది. ఇక కీల‌కంగా మారిన మూడో గేమ్‌లోనూ పీవీ సింధు స‌త్తా చాటింది. దీంతో మలేషియా మాస్ట‌ర్స్ ఫైన‌ల్లోకి పీవీ సింధు ప్రవేశించింది.






సైనా నెహ్వాల్ రికార్డును బద్ధలుకొట్టిన సింధు 
సింధు సాధించిన గెలుపు తన కెరీర్‌లో 452వ విజయం. ఈ క్రమంలో భారత బ్యాడ్మింటన్‌ చరిత్రలో సింగిల్స్‌లో అత్యధిక విజయాలు సాధించిన షట్లర్‌గా ఉన్న సైనా నెహ్వాల్‌ (451) రికార్డును సింధు అధిగమించింది. అలాగే 2019లో హాంకాంగ్ ఓపెన్‌లో బుసానన్  సింధూను ఓడించి టైటిల్ సాధించింది. ఇప్పుడు సింధూ ఈ గెలుపుతో  త‌న ఓట‌మికి బ‌దులు తీర్చుకుంది.  అలాగే ఫైనల్స్ లో చైనాకు చెందిన వాంగ్ ఝి యీతో తలపడనుంది.


గతంలో సింధు నెగ్గిన  2022 సింగపూర్ ఓపెన్ ఫైనల్ ప్రత్యర్థి కూడా  వాంగ్ జి యినే కావడం గమనార్హం. ఇప్పుడు మరోసారి ఆమెను ఓడించి టైటిల్ నెగ్గాలనే పట్టుదలతో ఉంది తెలుగు తేజం సింధు. పారిస్ ఒలింపిక్స్‌కు ముందు సింధు ఆత్మవిశ్వాసాన్ని పెంచడంలో ఈ విజయం ప్రధాన పాత్ర పోషిస్తుంది.  జులై 26 నుంచి ఆగస్టు 11 వరకు జరిగే పారిస్ ఒలింపిక్స్‌కు జర్మనీలో శిక్షణ పొందేందుకు కి సింధుకు భారత క్రీడా మంత్రిత్వ శాఖ ఇటీవల అనుమతిని ఇచ్చింది మరో ఇండియన్  షట్లర్‌ అస్మిత 10-21, 15-21తో చైనాకు చెందిన ఆరో సీడ్‌ జాంగ్‌ యి మాన్‌ చేతిలో ఓడి టోర్నీ నుంచి నిష్క్రమించింది.