Sanju Samson Fans fire on BCCI: సంజూ శాంసన్‌ అభిమానుల ఆగ్రహం చల్లారేలా కనిపించడం లేదు! భారత్‌-ఏ కెప్టెన్‌గా ప్రకటించినా ఫైర్ అవుతున్నారు. టీమ్‌ఇండియా నుంచి తొలగించి చిన్న జట్టుకు ఎంపిక చేశారని  విమర్శిస్తున్నారు. టీ20 ప్రపంచకప్‌నకు తీసుకోలేదని సంజూకు లాలీపాప్‌ విసురుతున్నారా అంటూ ఘాటుగా ట్వీట్లు చేస్తున్నారు. సెలక్టర్లు, కెప్టెన్‌ రోహిత్‌ శర్మ అతడిని మోసం చేశారంటూ తీవ్రంగా ఆరోపిస్తున్నారు.




అక్టోబర్లో జరిగే టీ20 ప్రపంచకప్‌నకు సంజూ శాంసన్‌ను ఎంపిక చేయని సంగతి తెలిసిందే. దీంతో అతడి ఫ్యాన్స్‌ నిరసనలకు ప్లాన్‌ చేస్తున్నారని తెలిసింది. వారిని కాస్త కుదుటపరిచేందుకు బీసీసీఐ దిద్దుబాటు చర్యలు చేపట్టినట్టు అనిపించింది. న్యూజిలాండ్‌-ఏతో జరిగే మూడు వన్డేల సిరీసులో భారత్‌-ఏకు సంజూను కెప్టెన్‌గా ప్రకటించారు. మరికొన్ని రోజుల్లో న్యూజిలాండ్‌-ఏ ఉపఖండం పర్యటనకు వస్తోంది. మూడు వన్డేలు ఆడనుంది. సెప్టెంబర్‌ 22 నుంచి ఈ సిరీస్‌ మొదలవుతుంది. 22, 25, 27న మ్యాచులు జరుగుతాయి. చెన్నైలోని ఎంఏ చిదంబరం ఇందుకు వేదిక.


ఈ ఏడాది ఐపీఎల్‌లో సంజూ శాంసన్‌ అదరగొట్టాడు. తన కెప్టెన్సీ నైపుణ్యంతో జట్టును ఫైనల్‌కు తీసుకెళ్లాడు. రన్నరప్‌గా నిలిపాడు. 17 మ్యాచుల్లో 28 సగటు, 146 స్ట్రైక్‌రేట్‌తో 458 పరుగులు చేశాడు. టీమ్‌ఇండియా తరఫున 2022లో 6 వన్డేలు, 6 టీ20లు ఆడాడు. వెస్టిండీస్‌, జింబాబ్వే పర్యటనల్లో అందరినీ ఆకట్టుకున్నాడు. అయినప్పటికీ ఆసియాకప్‌లో అతడికి చోటివ్వలేదు. ఇక ఐసీసీ టీ20 ప్రపంచకప్‌ తుది 15 మందిలో తీసుకోలేదు. కనీసం రిజర్వుగా అయినా ఎంపిక చేయలేదు.




'టీ20 ప్రపంచకప్‌ ప్రణాళికల్లో సంజూ శాంసన్‌ ఉన్నాడు' అని ఐపీఎల్‌ తర్వాత బీసీసీఐ చీఫ్ సెలక్టర్‌ చేతన్‌ శర్మ అన్నాడు. 'సంజూలో చాలా సత్తా ఉంది. మ్యాచులను గెలిపించే సామర్థ్యం అతడికుంది' అని రోహిత్‌ మాట్లాడాడు. పైగా బ్యాక్‌ ఫుట్‌తో పంచులు ఇవ్వగలిగే అతడి బ్యాటింగ్‌ ఆసీస్‌లో ఎంతో కీలకం. ఇవన్నీ చెప్పడమే కాకుండా ఏ మాత్రం ఆకట్టుకోని రిషభ్ పంత్‌ను తీసుకోవడం సంజూ అభిమానులకు నచ్చలేదు.


ఐసీసీ టీ20 ప్రపంచకప్‌ జట్టును ప్రకటించనప్పటి నుంచి అతడికి మద్దతుగా ట్వీట్లు చేస్తూనే ఉన్నారు, సోషల్‌ మీడియాలో ప్రతి రోజు ఈ అంశాన్ని ట్రెండింగ్‌లో ఉంచుతున్నారు. సునిల్‌ గావస్కర్‌, రవిశాస్త్రి సహా మరికొందరు మాజీలు అతడిని తీసుకోకపోవడం ఆశ్చర్యం కలిగిందని పేర్కొన్నారు. ఆసీస్‌ బౌన్సీ పిచ్‌లు అతడి బ్యాటింగ్‌ శైలికి నప్పుతాయని అన్నారు. అయినప్పటికీ సెలక్టర్ల నుంచి స్పందన లేకపోవడంతో ఫ్యాన్స్‌ నిరసనలు తెలపాలని ప్లాన్‌ చేస్తున్నారు.