Lionel Messi Retirement: ఫుట్‌బాల్ లెజెండ్, అర్జెంటీనా సూపర్‌స్టార్ లయోనల్ మెస్సీ (Lionel Messi) సంచలన నిర్ణయం తీసుకున్నాడు. కతార్ ప్రపంచకప్ తన చివరిదని ప్రకటించాడు. 35 ఏళ్ల మెస్సీకి ఇది ఐదో ప్రపంచకప్ కావడం గమనార్హం. సెబాస్టియన్ విగ్నెలోకు ఇచ్చిన ఇంటర్వ్యూలో అతడీ విషయం వెల్లడించాడు.
'నా చివరి ప్రపంచకప్ ఇదేనా? అవును, కచ్చితంగా ఇదే. నేను శారీరకంగా మెరుగ్గా ఉన్నాను. ఈ ఏడాది నా ప్రీసీజన్ బాగా సాగింది. ఇంతకు ముందెప్పుడూ ఇలా ఉండేది కాదు. ఎందుకంటే గతంలో శిక్షణ ఆలస్యమయ్యేది. లయ లేకుండా ఆడేవాడిని. అప్పటికే టోర్నీ ఆరంభమయ్యేది. ఆలస్యంగా జాతీయ జట్టులో చేరేవాడిని. ఏదో ఒక గాయం ఉండేది. మొదలు పెట్టింది ముగించేవాడిని కాదు' అని మెస్సీ అన్నాడు.
'నేను ప్రపంచకప్ కోసం రోజులు లెక్క పెట్టుకుంటున్నాను. ఎందుకంటే మెగా టోర్నీ గెలవాలన్న ఉత్సాహం, ఆత్రుత ఉన్నాయి. ఏం జరుగుతుందో తెలియదు. ఇదే ఆఖరిదన్న ఫీలింగ్ ఉంది. ప్రపంచకప్ కోసం మేం ఎదురు చూడలేకపోతున్నాం. ఏదేమైనా రాణించాలని పట్టుదలగా ఉన్నాం' అని మెస్సీ వివరించాడు. 'మా జట్టులో మెరుగైన ఆటగాళ్లు ఉన్నారో లేరో చెప్పలేను. కానీ అర్జెంటీనా మాత్రం ఛాంపియన్ జట్టు. చరిత్ర చెబుతున్న నిజమిది. ప్రస్తుతానికి మేం ఫేవరెటైతే కాదు. సెలక్షన్ కీలకం అవుతుంది' అని పేర్కొన్నాడు.
అర్జెంటీనా మెస్సీ సారథ్యంలోనే 2014లో ఫైనల్‌కు చేరుకుంది. అయితే జర్మనీ చేతిలో ఓటమి చవిచూడాల్సి వచ్చింది. 2006, 2010, 2014, 2018 ప్రపంచకప్‌లో మెస్సీ 19 మ్యాచులాడి 6 గోల్సే చేశాడు. ప్రస్తుతం అతడు ఫ్రెంచ్ క్లబ్ ప్యారిస్ సెయింట్ జర్మన్‌కు ఆడుతున్నాడు. 47 మ్యాచుల్లో 19 గోల్స్ కొట్టాడు. అంతకు ముందు అతడు స్పానిష్ క్లబ్ బార్సిలోనాకు ఆడేవాడు. 778 మ్యాచుల్లో 672 గోల్స్ సాధించాడు. 2005లో జాతీయ జట్టు తరఫున అరంగేట్రం చేసిన మెస్సీ 164 మ్యాచుల్లో 90 గోల్స్ సాధించాడు.