మనీలాండరింగ్ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ బృందం 35 చోట్ల సోదాలు నిర్వహిస్తోంది. ఈడీ బృందం హైదరాబాద్‌, ఢిల్లీ, పంజాబ్ లలో దాడులు నిర్వహిస్తోంది.


ఢిల్లీలోని ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వం 2021-22 ఎక్సైజ్ పాలసీ కింద ఈ కుంభకోణానికి పాల్పడిందని ఆరోపణలు ఉన్నాయి. ఈ కేసులో ఢిల్లీ ఉపముఖ్యమంత్రి మనీష్ సిసోడియాపై కూడా ఎఫ్ఐఆర్ నమోదైంది. సిసోడియాపై సిబిఐ, ఈడి రెండూ కేసు నమోదు చేశాయి.






చర్యను ప్రశ్నించిన ఢిల్లీ సీఎం కేజ్రీవాల్  


ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ట్వీట్టర్‌లో ఈడీ చర్యను ప్రశ్నించారు. 500కుపైగా దాడులు, 300మందికి పైగా సీబీఐ, ఈడీ అధికారులు 3 నెలలుగా 24 గంటల పాటు పనిచేస్తున్నారని అభిప్రాయపడ్డారు. మనీష్ సిసోడియాకు వ్యతిరేకంగా సాక్ష్యాధారాలను వెలికితీయడానికి ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. అసలు కుంభకోణమే లేనందున ఏ సాక్ష్యాలు వాళ్లకు దొరకడం లేదన్నారు. ఇంతమంది అధికారుల సమయం నీచ రాజకీయాల కోసం వృథా అవుతోందని ఆవేదన వ్యక్తం చేశారు.  ఇలాంటి దేశం ఎలా అభివృద్ధి చెందుతుందని ప్రశ్నించారు. 






 


సెప్టెంబర్ 16న ఆరు రాష్ట్రాల్లోని 40 ప్రదేశాల్లో ఈడి దాడులు చేసింది. అంతకుముందు సెప్టెంబర్ 6న పలు రాష్ట్రాల ప్రముఖుల ఇళ్లపై ఈడీ దాడులు చేసింది. ఇదే సమయంలో ఈ కేసులో నిందితుల్లో ఒకరిగా చెబుతూ ఆమ్ ఆద్మీ పార్టీ కమ్యూనికేషన్ వ్యూహకర్త విజయ్ నాయర్‌ను అరెస్టు చేసింది. ఢిల్లీ కోర్టు అక్టోబర్ 20 వరకు ఆయనకు సీబీఐ కస్టడీకి పంపింది.