వీవీఎస్ లక్ష్మణ్... అదేనండీ మన వెరీ వెరీ స్పెషల్ లక్ష్మణ్ గురించి ఓ ఆసక్తికరమైన విషయం మీకు తెలుసా? అదేంటంటే... అతడు భారత జట్టుకు 16 సంవత్సరాలు బ్యాట్స్ మెన్‌గా సేవలు అందించాడు. కానీ దురదృష్టం ఏమిటంటే అతడు ఒక్కసారి కూడా ప్రపంచకప్ లాంటి మెగా టర్నీలో భారత్ తరఫున ఆడలేకపోవడం. ఏంటి? నమ్మలేకపోతున్నారా? కానీ, ఇది నిజం. ఇలాంటి మరిన్ని ఆశ్చర్యకరమైన ఎన్నో విషయాలు మీకోసం.
లక్ష్మణ్ 1996 నవంబరులో అంతర్జాతీయ జట్టులోకి అడుగుపెట్టాడు. అహ్మదాబాద్‌లో దక్షిణాఫ్రితా జరిగిన టెస్టు మ్యాచ్ ద్వారా అరంగేట్రం చేశాడు. 2001 లో ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్లో లక్ష్మణ్ 281 పరుగుల ఇన్నింగ్స్ ఎప్పటికీ మరిచిపోలేము. అప్పటి వరకు జట్టులోకి వస్తూ పోతూ ఉంటే లక్ష్మణ్ ఈ ఒక్క ఇన్నింగ్స్‌తో జట్టులో స్థానాన్ని స్థిరపరుచుకున్నాడు. ఆ తర్వాత పలు సార్లు జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషించిన లక్ష్మణ్ 2012లో ఆడిలైట్‌లో ఆస్ట్రేలియాతో చివరి టెస్టు ఆడాడు. అంతకుముందు 1999లొ సిడ్నీ టెస్టులో 167 పరుగులతో రాణించాడు.
డకౌట్‌తో ప్రారంభం... డకౌట్‌తో ముగింపు
ఇక్కడ మరో ఆసక్తికరమైన విషయం ఏంటో తెలుసా? లక్ష్మణ్ తన వన్డే కెరీర్‌ను డకౌట్‌తో ప్రారంభించాడు. అలాగే చివరి వన్డేలోనూ డకౌట్‌గానే వెనుదిరిగాడు. 1998 ఏప్రిల్‌లో వన్డే జట్టులోకి అడుగుపెట్టిన లక్ష్మణ్ 2006లో రిటైరయ్యాడు. సుమారు 16 సంవత్సరాల పాటు జట్టుకు సేవలు అందించిన లక్ష్మణ్ ప్రపంచకప్ లాంటి మెగా టోర్నీలో మాత్రం భారత్ నుంచి ప్రాతినిథ్యం వహించలేకపోయాడు.
థమ్ బిర్యానీ కాదు... రసం అంటే ఇష్టం
ఎవరికైనా హైదరాబాద్ పేరు చెప్పగానే గుర్తుకువచ్చేది థమ్ బిర్యానీ. అలాంటిది హైదరాబాద్ ఆటగాడైన లక్ష్మణ్ పూర్తి శాఖాహారి. ‘రసం’ అంటే అతడికి చాలా ఇష్టం. క్రికెట్‌తో పాటు లక్ష్మణ్‌కి లాన్ టెన్నిస్, బ్యాడ్మింటన్, స్క్వాష్ అంటే ఇష్టం. టెన్నిస్‌లో స్టెఫీ గ్రాఫ్, బెకర్ అభిమాన ఆటగాళ్లు. చదువులో లక్ష్మణ్ ఎంతో చురుకైన వాడు. 10వ తరగతి ఫైనల్ పరీక్షల్లో సైన్స్ సబ్జెక్ట్‌లో లక్ష్మణ్ 98% మార్కులు సాధించాడు.
వెరీ వెరీ స్పెషల్ పేరు ఎలా వచ్చింది?
వీవీఎస్ లక్ష్మణ్‌కి వెరీ వెరీ స్పెషల్ అనే పేరు ఎలా వచ్చిందో మీకు తెలుసా? 2003-3004 మధ్య భారత్-ఆస్ట్రేలియా మధ్య జరిగిన వన్డే సిరీస్‌లో లక్ష్మణ్ ఇన్నింగ్స్‌లు చూసిన ఆసీస్ లెజండరీ ఆటగాడు ఇయాన్ చాపెల్... వెరీ వెరీ స్పెషల్ అని అన్నాడు. అప్పటి నుంచి వెరీ వెరీ స్పెషల్ అనేది లక్ష్మణ్ ఇంటి పేరుగా మారిపోయింది.
* లక్ష్మణ్ తల్లిదండ్రులు వైద్యులు. భార్య పేరు శైలజ. లక్ష్మణ్‌కి ఇద్దరు పిల్లలు. భారత మాజీ ప్రధాని డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్‌కి దూరపు బంధువు లక్ష్మణ్. బాలీవుడ్ హీరో అమిర్ ఖాన్ అంటే లక్ష్మణ్‌కి ఎంతో ఇష్టం.