దగ్గుబాటి ఫ్యామిలీ మీడియాకు చాలా దూరంగా ఉంటుంది. సురేష్ బాబు ఫ్యామిలీ అయినా.. అప్పుడప్పుడు కొన్ని ఈవెంట్స్ లో కనిపిస్తుంటారు కానీ వెంకటేష్ ఫ్యామిలీ మాత్రం బయట ఎక్కడా పెద్దగా కనిపించదు. వెంకీకి ఇద్దరు ఆడపిల్లలు, ఒక మగబిడ్డ సంతానం. పెద్ద అమ్మాయి ఆశ్రితకి 2019లో పెళ్లి చేశారు. ఇక రెండో కూతురు సాఫ్ట్ వేర్ ఇండస్ట్రీలో రాణిస్తోంది. కొడుకు అర్జున్ ఇంకా చదువుకుంటున్నాడు. అయితే వెంకీ పెద్ద కూతురు ఆశ్రిత ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా పాపులర్ అవుతోంది. 



తాజాగా ఆమె ఇన్స్టాగ్రామ్ రిచ్ లిస్ట్ లో చోటు దక్కించుకుంది. ఆశ్రితకు కుకింగ్ అంటే చాలా ఇష్టం. ఫుడ్ బ్లాగర్ గా సోషల్ మీడియాలో మంచి పాపులారిటీ సంపాదించుకుంది. ఎప్పటికప్పుడు సరికొత్త వంటలను పరిచయం చేస్తూ హల్చల్ చేస్తుంటుంది. అలానే వేర్వేరు ప్రదేశాలను వెళ్లినప్పుడు అక్కడ స్పెషల్ వంటకాలను ట్రై చేస్తూ వాటి గురించి నెటిజన్లతో పంచుకుంటుంది. ఆమె ఇన్స్టాగ్రామ్ అకౌంట్ లో ఎనభై శాతం పోస్ట్ లు కుకింగ్ కి సంబంధించినవే ఉంటాయి. 




ఇక్కడితో ఆగలేదు ఆశ్రిత. ఇన్ఫినిటీ ప్లాటర్ అనే పేరుతో యూట్యూబ్ ఛానెల్ ఓపెన్ చేసింది. అందులో రకరకాల వంటకాల వీడియోలు షేర్ చేస్తుంటుంది. ఇటాలియన్, మెక్సికన్, లెబనన్, ఇండియన్ ఇలా ఒక్కటి కాదు.. డిఫరెంట్ కల్చర్స్ కి చెందిన కుకింగ్ వీడియోలను పోస్ట్ చేస్తుంటుంది. యూట్యూబ్ లో ఆమెకి 70 వేల సబ్ స్క్రైబర్లు ఉండగా.. ఇన్స్టాగ్రామ్ లో లక్ష నలభై వేల మంది ఫాలోవర్లు ఉన్నారు. తనకున్న ఫాలోయింగ్ ను బాగానే వాడుకుంటుంది ఆశ్రిత.  తన అకౌంట్ లో ఒక్కో పోస్ట్ పెట్టడానికి ఆమె 400 డాలర్లు తీసుకుంటుందని తెలుస్తోంది. 




ఇటీవల హోపర్ డాట్ కామ్ ఇన్స్టాగ్రామ్ లో ఎక్కువ సంపాదిస్తోన్న సెలబ్రిటీల జాబితాను చేసింది. ఇందులో అందరికంటే ముందు స్థానంలో ఫుట్ బాల్ ప్లేయర్ క్రిస్టియానో రోనాల్డో నిలిచాడు. అతడు ఒక్కో పోస్ట్ కి దాదాపు రూ.11.9కోట్లు తీసుకుంటున్నారు. ఆ తరువాత ఇండియా నుండి విరాట్ కోహ్లీ (రూ.5 కోట్లు), ప్రియాంక చోప్రా(రూ.3 కోట్లు) లాంటి తారలు చోటు దక్కించుకున్నారు. ఈ మొత్తం లిస్ట్ లో హాలీవుడ్ సెలబ్రిటీలే ఎక్కువగా ఉన్నారు. అయితే ఇందులో వెంకీ డాటర్ ఆశ్రితకి చోటు దక్కడంవిశేషం . ఈ లిస్ట్ లో ఆమె 377వ స్థానంలో నిలవగా.. ఆసియా మొత్తంలో 27వ ర్యాంక్ లో ఉంది. ప్రస్తుతం ఆశ్రిత తన భర్త వినాయక్ రెడ్డితో కలిసి స్పెయిన్ లోని బార్సిలోనాలో సెటిల్ అయింది.