ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఏపీపీఎస్సీ) నిర్వహించే అన్ని పోటీ పరీక్షలకు సంబంధించి ఇంటర్వ్యూలను (Interviews) రద్దు చేస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. గ్రూప్-1 సహా మిగతా పోస్టుల భర్తీకి నిర్వహించే మౌఖిక పరీక్షలను ఎత్తివేస్తున్నట్లు తెలిపింది. దీనికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్య నాథ్ దాస్ ఉత్తర్వులు జారీ చేశారు. ఏపీపీఎస్సీ ద్వారా భర్తీ చేసే ఉద్యోగాలకు ఇకపై ఇంటర్వ్యూలు ఉండబోవని స్పష్టం చేశారు. పోటీ పరీక్షల్లో పారదర్శకత ఉండాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ఇది తక్షణమే అమల్లోకి వస్తుందని పేర్కొన్నారు. గ్రూప్-1 సహా మిగతా పరీక్షలకు ప్రిలిమ్స్ పరీక్ష నిర్వహించకుండా రాతపరీక్ష ద్వారా మాత్రమే అర్హులను ఎంపిక చేయాలని కమిషన్ నిర్ణయించిందని వెల్లడించారు. భర్తీ ప్రక్రియ త్వరగా పూర్తయ్యే అవకాశం..ఏపీపీఎస్సీ పరీక్షల్లో ఇంటర్వ్యూల రద్దు వల్ల నియమకాల ప్రక్రియ త్వరగా పూర్తయ్యే అవకాశం ఉంది. రాత పరీక్షల్లో మెరుగైన మార్కులు సాధించినా కూడా పలువురు అభ్యర్థులు ఇంటర్వ్యూలలో ఫెయిలవుతున్నారు. బోర్డు సభ్యులు అడిగే ప్రశ్నలకు సమాధానం ఇచ్చేందుకు తడబడుతున్నారు. సబ్జెక్టుకు సంబంధించి మంచి పరిజ్ఞానం ఉన్నా కూడా ఇంటర్వ్యూలను ఎదుర్కొనలేకపోతున్నారు. దీని వల్ల మానసిక ఒత్తిడికి లోనవుతున్నారు. అలాగే కొన్నేళ్ల నుంచి ఏపీపీఎస్సీ ఇంటర్వ్యూలో కొందరు అభ్యర్థులు అక్రమాలకు పాల్పడుతున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వల్ల నియామకాల్లో అవకతవకలు జరగకుండా ఉండటంతో పాటు ఇంటర్వ్యూలు త్వరతగతిన పూర్తయ్యే అవకాశం ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
APPSC EXAM: ఇకపై నో ఇంటర్వ్యూస్... ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం
ABP Desam | 07 Jul 2021 12:36 AM (IST)
Andhra Pradesh Public Service Commission: ఏపీపీఎస్సీ నిర్వహించే అన్ని పోటీ పరీక్షలకు సంబంధించిన ఇంటర్వ్యూలను రద్దు చేస్తున్నట్లు ఏపీ ప్రభుత్వం ప్రకటించింది.
Appsc
Published at: 03 Jul 2021 06:03 PM (IST)