మన తెలుగమ్మాయి అంతరిక్షంలోకి అడుగుపెట్టబోతోంది. గుంటూరు జిల్లాకు చెందిన శిరీష బండ్ల (Sirisha Bandla) ఈ అరుదైన ఘనత సాధించనున్నారు. కల్పనా చావ్లా తర్వాత రోదసియానం చేయనున్న భారత సంతతికి చెందిన రెండో మహిళగా చరిత్ర లిఖించనున్నారు. అమెరికాకు చెందిన ప్రముఖ అంతరిక్ష సంస్థ 'వర్జిన్ గెలాక్టికా' జూలై 11న మానవ సహిత వ్యోమ నౌక 'వీఎస్ఎస్ యూనిటీ 22'ని నింగిలోకి పంపనుంది. దీనికి సంబంధించి సంస్థ పంచుకున్న వీడియోలో శిరీష సెంటర్ ఆఫ్ ఎట్రాక్షన్ అయింది. ఈ యాత్రలో భాగంగా ఆమె పరిశోధనా అంశాలను (Resarcher Experience) పర్యవేక్షించనున్నారు. 


 






ఈ పర్యటనలో వర్జిన్ గెలాక్టికా సంస్థ వ్యవస్థాపకుడు రిచర్డ్ బ్రాన్సన్, శిరీష సహా మరో నలుగురు పాలుపంచుకోనున్నారు. ఈ యాత్ర విజయవంతం అయితే అంతరిక్షంలోకి అడుగుపెట్టిన తొలి తెలుగు మహిళగా, భారత్ నుంచి రోదసిలోకి వెళ్లిన నాలుగో వ్యోమగామిగా శిరీష గుర్తింపు పొందుతారు. ఇప్పటివరకు రాకేశ్ శర్మ, కల్పనా చావ్లా, భారత అమెరికన్ సునీతా విలియమ్స్ అంతరిక్షంలోకి అడుగుపెట్టారు.  
చిన్ననాటి నుంచే అంతరిక్షంపై ఆసక్తి..
ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరు జిల్లాకు చెందిన మురళీధర్, అనురాధ దంపతుల కుమార్తె శిరీష. శిరీష పుట్టాక కుటుంబం అంతా అమెరికా వెళ్లి అక్కడే స్థిరపడింది. ప్రస్తుతం వాషింగ్టన్‌లో నివాసం ఉంటున్నారు. శిరీష ఊహ తెలిసినప్పటి నుంచే అంతరిక్షంపై ఆసక్తి కనపరిచేవారు. చిన్ననాటి నుంచే పైలట్ లేదా వ్యోమగామి అవుదామని అనుకున్నారు. అయితే కంటి సంబంధిత సమస్యలు ఉండటం వల్ల ఆ నిర్ణయాన్ని విరమించుకున్నారు.


 



 





శిరీష జార్జ్‌టౌన్ యూనివర్సిటీలో ఎంబీఏ, పర్‌డ్యూ (Purdue) యూనివర్సిటీలో ఏరోనాటికల్ ఇంజనీరింగ్‌లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. శిరీష 2015 నుంచి వర్జిన్ గెలాక్టిక్‌లో పనిచేస్తున్నారు. ప్రస్తుతం వర్జిన్ గెలాక్టిక్‌ కంపెనీలో ప్రభుత్వ వ్యవహారాలకు ఉపాధ్యక్షురాలిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. వర్జిన్ గెలాక్టిక్‌లో చేరేముందు టెక్సాస్‌లో ఏరోనాటికల్ ఇంజనీర్‌గా పనిచేశారు. శిరీషకు ఒక అక్క ఉన్నారు. 2016లో కుటుంబానికి సంబంధించిన ఓ శుభకార్యంలో పాల్గొనేందుకు శిరీష గుంటూరు జిల్లా తెనాలికి వచ్చి వెళ్లారు. ఇదిలా ఉండగా, త్వరలోనే శిరీష వివాహం చేసుకోబోతున్నట్లు సమాచారం. 





గౌరవంగా భావిస్తున్నాను.. 

ఈ అద్భుతమైన సిబ్బందితో యూనిటీ 22 టెస్ట్ ఫ్లైట్‌లో భాగమవ్వడాన్ని తనకు దక్కిన గౌరవంగా భావిస్తున్నానని శిరీష తెలిపారు. ఈ విమానంలో తాను పరిశోధకుల అనుభవాన్ని పరీక్షిస్తానని చెప్పారు. ఆమె ఈ మేరకు ట్వీట్ చేశారు. అంతరిక్షంలోకి వెళ్లబోతోన్న తొలి తెలుగమ్మాయి శిరీషకు సోషల్‌ మీడియా వేదికగా పలువురు ప్రముఖులు, నెటిజన్లు అభినందనలు తెలుపుతున్నారు. కాగా, వర్జిన్‌ గెలాక్టిక్‌ సంస్థ ఇప్పటికే మూడుసార్లు స్పేస్‌ ఫ్లైట్లను ఆకాశంలోకి పంపింది. నాలుగో ప్రయోగంలో భాగంగా తొలిసారి మనుషులను రోదసిలోకి తీసుకెళ్లనుంది. అంతరిక్షయానాన్ని ప్రోత్సహించడమే తమ లక్ష్యమని సంస్థ అధినేత రిచర్డ్ బ్రాన్సన్ వెల్లడించారు. ఈ యాత్రలో శిరీషతో పాటు రిచర్డ్‌ బ్రాన్సన్‌, బెత్‌ మోసెస్‌, కొలిన్‌ బెన్నెట్‌, దేవ్‌ మాకీ, మైకేల్‌ మాసుకీ ఉంటారు.