Indian Cricket Team: టీమ్‌ఇండియా ఓపెనర్ కేఎల్ రాహుల్ (KL Rahul) గాయం నుంచి పూర్తిగా కోలుకున్నాడు. బెంగళూరులోని జాతీయ క్రికెట్ అకాడమీలో కఠినంగా సాధన చేస్తున్నాడు. నెట్స్‌లో మహిళా పేసర్ జులన్ గోస్వామి (Jhulan Goswami) బౌలింగ్‌లో అతడు ప్రాక్టీస్ చేస్తున్న వీడియో తాజాగా వైరల్ అయింది.
ఐపీఎల్ 2022 ముగిసిన తర్వాత కేఎల్ రాహుల్ జాతీయ జట్టుకు ఆడలేదు. వరుసగా అన్ని సిరీసులకు దూరమయ్యాడు. ఐపీఎల్ తర్వాత టీమ్‌ఇండియా మొదట దక్షిణాఫ్రికాతో పరిమిత ఓవర్ల క్రికెట్ ఆడింది. ఈ సిరీసుకు సెలక్టర్లు అతదినే కెప్టెన్‌గా ప్రకటించారు. తొలి మ్యాచు ముందు రోజు సాధన చేస్తుండగా అతడు గాయపడ్డాడు. దీంతో సిరీస్ మొత్తానికీ దూరమయ్యాడు. ఆ తర్వాత ఐర్లాండ్‌కూ ఎంపికవ్వలేదు. ఇంగ్లాండ్‌కు పంపించాలని టీమ్ మేనేజ్‌మెంట్ ఎంతగానో ప్రయత్నించింది. గాయం త్వరగా నయం కాకపోవడంతో ఎన్‌సీయేలోనే ఉండిపోయాడు.
తాజాగా వెస్టిండీస్ సిరీస్‌కు రాహుల్‌ను ఎంపిక చేశారు. అయితే ఫిట్‌నెస్ ప్రమాణాలను అనుసరించే ఎంపిక ఉంటుందని సెలక్టర్లు ముందే స్పష్టం చేశారు. అంటే ఇప్పుడు ఫిట్‌నెస్ నిరూపించుకుంటేనే అతడు కరీబియన్ దీవులకు వెళ్తాడన్నమాట. ఇదే సమయంలో అతడు ఎన్‌సీఏలో సాధన చేస్తున్న వీడియో బయటకు వచ్చింది. ముఖ్యంగా మహిళా పేసర్ జులన్ గోస్వామి బౌలింగ్‌లో సాధన చేస్తుండటం ప్రత్యేకంగా అనిపించింది.
గతంలో అమ్మాయిలకు అర్జున్ తెందూల్కర్ నెట్స్‌లో బౌలింగ్ చేశాడు. ఇంగ్లాండ్‌లో ప్రపంచ కప్ ఆడుతున్నప్పుడు ఈ ఘటన చోటు చేసుకుంది. కానీ అబ్బాలకు అమ్మాయిలు బౌలింగ్ చేయడం బహుశా ఇదే తొలిసారి. మరి విండీస్ టూర్‌కు రాహుల్ ఎంత సంసిద్ధంగా ఉన్నాడో ఒకట్రెండు రోజుల్లో తేలిపోతుంది.
విండీస్ సిరీస్‌కు టీమ్‌ఇండియా జట్టు: రోహిత్ శర్మ, ఇషాన్ కిషన్, కేఎల్ రాహుల్*, సూర్యకుమార్ యాదవ్, శ్రేయస్ అయ్యర్, దినేశ్ కార్తీక్, రిషభ్ పంత్, హార్దిక్ పాండ్య, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, రవిచంద్రన్ అశ్విన్, రవి బిష్ణోయ్, కుల్‌దీప్ యాదవ్*, భువనేశ్వర్ కుమార్, అవేశ్ ఖాన్, హర్షల్ పటేల్, అర్షదీప్ సింగ్