KL Rahul Athiya Shetty Wedding: టీమ్‌ఇండియాలో మరో క్రికెటర్‌ బ్యాచిలర్‌ జీవితానికి గుడ్‌బై చెప్పేయబోతున్నాడు. ఐసీసీ టీ20 ప్రపంచకప్‌ తర్వాత కేఎల్‌ రాహుల్‌, అతియా శెట్టి పెళ్లి పీటలు ఎక్కనున్నారు. ఇంకా తేదీ, ముహూర్తం ఫిక్స్‌ చేయనప్పటికీ నవంబర్‌-డిసెంబర్లో వివాహ వేడుక ఉండొచ్చని సమాచారం. ఈ జోడీ తమ పెళ్లి వేదికను ఎంచుకున్నారని తాజాగా తెలుస్తోంది. ఇతర సెలబ్రిటీల తరహాలో వీరు డెస్టినేషన్‌ వెడ్డింగ్‌, ఫైవ్‌ స్టార్‌ హోటల్‌నో ఎంచుకోలేదు. ఖండాలాలో సునీల్‌ శెట్టి ఇంట్లోనే ఒక్కటవ్వనున్నారని తెలిసింది.


కొన్నేళ్లుగా డేటింగ్‌


మూడు, నాలుగేళ్లుగా కేఎల్‌ రాహుల్‌, బాలీవుడ్‌ స్టార్‌ సునీల్‌ శెట్టి కుమార్తె అతియాశెట్టితో డేటింగ్‌ చేస్తున్నాడు. రెండేళ్ల పాటు రహస్యంగా ప్రేమించుకున్నారు. అయితే ఏడాది క్రితం వీరిద్దరూ తమ అనుబంధం గురించి బయటకు చెప్పారు. వీరి కోసం 2022 వింటర్‌ వెడ్డింగ్‌ ముహూర్తం పెట్టారని సన్నిహిత వర్గాల ద్వారా తెలిసినట్టు పింక్‌విల్లా ఇంతకు ముందే రిపోర్టు చేసింది. ఇప్పటికే సునిల్‌ శెట్టి ఫ్యామిలీ పెళ్లి పనులు మొదలు పెట్టారని తెలిపింది. తాజాగా ఖండాలా నివాసం 'జహాన్‌'ను ఈ వేడుక కోసం ఎంచుకున్నారని పేర్కొంది.


ప్యాలెస్‌ను మించే!


ముంబయిలోని ఖండాలా పర్వత ప్రాంతం. భూమికి ఆకుపచ్చని చీర కట్టినట్టుగా ప్రకృతి సౌందర్యంతో అలరారుతుంది. రణగొణ ధ్వనులు లేకుండా జల జలపారే జలపాతాలతో హాయి గొలుపుతుంది. కోటీశ్వరులు అక్కడ రాజభవనాల్లాంటి ఇల్లు కట్టుకుంటారు. కొన్నేళ్ల క్రితమే సునీల్‌ శెట్టి ఎంతో ప్రత్యేకంగా తన ఇంటిని నిర్మించుకున్నారు. అటు సాంకేతికత, ఇటు ప్రకృతి రమణీయతల కలబోతగా ఉంటుంది. రాళ్ల గోడలు, చెక్కతో ఇంటీరియర్‌ను డిజైన్‌ చేయించారు. ఇంట్లోనే చెట్లు ఉంటాయి. ప్రశాంతతకు చిహ్నంగా బుద్ధుడి ప్రతిమలు ప్రతిష్ఠించారు.



ఇప్పుడైతే బిజీ బిజీ!


ప్రస్తుతం కేఎల్‌ రాహుల్‌ బిజీగా ఉన్నాడు. కొన్నాళ్లు గాయంతో దూరమైన అతడు ఇప్పుడిప్పుడే టీమ్‌ఇండియాకు రెగ్యులర్‌గా ఆడుతున్నాడు. ఐసీసీ టీ20 ప్రపంచకప్‌ గెలవాలంటే అతడు ఆడటం ఎంతో కీలకం. ఈ మధ్యలోనే ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా సిరీసులు ఉన్నాయి. ప్రపంచకప్‌ తర్వాత భారత్‌కు వరుస మ్యాచులు ఉన్నాయి. దాంతో అతడి తీరికను బట్టి పెళ్లి ముహూర్తం నిర్ణయిస్తామని అతియా శెట్టి తండ్రి సునీల్‌ శెట్టి ఈ మధ్యే అన్నారు. ప్రస్తుతం వెడ్డింగ్‌ ప్లానర్లు ఖండాలాలోని 'జహాన్‌'ను సందర్శించారని, ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారని తెలిసింది.