Khelo India, Osmania University:
ఖేలో ఇండియా యూనివర్సిటీ పోటీల్లో ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు అదరగొడుతున్నారు. మహిళల టెన్నిస్‌లో వరుసగా మూడోసారి ఫైనల్‌కు దూసుకెళ్లారు. తిరుగులేని విధంగా ఆధిపత్యం చెలాయిస్తున్నారు. ఓయూ ఇప్పటికే రెండుసార్లు బంగారు పతకాలు సాధించడం గమనార్హం.
ఉత్తర్‌ప్రదేశ్‌లోని లక్నోలో ఖేలో ఇండియా యూనివర్సిటీ పోటీలు జరుగుతున్నాయి. బీబీడీ యూనివర్సిటీలోని ఏకనా టెన్నిస్ కోర్టులో జరిగిన సెమీ ఫైనల్లో యూనివర్సిటీ ఆఫ్ మద్రాస్‌ను 2-1 తేడాతో ఉస్మానియా యూనివర్సిటీ ఓడించింది. మొదట జరిగిన సింగిల్స్‌లో అదితి అరె (ఓయూ) 6-1, 6-0 తేడాతో రితికా (మద్రాస్)ను వరుస సెట్లలో ఓడించింది. అయితే మరో సింగిల్స్‌లో ఓమ్నా యాదవ్ (ఓయూ) 6-0, 6-1 తేడాతో అనన్య (మద్రాస్) చేతిలో ఓటమి చవిచూసింది.
ఇక కీలకమైన మహిళల డబుల్స్‌లో ఉస్మానియా దుమ్మురేపింది. అదితి, ఓమ్నా 6-2, 7-6 (7-1) తేడాతో సాయి దివా, అనన్య (మద్రాస్) జోడీని ఓడించారు. నువ్వా నేనా అన్నట్టుగా సాగిన ఈ పోరులో ఓయూ అమ్మాయిలు ట్రై బేకర్‌లో గెలిచారు. ఈ మ్యాచులో అదితి తన పవర్ గేమ్‌ను ప్రదర్శించింది. కోర్టు మొత్తం తిరుగులూ బలమైన ఫోర్‌హ్యాండ్ షాట్లతో విరుచుకుపడింది. ఇద్దరూ కలిసి మంచి స్ట్రోక్‌ప్లేతో అలరించారు. ఖేలో ఇండియా మహిళల టెన్నిస్ పోటీల్లో తమ విద్యార్థులు వరుసగా మూడోసారి ఫైనల్ చేరుకోవడం సంతోషంగా ఉందని ఓయూ కోచ్, మేనేజర్ ఫరూఖ్ కమాల్ అన్నారు.